
న్యూఢిల్లీ: బిహార్‌లో ప్రజల ఓటు హక్కును హరించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి చేస్తున్న ఆ పార్టీకి బిహార్ ఓటర్లు గుణపాఠం చెబుతారని అన్నారు. ఎలక్షన్ కమిషన్ మద్దతుతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ద్వారా బిహార్‌లో కోట్లాది మంది ప్రజల ఓటు హక్కును హరించేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్ రూపొందించిందన్నారు. దీనిపై ప్రజలు, ప్రతిపక్షాలు ఎదురుదాడి చేయడంతో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసిందని ఆదివారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
‘‘ఫస్ట్ నుంచి ఎస్‌ఐఆర్‌కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. ఎన్నికల్లో ప్రజలు వారి ఓటును వినియోగించడానికి తమ డ్యాక్యుమెంట్లను చూపించాలని ఎందుకు అడుగుతున్నారు. పేదలు, బలహీనులు, అణగారిన వర్గాలు, దళితులు, అణచివేతకు గురైన, వెనుకబడిన వర్గాల ప్రజల ఓటు హక్కును బలవంతంగా లాక్కోవడం కోసం ఎస్‌ఐఆర్‌ను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుట్రపూరితంగా తీసుకొచ్చాయి. ఈ ఎస్‌ఐఆర్ కారణంగా దాదాపు 8 కోట్ల మంది ప్రజలు నష్టపోతారు. ఓటరు జాబితాను సరిదిద్దే బాధ్యత ప్రజలది కాదు.. ఎలక్షన్ కమిషన్‌ది”అని ఖర్గే వెల్లడించారు.