
క్రూరమైన మూగజీవాలను జంతు ప్రదర్శనశాలల్లో (జూ) చూస్తేనే ఒక్కోసారి భయం వేస్తుంది. అవే చేసే శబ్దాలు వింటే కొంతమంది భయంతో వణికిపోతారు. ఇక సింహం, పులులను ఎన్ క్లోజర్స్ నుంచి చూస్తేనే భయపడిపోతుంటారు. అలాంటిది సింహమే నేరుగా దాడి చేసేందుకు వస్తే పరిస్థితి ఏంటి..? ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
కొన్నిసార్లు సింహం, పులి లాంటి జంతువులు జనావాసాల్లోకి వచ్చి దాడులు చేస్తుంటాయి. గతంలో ఇలాంటి ఘటనల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ సింహం విద్యుత్ వెలుగుల్లో జరుగుతున్న ఓ ఫంక్షన్ లోకి (పార్టీ) చొరబడింది. దీంతో అక్కడ ఉన్న వారందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.
ఫంక్షన్ జరుగుతున్న ప్రాంతంలోకి సింహం రావడంతో అందరూ అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. ఓ వ్యక్తి మాత్రం పరుగెత్తుకుంటూ వెళ్లి అక్కడే ఉన్న ఓ కొబ్బరి చెట్టును ఎక్కాడు. ఆ వ్యక్తిని టార్గెట్ చేసుకున్న సింహం.. కొబ్బరి చెట్టు ఎక్కినా వదల్లేదు. సింహం కూడా కొబ్బరి చెట్టు ఎక్కి ఆ వ్యక్తిని వేటాడే ప్రయత్నం చేసింది. అయితే చెట్టు చివరికి ఎక్కిన వ్యక్తి కాళ్లతో సింహాన్ని తన్నాడు. కానీ, ఆ తర్వాత సింహం సదరు వ్యక్తిని ఏం చేసింది..? అనేది మాత్రం వీడియోలో లేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
lions.habitat అనే వ్యక్తి తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోను పోస్టు చేశారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది..? ఎప్పుడు జరిగింది..? వంటి వివరాలను వెల్లడించలేదు. పలువురు నెటిజన్లు ఈ వీడియోపై తమకు తోచినట్లు కామెంట్స్ చేస్తున్నారు.