పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నారు: జాజుల శ్రీనివాస్ గౌడ్

పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నారు: జాజుల శ్రీనివాస్ గౌడ్
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

ముషీరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను రిలీజ్ చేయకుండా స్టూడెంట్ల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించకుండా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నారని విమర్శించారు.

మంగళవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ విద్యార్థి, యువజన సంఘాల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీనికి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకాల శ్యాంకుర్మ, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కులకచర్ల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. సమావేశానికి జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు.

విద్యార్థుల బలిదానాలతో వచ్చిన  రాష్ట్రంలో చదువు కోసం మళ్లీ సమరం సాగించవలసిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఫీజు బకాయిలను ఇంకెప్పుడు విడుదల చేస్తారని జాజుల నిలదీశారు. విద్యలో సామాజిక న్యాయ సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 8 వరకు బీసీ విద్యార్థి, యువజన పోరుయాత్ర నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న బీసీ యువతను సామాజికంగా, రాజకీయంగా చైతన్యం చేస్తామన్నారు.