హుస్సేన్​సాగర్ కాలుష్య పరిష్కారం ఇంకెన్నడు?

హుస్సేన్​సాగర్ కాలుష్య పరిష్కారం ఇంకెన్నడు?

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ జోన్, చెన్నైలో 24 ఏప్రిల్ 2015న హుస్సేన్​సాగర్ కాలుష్యంపై  ప్రజా-చైతన్య వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసును ఏడేండ్ల  తర్వాత, 6 జులై 2022న ఢిల్లీలోని ప్రిన్సిపల్ బెంచ్‌‌‌‌తో కూడిన ప్రత్యేక బెంచ్ పరిష్కరించింది. అయితే ప్రజా ప్రయోజనాల కోసం దాఖలైన ఈ కేసు సరైన పరిష్కారం లభించకుండానే ముగిసింది. హుస్సేన్​సాగర్ కాలుష్యం, ఆక్రమణలను అరికట్టడానికి 2015 నుంచి 2022 వరకూ న్యాయస్థానంలో  వ్యాజ్యం కొనసాగినా హుస్సేన్​సాగర్ పరిస్థితి యధాతథంగానే కొనసాగుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48ఎ,  ఆర్టికల్ 51ఎ(జి) పౌరుల ప్రాథమిక విధులు, నిర్దేశిక సూత్రాలను తెలియజేస్తాయి. పర్యావరణాన్ని రక్షించడమేకాదు దాన్ని మెరుగుపరచడం కూడా పౌరుల ప్రాథమిక బాధ్యత. 

హైదరాబాద్ హుస్సేన్​సాగర్​కు 460 సంవత్సరాల పురాతన చారిత్రక నేపథ్యం ఉంది. ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనలో హజ్రత్ హుస్సేన్ షా వలీ 1562లో  దీన్ని నిర్మించారు. ఇది మూసీ నది ఉపనదిపై నిర్మించిన  సుమారు 24 చదరపు కిలోమీటర్ల సరస్సు. హుస్సేన్​సాగర్ జలాలు రంగారెడ్డి జిల్లాలోని జనవాడ గ్రామానికి బల్కాపూర్ నాలా ద్వారా,  గ్రావిటీ ద్వారా, ఉస్మాన్ సాగర్ (గండిపేట) పరివాహక ప్రాంతాల నుంచి,  సూరారం గ్రామం నుంచి 25 కిలోమీటర్ల ఎగువన కూకట్‌‌‌‌పల్లి నాలా ద్వారా అనుసంధానించి ఉంది. హుస్సేన్​సాగర్ పరీవాహక ప్రాంతం దాదాపు 285 చదరపు కిలోమీటర్లు, ఇది మొత్తం జీహెచ్ఎంసీ ప్రాంతంలో 45శాతం అంటే సుమారు 650 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది.  కానీ, సువిశాలమైన హుస్సేన్​సాగర్ ఆక్రమణలు, కాలుష్యాన్ని ఎదుర్కొంటోంది, ఈ కారణంగా  కుంచించుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. హుస్సేన్​సాగర్‌‌‌‌ నిరంతరం కలుషితమవడం కేసు నమోదు చేయడానికి ప్రేరేపించింది. కాలుష్య హుస్సేన్​సాగర్ ప్రక్షాళన కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానీ పని జరిగింది లేదు. 
        ఆక్రమణల కారణంగా వెయ్యి ఎకరాల విస్తీర్ణంలోని సాగర్ 2015 నుంచి మరింతగా కుంచించుకుపోయింది. హుస్సేన్​సాగర్ ఉనికికి ముప్పు ఏర్పడటంతో ఏప్రిల్ 2015లో  నేషనల్ గ్రీన్  ట్రిబ్యునల్​లో  కేసు దాఖలైంది. హుస్సేన్​సాగర్లోని కలుషిత జలాలను మూసీ నదిలో కలుపుతూ ఆ నీటిని దిగువకు వదిలేస్తున్నారని ట్రిబ్యునల్​కు విన్నవించడమైనది. కలుషిత జలాల ప్రవాహాన్ని నిలిపివేయాలని, సరస్సులోకి వర్షపు నీరు మాత్రమే ప్రవేశించేలా చర్యలు తీసుకుని సరస్సును పునరుద్ధరించేలా ఆదేశించాలని ఎన్జీటీని కోరడమైంది.  స్వచ్ఛమైన గాలి, నీరు, గౌరవంతో జీవించే హక్కు రాజ్యాంగం అందించిన పౌరుని ప్రాథమిక హక్కు.

నలభై రోజుల్లో- మూడు కోర్టులు

మే 1, 2015న ట్రిబ్యునల్ హుస్సేన్​సాగర్‌‌‌‌లో జలాలను డీవాటరింగ్ చేయడం లేదా బయటకు పంపడంపై స్టే విధించింది. కానీ, మే7, 2015న తెలంగాణ ప్రభుత్వం ఎక్స్-పార్టీ స్టేను పొందింది. ఎన్జీటీ చట్టం 2010 ప్రకారం జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను అపెక్స్ కోర్టులో మాత్రమే సవాలు చేయవచ్చని హైదరాబాద్‌‌‌‌లోని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పుడు, దానిని పరిగణనలోకి తీసుకోలేదు. స్టే ఆర్డర్‌‌‌‌ను సుప్రీంకోర్టులో సవాలు చేశారు. 31 మే 2015న అపెక్స్ కోర్టు 'తూములకు మరమ్మతుల' పేరుతో సరస్సును ఖాళీ చేయకూడదని ఎన్జీటీ సౌత్ జోన్ ద్వారా నిపుణుల కమిటీని నియమించాలని ఆదేశించింది. నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని కోరింది. ఆ విధంగా దాదాపు 40 రోజుల వ్యవధిలో ఈ కేసు చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీలో మూడు న్యాయవ్యవస్థ పరిధుల్లో ప్రయాణించి తిరిగి చెన్నై ఎన్జీటీకి తిరిగి వచ్చింది. ట్రిబ్యునల్​లో కేసు జాబితా అయినా విచారణ లేకుండానే వాయిదా పడింది. ఆ తరువాత, సదరన్ బెంచ్ ఖాళీ అవగా దానిని వెంటనే భర్తీ చేయలేదు. 2019-–2020 కొవిడ్ 19 కాలంలో వీడియో కాన్ఫరెన్సింగ్ క్రమంగా పునఃప్రారంభం కావడానికి ముందు న్యాయవ్యవస్థ చాలాకాలం పాటు సజావుగా జరగలేదు. అక్టోబరు 2015లో ఇద్దరు సభ్యుల కమిటీ నివేదిక సమర్పించింది. ఎటువంటి ప్రశ్నలు లేదా సమాధానాలు లేకుండానే ప్రభుత్వం ఇచ్చిన అన్ని పత్రాలను తీసుకుని కమిటీ అందజేసింది. హుస్సేన్​సాగర్ వాగు వద్ద ఉన్న గుంతల సంఖ్య కూడా నివేదికలో తప్పుగా ఉంది. దీని కారణంగా సరస్సు నుంచి  వ్యర్థాల ప్రవాహాన్ని లెక్కించడంలో కూడా తప్పు జరిగింది. 14 సెప్టెంబర్ 2020 నాటి ఆర్డర్ ద్వారా ట్రిబ్యునల్ దరఖాస్తుదారు లేవనెత్తిన అన్ని అంశాలను హైలైట్ చేసింది. కొత్త కమిటీని నియమించింది. అయితే, ఇంకా సరస్సును దెబ్బతీసిన తీవ్రమైన సమస్యలు పరిష్కారమవలేదు.  ట్రిబ్యునల్, ట్రిబ్యునల్ నియమించిన జాయింట్ కమిటీ ద్వారా  సాగర్ సమస్యలు ఎటువంటి పరిష్కారానికి నోచుకోలేదు.

ప్రతివాదులతో జాయింట్​ కమిటీ ఏర్పాటు

హుస్సేన్​సాగర్‌‌‌‌ ప్రక్షాళన కోసం గ్లోబల్ టెండర్‌‌‌‌లు వేసిన తర్వాత మ్యాట్రిక్స్ కంపెనీకి హెచ్‌‌‌‌ఎండిఎ కాంట్రాక్ట్ ఇచ్చింది. కంపెనీకి అనుభవం లేకపోయినప్పటికీ సరస్సు శుభ్రపరిచేందుకు మ్యాట్రిక్స్‌‌‌‌కు ఇచ్చిన కాంట్రాక్టుకు సంబంధించి అధికారులు ఒక్క డాక్యుమెంట్ కూడా ఇవ్వలేదని జాయింట్ కమిటీ స్వయంగా తన నివేదికలో పేర్కొంది. అన్ని సాక్ష్యాధారాలు వివరంగా ట్రిబ్యునల్‌‌‌‌కు సమర్పించబడ్డాయి, అయితే, ట్రిబ్యునల్ నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ జాయింట్ కమిటీ ఈ విషయాన్ని విచారించలేదు. కాగా,  ట్రిబ్యునల్‌‌‌‌ను ధిక్కరించినందుకు జరిమానా విధిస్తామని హెచ్చరించినప్పుడు మాత్రమే ప్రభుత్వం ట్రిబ్యునల్‌‌‌‌కు ‘యాక్షన్ ప్లాన్’ సమర్పించింది. కలుషిత జలాలను మళ్లించేందుకు 31 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, మురుగునీటి పైపు లైన్లు వేయాలని  ఇంటర్‌‌‌‌సెప్షన్, డైవర్షన్ స్ట్రక్చర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సమర్పించింది. కానీ, ఇప్పటివరకు డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సమర్పించడంలో ప్రభుత్వం విఫలమయింది. 

సాగర్​ పరిరక్షణలో ప్రభుత్వ నిర్లక్ష్యం

ఇప్పటికే  హుస్సేన్​సాగర్ క్యాచ్‌‌‌‌మెంట్ ఇంప్రూవ్‌‌‌‌మెంట్ ప్రాజెక్ట్ (హెచ్సీఐపీ)పై 2016 వరకు జపనీస్ సహాయంతో (జేఐసీఎ) ఆరేండ్ల ప్రాజెక్ట్‌‌‌‌లో రూ.360 కోట్లు ఖర్చు చేశారు, అయినప్పటికీ ఫలితం లేదు. హుస్సేన్​సాగర్ ఎఫ్టీఎల్ సరిహద్దు మ్యాప్ ఇప్పటి వరకు ప్రకటించలేదని పిటిషనర్ ఫ్లాగ్ చేసిన ప్రాథమిక సమస్య అది.  కానీ, ఏడేండ్ల నాటి కేసు కాబట్టి సదరన్ జోన్ బెంచ్ (స్పెషల్ బెంచ్) ఎటువంటి కారణం లేకుండానే కేసును మూసివేసింది. హుస్సేన్​సాగర్‌‌‌‌లో సచివాలయం చెత్తాచెదారాన్ని డంపింగ్ చేయడంపై జాయింట్ కమిటీ విచారణకు సౌత్ జోన్ ట్రిబ్యునల్ ఆదేశించినా విచారణ  చేపట్టలేదు. అయితే ఈ కేసును జులై 2022లో స్పెషల్ బెంచ్ తుది విచారణకు వాయిదా వేసింది. చివరగా 6 జులై 2022న ప్రత్యేక బెంచ్ ప్రతివాదులతో కూడిన మరో కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా కేసును  రద్దు చేసింది. హుస్సేన్​సాగర్‌‌‌‌లోకి రోజురోజుకూ భారీ కాలుష్యం ప్రవేశిస్తోందని, ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, సరస్సు అధ్వానంగా ఉందని ప్రత్యేక ధర్మాసనం తుది ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు జీవ వైవిధ్యానికి, అస్తిత్వ ముప్పు గురించి ప్రపంచాన్ని హెచ్చరిస్తున్న తరుణంలో.. హుస్సేన్​సాగర్​ కలుషితం పట్ల రాష్ర్ట ప్రభుత్వ నిర్లక్ష్య  వైఖరి విడనాడాలి.

సాగర్ ఎఫ్టీఎల్ తగ్గించి భూమి ఆక్రమించారు

ఏప్రిల్ 2015లో హోటల్ మారియట్ ముందు ఉన్న చిన్నపాటి ఆనకట్టను కూల్చివేయడం వలన సరస్సు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్)  ఎత్తు తగ్గింది, అంటే సరస్సు హోల్డింగ్ కెపాసిటీ శాశ్వతంగా తగ్గిపోయింది. ఈ అక్రమ చర్య కారణంగా కూకట్‌‌‌‌పల్లి నాలా, నెక్లెస్‌‌‌‌ రోడ్డు పరిసర ప్రాంతాల సమీపంలో భూమిని పూడ్చివేసి ప్లాట్లు చేశారు. ప్రభుత్వం స్వయంగా ఎఫ్టీఎల్ ప్రాంతంలో శంకుస్థాపన చేసి కొత్త కాలనీలను సృష్టించింది. ఈ కీలకమైన అంశం కూడా కమిటీ, ట్రిబ్యునల్ దృష్టికి రాలేదు. 

సచివాలయ​ శిథిలాల రవాణా సమాచారం లేదు

కొవిడ్ కాలంలో 2020 జులైలో ప్రభుత్వం కూల్చివేసిన సెక్రటేరియెట్ భవనం శిథిలాల డంపింగ్​పై ట్రిబ్యునల్‌‌‌‌లో పిటిషన్ వేయబడింది. సచివాలయం కూల్చివేతతో మొత్తం 1,47,469 టన్నుల నిర్మాణ వ్యర్థాలు బయటపడ్డాయి. సచివాలయం నుంచి బారికేడ్‌‌‌‌లు వేసిన ప్రాంతం వెలుపల ఒక్క వాహనం కూడా చెత్తను తీసుకెళ్లినట్లు నమోదు కాలేదు. ఒక్క టెండర్ కూడా పిలవలేదు. శిథిలాల రవాణాపై ఎటువంటి సమాచారం నమోదు చేయలేదు. ఏ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లోనూ అందుబాటులో లేదు. విచిత్రమేమిటంటే, హుస్సేన్​సాగర్ వద్ద చేపట్టిన అటువంటి భారీ కూల్చివేత పనిపై జాయింట్ కమిటీ కూడా ప్రశ్నించలేదు, ఇది ముఖ్యంగా హుస్సేన్​సాగర్ కాలుష్య స్థితిని ప్రభావితం చేస్తుంది. హుస్సేన్​సాగర్‌‌‌‌లో చెత్తాచెదారం పారబోసినట్లు మ్యాప్‌‌‌‌లు, ఇతర రుజువుల ద్వారా  హైలైట్ చేసి,  సరస్సుకు తీవ్ర నష్టం కలిగిస్తున్న కాలుష్యాన్ని అరికట్టడానికి దాఖలైన కేసును ప్రభుత్వం అపహాస్యం చేసింది. సచివాలయ శిథిలాల డంప్‌‌‌‌ల పక్కనే ఉన్న సరస్సు లోపలవైపు నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ దానిపై కూడా విచారణ జరగకపోవడం గమనార్హం. 

- డా. లుబ్నా సార్వత్, 
ఫౌండర్​, డైరెక్టర్, సెంటర్ ఫర్ వెల్‌‌‌‌బీయింగ్ ఎకనామిక్స్, హైదరాబాద్.