దెబ్బతిన్న పంటలకు పంట నష్టపరిహారమేదీ?

దెబ్బతిన్న పంటలకు పంట నష్టపరిహారమేదీ?
  • జడ్పీ సమావేశంలో ప్రశ్నించిన సభ్యులు
  • మీటింగ్​లో 9 అంశాల పైనే చర్చ
  • 45 టాపిక్స్ చర్చకు రాకుండానే మీటింగ్​ వాయిదా​

కామారెడ్డి, వెలుగు : యాసంగిలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఇంతవరకు నష్టపరిహారం అందలేదని జడ్పీ సమావేశంలో సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్​ ​లో జడ్పీ చైర్​పర్సన్​దఫేదర్​ శోభ అధ్యక్షతన జడ్పీ సమావేశం జరిగింది. ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు హన్మంత్​షిండే, జాజాల సురేందర్, కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు. 2 గంటల పాటు సాగిన మీటింగ్​లో కేవలం 9 అంశాలపైనే చర్చించారు.45 అంశాలపై  చర్చే జరగలేదు. 

పంట నష్టపరిహారం, రుణమాఫీపై..

యాసంగి పంట నష్టాలకు సంబంధించి ఆఫీసర్లు సర్వే నిర్వహించినా ఇప్పటికీ పరిహారం అందలేదని లింగంపేట, సదాశివ్​నగర్, రామారెడ్డి జడ్పీటీసీలు శ్రీలత, నర్సింలు, నారెడ్డి మోహన్​రెడ్డి, నాగిరెడ్డిపేట ఎంపీపీ రాజ్​దాస్​ ప్రశ్నించారు. సర్వే కంప్లీట్​ చేసి, ప్రభుత్వానికి రిపోర్ట్​ అందించామని, రైతుల అకౌంట్లలో పైసలు జమ అవుతాయని డీఏవో భాగ్యలక్ష్మీ చెప్పారు. రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు  రూ.99,999 వరకు మాత్రమే అంటున్నారని, రుణమాఫీ అయిన రైతుల లిస్టు కూడా సరిగ్గా చెప్పడం లేదని పలువురు సభ్యులు ప్రస్తావించారు. కో ఆపరేటివ్​ బ్యాంక్​ల్లో వన్​టైమ్​సెటిల్​మెంట్​ చేయడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. పరిశీలించి, చర్యలు తీసుకుంటామని కలెక్టర్​పేర్కొన్నారు.

కరెంట్​ ఆఫీసర్లపై ఎమ్మెల్యే ఫైర్​

ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండల ఎన్పీడీసీఎల్​ ఏఈలు సరిగా పనిచేయడం లేదని,వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్​ఆఫీసర్లపై ఫైరయ్యారు. సోమారం, తదితర కొన్ని ఏరియాల్లో గత నాలుగైదు రోజులుగా త్రీఫేజ్​ కరెంట్​సప్లయ్​ లేదని, తాను స్వయంగా ఫోన్​చేసి చెప్పినా, ఎందుకు ఫీల్డ్​కు వెళ్లలేదని డీఈని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గాంధారి మండలంలోని పలు తండాలకు త్రీఫేజ్​ లైన్ ​లేదని, బీబీపేట, దోమకొండ మధ్య మెయిన్​లైన్​ పనుల్లో డిలే అవుతోందని సభ్యులు ప్రశ్నించారు. వీటన్నింటినీ పరిశీలించి, చర్యలు తీసుకుంటామని ఎస్ఈ రమేశ్​పేర్కొన్నారు.

కొబ్బరి కాయ కొట్టింది మీరే కదా?

నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి నుంచి ముగ్ధంపూర్ వరకు రూ.40 కోట్లతో చేపట్టిన రోడ్డు, బ్రిడ్జి పనుల్లో, రోడ్డు పనులు మధ్యలోనే ఆగిపోయాయని ఎంపీపీ రాజ్​దాస్ ప్రశ్నించారు. ఫారెస్ట్​ క్లియరెన్స్​తో పాటు, రైతులకు సంబంధించిన భూముల సర్వేను త్వరగా కంప్లీట్​ చేసి, పనులు పూర్తి చేయాలన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ​స్పందిస్తూ.. ‘ఈ పనులు 7 ఏండ్ల కింద షూరు చేసిన్రు.. మీ ఊరు దగ్గర కొబ్బరికాయ కొట్టింది నీవే కదా, అప్పుడెందుకు ఈ విషయాన్ని అడగలేదని’ రాజ్​దాస్​ను ఉద్దేశించి కామెంట్ ​చేశారు. కొద్ది రోజుల్లోనే ఈ రోడ్డుపనులు కంప్లీట్​చేస్తామని, మెదక్ ​జిల్లా వైపు కూడా రోడ్డు కోసం అక్కడి ఆఫీసర్లు ప్రపోజల్ పంపారని  ఆర్అండ్​బీ ఈఈ చెప్పారు. జుక్కల్​ నియోజకవర్గానికి ఇటీవల బ్రిడ్జిలు, రోడ్లు మంజూరయ్యాయని వీటిని త్వరగా కంప్లీట్​ చేయాలని జుక్కల్​ఎమ్మెల్యే హన్మంత్ ​షిండే ఆఫీసర్లకు సూచించారు. రుణమాఫీ, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం, వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందున  సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలుపుతూ సభలో తీర్మానం చేశారు.

బియ్యం సరిగ్గా రావట్లే..

స్కూల్స్, హాస్టల్స్​కు సన్న బియ్యం సరిగ్గా రావడం లేదని, దొడ్డు బియ్యాన్ని సన్నంగా చేసి పంపిస్తున్నారని,  స్కూల్స్​లో బాత్​రూమ్​లు సరిగ్గా లేక స్టూడెంట్స్​ ఇబ్బందులు పడుతున్నారని రామారెడ్డి జడ్పీటీసీ మోహన్​రెడ్డి డీఈవోను ప్రశ్నించారు. దీనికి అధికార పార్టీ జడ్పీటీసీలు అడ్డు తగిలారు. ప్రభుత్వం విద్యారంగానికి  మంచి ప్రయార్టీ ఇస్తోందని, గతంలో హాస్టల్స్​లో ముక్కిపోయిన బియ్యం, చారు మాత్రమే ఉండేదని జడ్పీ వైస్​ చైర్మన్​ప్రేమయ్య పేర్కొన్నారు. స్కూల్స్​ను ఆఫీసర్లు తరచుగా విజిట్​ చేయాలని డీఈవో సూచించారు