చెత్త వేసే స్థలాలు లేక ఇబ్బందులు

చెత్త వేసే స్థలాలు లేక ఇబ్బందులు

మందమర్రి, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని మున్సిపాలిటీలను చెత్త సమస్య వేధిస్తోంది. డంపింగ్ యార్డులు లేకపోవడంతో చాలామంది చెత్తను ఎక్కడపడితే అక్కడే వేస్తున్నారు. ఫలితంగా కాలనీలన్నీ కంపుకొండుతున్నాయి. వర్షాకాలం కావడంతో వ్యాధులు ప్రబలే ప్రమాదమూ ఉంది. 

రోజుకు 130 మెట్రిక్​ టన్నుల చెత్త 

మంచిర్యాల మున్సిపాలిటీలో నిత్యం 60  మెట్రిక్​ టన్నుల చెత్త పోగవుతోంది. నస్పూర్​లో 55 మెట్రిక్​ టన్నులు, బెల్లంపల్లిలో 36 , క్యాతనపల్లిలో 21, మందమర్రిలో 35, చెన్నూరులో 17, లక్సెట్టిపేటలో17 మెట్రిక్ టన్నులు జమవుతోంది. ఎక్కడ పడితే అక్కడ డంపింగ్​యార్డులు లేకపోవడంతో సేకరించిన చెత్తను ఎక్కడపడితే అక్కడే పడేస్తున్నారు. చాలామంది ఇండ్ల చుట్టూ ఉంటే ఖాళీ ఏరియాల్లో పడేస్తున్నారు. శానిటేషన్​సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఫలితంగా రోడ్లవెంట చెత్తదర్శనమిస్తోంది. ఈగలు, దోమలు వృద్ధిచెందుతున్నాయి. మంచిర్యాల మున్సిపాలిటీలో 1.50 లక్షల జనాభా ఉంది. ఇక్కడ వెలువడే సుమారు 60 మెట్రిక్​టన్నుల చెత్త తరలించేందుకు కనీసం మూడు డంపింగ్​యార్డులు అవసరం. కానీ శివారులోని అండాలమ్మ కాలనీలో ఒకటే యార్డు ఉంది.  అంతకు ముందు నస్పూర్​మున్సిపాలిటీ పరిధిలో నస్పూర్, మంచిర్యాల మున్సిపాలిటీలకు కలిపి యార్డు ఉండేది. ఈ యార్డును ప్రస్తుతం నస్పూర్​ మున్సిపాలిటీ వారే వాడుకుంటున్నారు.  

ఫారెస్ట్​ ఆఫీసర్లు అభ్యంతరం చెప్పడంతో ..

ఇటీవల ఏసీసీ క్వారీ ఏరియాలో గుట్ట దిగువన మంచిర్యాల, క్యాతన్ పల్లి మున్సిపాలిటీలకు చెరో 8 ఎకరాల చొప్పున డంపింగ్ యార్డుల కోసం స్థలాలు  కేటాయించారు. అయితే అటవీ, గుట్ట ప్రాంతం కావడంతో అప్రోచ్​రోడ్డు నిర్మాణం కష్టమని ఆ స్థలాలను వదిలివేశారు.  బెల్లంపల్లి పాలిటెక్నిక్​ కాలేజీ ఏరియాలో మున్సిపాలిటీ కోసం 10 ఎకరాల్లో రూ.3 కోట్ల వ్యయంతో  డంపింగ్​యార్డును ఏర్పాటు చేశారు. అప్రోచ్​రోడ్డు, ఇంటర్నల్ రోడ్లు, గోడ, వర్మీ కంపోస్టు ప్లాంటు, బయోవేస్ట్​ ప్లాంట్​, డీఆర్సీ కేంద్రం, ఇతర గదులు ఉన్నాయి. అన్ని హంగులతో యార్డును నిర్మించినా ఫలితం లేదు. ఆ స్థలాన్ని అగ్రికల్చరల్  ప్రాసెస్​ సెంటర్​ కోసం కేటాయించడంతో  యార్టు నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. మందమర్రి పట్టణ శివారు 2.2 కి.మీ దూరంలోని  చతులాపూర్, కేకే3ఏ గని మధ్యలో రూ.39 లక్షల వ్యయంతో 8 ఎకరాల్లో డంప్​ యార్డు ఏర్పాటు చేసినా.. అటువైపు వెళ్లేందుకు మార్గంలేక ఇబ్బందులు తప్పడం లేదు. సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి ఫారెస్ట్​ ఆఫీసర్లు అభ్యంతరం చెప్పడంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడంలేదు.

కొత్త మున్సిపాలిటీల్లో యార్డులు ల్లేవ్​

జిల్లాలో కొత్తగా ఏర్పడిన క్యాతన్​పల్లి, నస్పూర్, చెన్నూరు, లక్సెట్టిపేటలో డంపింగ్​ యార్డులు లేవు. దీంతో కాలనీల వాసులు ఎక్కడపడితే అక్కడే చెత్తవేస్తున్నారు. రామకృష్ణాపూర్ లో మూసేసిన సింగరేణి టింబర్​యార్డు ఎదుట సింగరేణి ఖాళీ స్థలం, కోల్​బెల్ట్ రహదారిని పక్కన చెత్తను వేస్తున్నారు. సింగరేణి సంస్థకు వందల ఎకరాల ఖాళీ స్థలాలున్నా.. డంపింగ్​యార్డు, శ్మశాన వాటికల నిర్మాణానికి అనుమతి ఇవ్వడంలేదు.  క్యాతన్​పల్లి మున్సిపాలిటీ పరిధిలో జనాభా దృష్యా రామకృష్ణాపూర్, గద్దెరాగడిలో కనీసం రెండు డంపింగ్ యార్డులు అవసరం. నస్పూర్​మున్సిపాలిటీలోని ముక్కిడి పోచమ్మ ఏరియాలో సింగరేణి ఖాళీ స్థలాన్ని డంపింగ్​యార్డుగా వినియోగిస్తున్నారు. ఇక్కడ కూడా మూడు యార్డులు అవసరం. చెన్నూరు మున్సిపాలిటీలోని బుద్దారం బైపాస్​ రోడ్​లో 10 ఎకరాల్లో రూ.1.5 కోట్ల వ్యయంతో డంపింగ్​యార్డు, లక్సెట్టిపేట మున్సిపాలిటీలోని గోదావరి ఒడ్డున ఐదు ఎకరాల్లో డంపింగ్​యార్డుల పనులు జరుగుతున్నా... అవి ఎప్పుడు అందుబాటులో వస్తాయో తెల్వడంలేదు.

స్థలసేకరణ చేస్తున్నాం

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో డంపింగ్​యార్డుకు కోసం స్థల సేకరణ చేస్తున్నాం. 10 ఎకరాల స్థలం కోసం కలెక్టర్​కు ప్రతిపాదనలు పంపించాం. ఆర్కే1 మార్కెట్​ ఏరియాలోని బ్రాడ్​గేజ్ రైల్వే ట్రాక్​ ప్రాంతంలోని స్థలాన్ని పరిశీలించాం. నిర్మాణానికి త్వరలో చర్యలు తీసుకుంటాం.

-  వెంకటనారాయణ, మున్సిపల్​కమిషనర్, క్యాతన్​పల్లి