కామారెడ్డి జిల్లాలో మొదలైన వరికోతలు

కామారెడ్డి జిల్లాలో మొదలైన వరికోతలు
  • రోడ్లపై వడ్ల కుప్పలు
  • కొనుగోలుకు కనబడని ఏర్పాట్లు 
  • రివ్యూ మీటింగ్​తోనే అధికారులు సరి

కామారెడ్డి , వెలుగు : కామారెడ్డి జిల్లాలో పలు మండలాల్లో వరి కోతలు షురూ అయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఎక్కడా గవర్నమెంట్​ కొనుగోలు సెంటర్ల ఏర్పాటు జరగలేదు. కొనుగోళ్లపై కొద్ది రోజుల క్రితం ఆఫీసర్లు   మీటింగ్​ నిర్వహించారు. అయినా క్షేత్ర స్థాయిలో ఇప్పటి దాకా సెంటర్లు ఓపెన్​ చేయలేదు. కొన్ని చోట్ల ఇప్పటికే మద్దతు ధర కంటే తక్కుకే రైతులు వడ్లను అమ్ముకోవాల్సి  వస్తోంది. 
కామారెడ్డి జిల్లాలో  వానాకాలం సీజన్లో 2.97 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 6. 25 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు.   సాగు విస్తీర్ణం, దిగుబడి, సెంటర్ల ఏర్పాటు, ఇందుకు కావాల్సిన సామగ్రి వంటి ఆంశాలపై కలెక్టర్​ 15 రోజుల కిందటే ఆఫీసర్లతో చర్చించారు. అయినా ఎక్కడా సెంటర్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కాలేదు.  

జోరుగా కోతలు

 సీజన్​ లో ముందుగా వరిసాగు చేసిన రైతుల పంట కోతకు వచ్చింది. ఇప్పటికే రైతులు కోతలు షురూ చేశారు. ఈ వారం రోజుల్లో మరింత కోతలు ఉపందుకోనున్నాయి. బాన్సు​వాడ, బీర్కూర్​, నస్రుల్లాబాద్​, బిచ్కుంద, నాగిరెడ్డిపేట మండలాల్లో వరి కోతలు జరుగుతున్నాయి. ఆయా చోట్ల వరి కోసి న తర్వాత వడ్లను రోడ్లపై కుప్పలు పోస్తున్నారు. పలు ఏరియాల్లో కిలో మీటర్ల పొడవునా రోడ్లపై వరి కుప్పలు ఉన్నాయి. పంట పొలాల్లో కూడా కుప్పలు పోశారు. మిగతా మండలాల్లో కూడా వరి కోత దశకు వచ్చింది. 

సెంటర్ల ఏర్పాటులో లేటు

జిల్లాలో 345 సెంటర్ల ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. 2.98 లక్షల ఎకరాల్లో 6.20 లక్షల మెట్రిక్​ టన్నుల నుంచి 7 లక్షల మెట్రిక్​ టన్నుల వరకు దిగుబడి వచ్చే వీలుంది. అమ్మకానికి 5.5‌‌‌‌‌‌‌‌లక్షల మెట్రిక్​ టన్నుల వరకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. కోటి 50 లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా.. 90 లక్షల గన్నీ బ్యాగులు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సెంటర్లకు సరిపడా గన్నీ బ్యాగులు, మాయిశ్చర్​ మిషన్లు, కాంటలు అందుబాటులో ఉండాలి. కాంటాలు అయిన తర్వాత వడ్లను సెంటర్ల నుంచి రైసుమిల్లులకు తరలించేందుకు ట్రాన్స్​పోర్టు వెహికల్స్​ కావాలి. కానీ, అన్ని ఏర్పాట్లపై ఇంకా ఎలాంటి స్పష్టతా లేదు. మరోవైపు కోసి అరబోసిన వడ్లు వానకు తడుస్తున్నాయి. కవర్లను కిరాయికి తీసుకొచ్చి తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. ఒక్కో కవర్​కు రోజుకు రూ.15 చొప్పున కిరాయికి తీసుకుంటున్నారు. బుధవారం రాత్రి కురిసిన వానకు బీర్కుర్​, నస్రుల్లాబాద్​ మండలాల్లో వడ్ల కుప్పలు తడిసిపోయాయి.

తక్కువ రేటుకు అమ్ముకుంటున్రు

కొందరు రైతులు వడ్లను వ్యాపారులకు అమ్ముకుంటున్రు. సెంటర్ల డిలే అవుతుండటంతో తక్కువ రేటు అయిన సరే అని అమ్ముతున్నారు. గ్రేడ్​-ఏ వడ్లకు క్వింటాల్​కు రూ.2060, నార్మల్​ వడ్లు క్వింటాల్​కు రూ.2,040 సర్కారు మద్దతు ధర ప్రకటించింది. జిల్లాలో వరి కోతలు షూరు కావటంతో నల్లగొండ, మిర్యాలగూడ నుంచి కొందరు వ్యాపారులు వచ్చి రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధర కంటే క్వింటాల్​కు రూ.2‌‌‌‌00 ‌‌‌‌నుంచి రూ.300 తక్కువ ధరే చెల్లిస్తున్నారు. 

కోసి వారం రోజులైంది

12 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి పంట వేసిన.  కోసి వారం రోజులైంది.  వడ్లను రోడ్డుపై అరబోసిన.  ఇంకా సెంటర్లు ఓపెన్​ కాలేదు.   వ్యాపారులు వచ్చి క్వింటాల్​కు రూ.1,900 అడుగుతుంన్రు.  అయితే సెంటర్లు ఓపెన్​ అవుతాయేమోనని చూస్తున్నా.   వానలకు కుప్పలు తడిసిపోతున్నాయి.  కవర్లు కిరాయికి తీసుకొచ్చి కప్పుతున్నా.

- జల చిన్న గంగాధర్​ ,   మీర్జాపూర్​,  బీర్కుర్​ మండలం

ఇంకా టైం పడుతదని చెప్పిన్రు

రెండున్నర  ఎకరాల్లో దొడ్డు రకం వరి పంట వేసిన.  3 రోజుల క్రితం కోసి రోడ్డుపై ఆరబోసిన.   మా ఊరిలో చాలా మంది రైతులు వరి కోసిన్రు.   సెంటర్​ ఎప్పుడు పెడ్తరని  రైతులం సోసైటీకి వెళ్లి అడిగినం.  టైం పడుతది.  దీపావళి నుంచి షురూ అవుతుండవచ్చని చెప్పిన్రు.  తొందరగా  సెంటర్లు ఒపెన్​ చేస్తే బాగుంటుంది. 

- ఎల్ల గంగారాం,  పుల్కల్​, బిచ్కుంద మండలం