క్రూడాయిల్ ధర తగ్గుతున్నాలాభం సున్నా

క్రూడాయిల్ ధర తగ్గుతున్నాలాభం సున్నా

న్యూఢిల్లీఇంటర్నేషనల్‌ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు ఎన్నడూ లేనంతగా తగ్గుతున్నా, మనదేశం పెద్దగా లాభపడే అవకాశాలు కనిపించడం లేదు. ధరల్లో మార్పుల వల్ల పెద్దగా ఉపయోగడం లేదని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ప్రస్తుతం పెట్రో ప్రొడక్టులకు డిమాండ్‌ 40 శాతం తగ్గింది. కొత్తగా ఆయిల్‌ కొన్నా నిల్వ చేసే పరిస్థితులు లేవు. దీనివల్ల అటు ప్రభుత్వానికి గానీ వినియోగదారులకు గానీ ఇప్పటికిప్పుడు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండటం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే ఉండటంతో అమెరికాలోని వెస్ట్‌ టెక్స్‌ ఇంటర్‌మీడియెట్‌ మే ఫ్యూచర్‌ కాంట్రాక్టుల్లో ధరలు నెగటివ్‌లోకి వెళ్లిపోయాయి. ఒక్కో చమురు బ్యారెల్‌ రవాణాకు కంపెనీలే సోమవారం 37 డాలర్ల చొప్పున చెల్లించాయంటే పరిస్థితి ఎంత అధ్వానంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.

లాక్‌డౌన్‌ లేకుంటే ఎంతో లాభం

పెట్రో ధరల తగ్గుదల ఇండియా వంటి డెవలపింగ్‌ నేషన్స్‌కు అయితే ఎంతో లాభం. చమురు దిగుమతుల కోసం మనదేశం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం కరోనా వల్ల కేంద్రం ఖజానా ఖాళీ అయింది. ఈ పరిస్థితుల్లో చమురు చౌకగా దొరికితే ప్రభుత్వ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఇండియా ఫారిన్‌ కరెన్సీ నిల్వలు తక్కువగా ఖర్చవుతాయి. ఫలితంగా ద్రవ్యలోటు తగ్గుతుంది. ఇతర వస్తువుల ధరలూ తగ్గుతాయి. డిమాండ్‌ పెరిగి ఎకానమీ పరుగుతీస్తుంది.  డాలర్‌తో రూపాయి విలువ 76 స్థాయికి చేరడంతో ఇండియా ఈ పరిస్థితిని పెద్దగా సొమ్ము చేసుకోలేకపోతోంది.

నెగటివ్‌ ధరలు అంటే

ఈ విధానంలో క్రూడాయిల్‌ను కొన్నందుకు కంపెనీయే కొనుగోలుదారుడికి డబ్బులు ఇస్తుంది. తమ దగ్గర ఉన్న క్రూడాయిల్‌ను నిల్వ చేసే పరిస్థితి లేనప్పుడు కంపెనీలు ఇలా చేస్తాయి. వాటి దగ్గర కూడా స్టోరేజీ సామర్థ్యం ఉండదు కాబట్టి నిల్వలను వదిలించుకో వడానికి కొనుగోలుదారుడికే డబ్బులిచ్చి మరీ క్రూడాయిల్‌ను పంపిస్తాయి. దీనివల్ల నిల్వ ఖర్చులు తగ్గుతాయి. బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర ఈ ఏడాది 60 శాతం తగ్గింది. అన్ని దేశాల దగ్గర దాదాపు నిల్వలు బాగానే ఉండటంతో క్రూడాయిల్‌ను కొనడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి. అమెరికా లో ఈ నెల 10 నాటికే నిల్వసామర్థ్యం 75 శాతానికి చేరుకుంది. మరో మూడు వారాలకు ఇవి పూర్తిగా నిండుతాయి. అయితే నెగటివ్ ధరలు మే నెల ఫ్యూచర్స్‌కు మాత్రమే వర్తిస్తాయి. జూన్‌ నెల ధర 20 డాలర్ల వరకు పలుకుతోంది.

కొనేవారు ఏరి ?

  • లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున వెహికల్స్‌ రోడ్లమీదికి రావడం లేదు. దీంతో పెట్రోల్‌, డీజిల్‌కు డిమాండ్‌ విపరీతంగా తగ్గింది. కరోనా వ్యాప్తి పూర్తిగా ఆగిపోయిన తరువాత ధరలు కచ్చితంగా తగ్గుతాయని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు చెబుతున్నాయి.  ఫలానా నెలలో అని మాత్రం చెప్పలేమని అంటున్నాయి.
  • ధరల తగ్గుదల వల్ల అన్నింటి కంటే విమానాయాన రంగం ఎక్కువ లాభపడే అవకాశం ఉంది. అయితే కరోనా వల్ల విమానాలను తిరిగి నడపడానికి ఎప్పుడు నుమతులు ఇస్తారో తెలియని పరిస్థితి ఉంది.
  • లాక్‌డౌన్‌ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పెట్రో ప్రొడక్టుల ధరలు తగ్గించాలని ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌   ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.