ఎమ్మెల్సీలుగా ఎవరికి చాన్స్.. ఆ ముగ్గురిలో ఇద్దరికి!

ఎమ్మెల్సీలుగా  ఎవరికి చాన్స్..  ఆ ముగ్గురిలో ఇద్దరికి!

 

  • రెండు ఎమ్మెల్యే కోటా సీట్లకు విడివిడిగా 
  • నోటిఫికేషన్లు ఇవ్వడంతో రెండూ కాంగ్రెస్​ ఖాతాలోకే
  • ముందు వరుసలో అద్దంకి దయాకర్​,  చిన్నారెడ్డి, మహేశ్​ కుమార్​ గౌడ్ పేర్లు
  • ఈ నెల 15 లేదా 16న అభ్యర్థుల ప్రకటన!
  • గవర్నర్​ కోటాలో ప్రొఫెసర్​ కోదండరాం,
  • జాఫర్​ జావెద్​కు అవకాశం

హైదరాబాద్, వెలుగు:  ఎమ్మెల్యే కోటా, గవర్నర్​ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు దాదాపుగా కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది. ఎమ్మెల్సీ పదవుల కోసం డజను మందికిపైగా నేతలు పోటీలో ఉండగా..  ఆ రెండు కేటగిరీల్లో నలుగురికి మాత్రమే అవకాశం దక్కనుంది. అసెంబ్లీ టికెట్లను వదులుకున్న వాళ్లలో ఇద్దరిని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించే చాన్స్​ఉందని కాంగ్రెస్​ వర్గాలు చెప్తున్నాయి. గవర్నర్​ కోటాలో ఇద్దరు విద్యావేత్తలను నామినేట్​ చేయనున్నట్లు సమాచారం. ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలక్షన్​ కమిషన్​ గురువారం విడివిడిగా నోటిఫికేషన్లు ఇచ్చింది. దీంతో అసెంబ్లీలో సంఖ్యాబలం దృష్ట్యా రెండిటికి రెండు సీట్లు కాంగ్రెస్​ ఖాతాలో చేరనున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఈ నెల 15న కానీ, 16 కానీ ప్రకటించే అవకాశం ఉంది. 

ఎమ్మెల్యే కోటా సీట్లు ఆ ముగ్గురిలో ఇద్దరికి!

అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు వదులుకున్న సీనియర్​ లీడర్లకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్​ పార్టీ నిర్ణయించినట్టు సమాచారం. ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం దాదాపు డజను మంది దాకా పోటీ పడుతున్నారు. అయితే, అందులో తొలుత అద్దంకి దయాకర్​, చిన్నారెడ్డి, మహేశ్​ కుమార్​ గౌడ్​ పేర్లను పరిశీలిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అద్దంకి దయాకర్​ గతంలో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి బీఆర్​ఎస్​ క్యాండిడేట్​కు గట్టిపోటీనిచ్చారు. స్వల్ప మెజారిటీతోనే ఓడిపోయారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మందుల సామేలు కోసం ఆ స్థానాన్ని వదులుకున్నారు. ఈ క్రమంలోనే అద్దంకి దయాకర్​ పేరును ప్రాధాన్య క్రమంలో పరిగణనలోకి తీసుకుంటున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. సీనియర్​ లీడర్​గా ఉన్న చిన్నారెడ్డి కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తన టికెట్​ను వదులుకున్నారు. షబ్బీర్​ అలీ కోసం నిజామాబాద్​ అర్బన్​ టికెట్​ను మహేశ్​ కుమార్​ గౌడ్​ వదులుకున్నారు. 

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్ల కోసం చిన్నారెడ్డి, మహేశ్​కుమార్​గౌడ్​ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరికొందరు సీనియర్​ నేతలు కూడా ఈ సీట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినవాళ్లు కూడా ఉన్నారు. అయితే.. కాంగ్రెస్​ అధిష్టానం మాత్రం ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన లీడర్లకు ఇప్పుడప్పుడే ఇతర పదవుల్లో అవకాశం ఇవ్వొద్దని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొన్ననే అసెంబ్లీ టికెట్లు ఇచ్చి బరిలోకి దింపినందున.. కొంతకాలం వెయిట్​ చేయాలని అంటున్నట్లు సమాచారం. ఇప్పుడే వారికి పదవులు ఇస్తే.. పార్టీ కోసం కష్టపడుతున్న ఇతర నేతలకు అన్యాయం చేసినట్టవుతుందని పార్టీ పెద్దలు చెప్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే పార్టీలో సీనియర్లుగా ఉండి.. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు వదులుకున్న లీడర్లకే తొలుత చాన్స్​ ఇవ్వాలని భావిస్తున్నారు.

గవర్నర్​ కోటాలో విద్యావేత్తలకు

గవర్నర్​ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్​ కోదండరాం, విద్యారంగ నిపుణుడు జాఫర్​ జావెద్​ (ముఫకంజా కాలేజీ చైర్మన్​)కు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర నాయకత్వం యోచిస్తునట్టు తెలిసింది. గత ప్రభుత్వంలో రాజకీయ రంగాలకు చెందిన వాళ్లను బీఆర్​ఎస్​ పార్టీ నామినేట్​ చేయగా.. అప్పుడు గవర్నర్​ తిరస్కరించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా సేవా, కళ, విద్యా తదితర రంగాల్లో ఉన్నవాళ్లకు గవర్నర్​ కోటా ఎమెల్సీలుగా నామినేట్​ చేయాలని చెప్పారు. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్​ పార్టీ అధినాయకత్వం ఎవరి పేర్లను సిఫార్సు చేయాలనే దానిపై ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తున్నది. ఇందులో ప్రొఫెసర్​ కోదండరాం, జాఫర్​ జావెద్​ పేర్లు ముందు వరుసలో ఉన్నట్లు, త్వరలోనే అధికారికంగా వీళ్ల పేర్లను గవర్నర్​కు పంపే అవకాశం ఉందని ఓ సీనియర్​ లీడర్​ తెలిపారు. ఇదే కోటాలో వ్యాపారవేత్త మస్కతీ అలీ పేరును కూడా పరిగణనలోకి తీసుకునే చాన్స్​ ఉన్నట్లు  ప్రచారం జరుగుతున్నది.