ఎబోలాకు1,600 మంది బలి

ఎబోలాకు1,600 మంది బలి

ఎబోలా విజృంభిస్తోంది. ఇప్పటికే దాని బారిన పడి ఒక్క కాంగోలోనే 1600 మంది దాకా మరణించారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇలా ప్రకటించడం చరిత్రలో ఇది ఐదోసారి మాత్రమే. ఇప్పటికే కాంగోపై ఎబోలా చాలాసార్లు విరుచుకుపడింది. కానీ ఇంతలా ఎప్పుడూ ఆ దేశాన్ని భయపెట్టలేదు. పోయిన ఎండాకాలంలో కాంగోలోని నార్త్ కివూ ప్రావిన్సులో మొదలైన ఎబోలా మెల్లగా వ్యాపించింది.

ట్రీట్ మెంట్ సెంటర్లపై దాడులు

ఓ వైపు జబ్బు దాడిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న డాక్టర్లకు, కాంగోలోని అక్రమ దళాలతో ప్రాణాలకు ముప్పు వచ్చి పడింది. కనీసం మూడు, నాలుగు రోజులకు ఒకసారైనా ఈ గ్రూపులు గొడవలకు తెగబడుతున్నాయి. కనిపించిన వారిపై దాడి చేసి, కిరాతకంగా చంపేస్తున్నాయి. దీంతో ఒకే ప్రాంతంలో ఎక్కువ కాలం ఎబోలాకు ట్రీట్ మెంట్ ఇవ్వడం కుదరడం లేదు. ఐక్యరాజ్యసమితి సేనలు, స్థానిక పోలీసులు ట్రీట్ మెంట్ సెంటర్లకు కాపలా ఉంటున్నాయి. ఒక రకంగా ఎబోలా వ్యాప్తిని ఆపలేకపోవడానికి కారణం ఈ గ్రూపుల గొడవలే.

వ్యాక్సిన్ లేదా?

ఎబోలాకు వ్యాక్సిన్ ఉంది. ఇప్పటిదాకా కాంగోలోని 1.61 లక్షల మందికి డాక్టర్లు వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే ప్రతి రోగికీ వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. ఎవరైతే ఎబోలా పేషెంట్‌‌తో డైరెక్టు కాంటాక్టులో ఉంటారో వాళ్లకే ఇస్తూ వస్తున్నారు. కాంగోలో మొదలైన ఎబోలా.. దాని పక్క దేశాలకు పాకే చాన్స్ ఉందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఉగాండాలో ఎబోలా వల్ల ఓ బామ్మ, ఆవిడ మనవడు చనిపోయారు. మరోవైపు రువాండాకు కూడా ఈ జబ్బు పాకే చాన్స్ ఉంది. ఎబోలా వ్యాప్తిని అడ్డుకునేందుకు తమ వద్ద తగినన్ని ఫండ్స్ లేవని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. దాదాపు 4.4 కోట్ల డాలర్ల నిధుల కొరత ఉందని చెప్పింది.

ఏంటీ ఎబోలా?

ఎబోలా లక్షణాలు జబ్బు సోకిన 8 నుంచి 10 రోజుల్లోగా కనిపిస్తాయి. ప్రారంభంలో ఫీవర్, అలసట,   తలనొప్పి, కండరాల నొప్పి, గొంతు మంట, వాంతులు, పొత్తి కడుపు నొప్పి, రక్తస్రావం ఆగకపోవడం, మూర్ఛ, కోమా లాంటి కనిపిస్తాయి. 21 రోజుల దాటితే ఇవి మరింత తీవ్రమై రోగి చనిపోయే ప్రమాదం ఉంటుంది.  రక్తం, వీర్యం, చెమట, లాలాజలం, మలం, మరియు వాంతితో సహా ఇతర శరీర ద్రవాలను టచ్ చేసినా చాలు వైరస్ సోకుతుంది. కొన్ని సందర్భాల్లో జబ్బు సోకిన కోతులు, పళ్లు తినే గబ్బిలాల వల్లా మనిషికి వస్తోంది.