దేశంలో కొత్తగా ఒమిక్రాన్ BA.2.75 వేరియంట్

దేశంలో  కొత్తగా ఒమిక్రాన్ BA.2.75 వేరియంట్

కరోనా కొత్త వేరియంట్ భారత్లో బయటపడింది.  ఒమిక్రాన్ వేరియంట్ యొక్క కొత్త సబ్ వేరియంట్ BA.2.75 ఇండియాలో కనుగొన్నట్లు WHO వెల్లడించింది. అయితే ఈ వైరస్ లక్షణాలను పరిశీలిస్తున్నట్లు  WHO  డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. యూరప్,  అమెరికాలో, BA.4, BA.5 వేరియంట్ల వల్ల రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయని WHO  డైరెక్టర్ జనరల్ టెడ్రోస్  ప్రకటించారు.  గత రెండు వారాలుగా ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసులు 30 శాతం మేర పెరిగాయని టెడ్రోస్ తెలిపారు. WHOకు చెందిన ఆరు సబ్ రీజియన్లలో నాలుగు చోట్ల కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. 

ఒమిక్రాన్ సబ్ వేరియింట్  BA.2.75 వైరస్ పై  WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశారు. BA.2.75 అని పిలవబడే  ఈ ఉప-వేరియంట్ మొదటగా భారత్లో గుర్తించామని తెలిపారు. భారత్తో పాటు.. మరో 10  దేశాల్లోనూ BA.2.75 వైరస్ గుర్తించినట్లు వెల్లడించారు. ఈ సబ్ వేరియంట్  స్పైక్ ప్రోటీన్ యొక్క  రిసెప్టర్ -బైండింగ్ డొమైన్‌పై కొన్ని ఉత్పరివర్తనాలను కలిగి ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పారు.  అయితే వైరస్ వల్ల  రోగనిరోధక శక్తికి ఏ మేరకు ఇబ్బంది కలిగిస్తుంది...మనిషిపై ఏ మేరకు ప్రభావం ఉంటుందో తెలుసుకోవడానికి మరింత సమయం పట్టవచ్చని తెలిపారు. వైరస్ను WHO నిత్యం  ట్రాక్ చేస్తోందని...SARS-CoV-2 వైరస్ ఎవల్యూషన్పై WHO సాంకేతిక సలహా బృందం నిరంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటాను చూస్తోందన్నారు.

కొవిడ్ ప్రకారం  ఒమిక్రాన్ సబ్ వేరియంట్లలో BA.5 మరియు BA.4 వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే BA.5 ఉపవేరియంట్ ను 83 దేశాలలో కనుగొన్నారు. 73 దేశాల్లో గుర్తించిన BA.4 వరల్డ్ వైడ్ గా  పెరుగుతున్నా... పెరుగుదల రేటు BA.5 వైరస్ కంటే ఎక్కువగా లేకపోవడం విశేషం.