కరోనాను తేలిగ్గా తీసుకోవద్దు..ముందుంది అసలు ముప్పు

కరోనాను తేలిగ్గా తీసుకోవద్దు..ముందుంది అసలు ముప్పు

జెనీవాకరోనానే ప్రజలకు మొదటి శత్రువని, దానిని తేలిగ్గా తీసుకోవద్దని  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) హెచ్చరించింది. ముందుముందు దానితో మరింత ముప్పు పొంచి ఉందని పేర్కొంది. మంగళవారం డబ్ల్యూహెచ్​వో చీఫ్​ టెడ్రోస్​ అధనోమ్​ ఘెబ్రియేసస్​ మీడియాతో మాట్లాడారు. కొన్ని దేశాలు లాక్​డౌన్​ ఆంక్షలు ఎత్తేస్తున్నాయని, అది తొందరపాటు నిర్ణయమని అన్నారు. ఆంక్షలను ఎత్తేస్తే కేసులు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందన్నారు. ‘‘మమ్మల్ని నమ్మండి. మున్ముందు కరోనా మహమ్మారి ముప్పు మరింత ఎక్కువ అవుతుంది’’ అని ఆయన హెచ్చరించారు. 1918లో 10 కోట్ల మందిని బలి తీసుకున్న స్పానిష్​ ఫ్లూ లాగానే కరోనా మహమ్మారి కూడా చాలా డేంజర్​ అన్నారు. ఈ ప్రమాదాన్ని నివారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి ‘రాకాసి’ వైరస్​తో ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. చాలా మంది ఈ వైరస్  గురించి ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పారు. వైరస్​ గురించి మొదటి రోజు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నామని టెడ్రోస్​ స్పష్టం చేశారు.

లాక్​డౌన్​తో వైరస్​ పోదు

లాక్​డౌన్​ను పెట్టినంత మాత్రాన ఏ దేశంలోనూ వైరస్​ అంతం కాదని టెడ్రోస్​ తేల్చి చెప్పారు. దాన్ని ఖతం చేయాలంటే ప్రజలు, ప్రభుత్వాలు కలిసి వైరస్​ను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. లాక్​డౌన్​ల వల్ల వైరస్​ వ్యాప్తిని తగ్గించగలుగుతాం కానీ, పూర్తిగా వైరస్​ను అంతం చేయలేమని చెప్పారు. వైరస్​ను తరిమేయాలంటే అన్ని దేశాలూ కరోనా పాజిటివ్​ వ్యక్తులను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అనుమానితులందరికీ టెస్టులు చేయాలన్నారు. అలాంటి వాళ్లను ఐసోలేషన్​లో పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. అంతేగాకుండా కరోనా సోకినోళ్లు కలిసిన వ్యక్తులనూ గుర్తించాల్సిన​అవసరం ఉందని చెప్పారు. అలాగని ఇప్పుడే లాక్​డౌన్​ను ఎత్తేసినా మరింత డేంజర్​ అన్నారు.

అభివృద్ధి చెందిన దేశాలది తప్పు

వైరస్​ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాయని, వైరస్​ గురించి ఆయా దేశాలకు పూర్తిగా తెలియదని టెడ్రోస్​ చెప్పారు. ఆ తప్పుడు నిర్ణయాలతో కష్టాలు కొని తెచ్చుకుంటున్నాయని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలకూ వైరస్​ షాకుల మీద షాకులిస్తుందని తాము ముందే చెప్పామన్నారు. అన్నట్టే ఆ వైరస్​ ఇప్పుడు ఆ దేశాలను పట్టిపీడిస్తోందని అన్నారు. మున్ముందు దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. వైరస్​ ఇచ్చే మరిన్ని షాకులను ఆపాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొన్ని వేల మంది వైరస్​కు బలైపోతున్నారని, అది చాలా ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఒక్క ప్రాణమైనా విలువైనేదనని, ఇక్కడి దాకా జరిగింది చాలని ఆయన అన్నారు.

మా దగ్గర సీక్రెట్లు ఏం లేవ్​

చైనాకు అనుకూలంగా డబ్ల్యూహెచ్​వో పనిచేస్తోందని, చాలా విషయాలు దాచి పెడుతోందని అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ అన్న మాటలపైనా టెడ్రోస్​ స్పందించారు. డబ్ల్యూహెచ్​వో దగ్గర సీక్రెట్లు ఏమీ లేవని తేల్చి చెప్పారు. ఇలాంటి హెల్త్​ ఇష్యూలను రహస్యంగా ఉంచడం చాలా డేంజర్​ అని, తమ దగ్గర దాచుకోవడానికి ఏమీ లేదని అన్నారు. ‘‘ఈ వైరస్​ చాలా డేంజర్​. మన మధ్య విభేదాలను పెంచి పోషిస్తే వైరస్​ మరింత విజృంభించే ముప్పు ఉంది. డబ్ల్యూహెచ్​వోతో కలిసి పనిచేస్తామని అమెరికా సెంటర్స్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ అండ్​ ప్రివెన్షన్​ ఉద్యోగులు, అధికారులు చెబుతున్నారు. డబ్ల్యూహెచ్​వో నిజాయతీకి అదే నిదర్శనం.
ప్రస్తుతం సంస్థలో సీడీసీ వాళ్లూ పనిచేస్తున్నారు. కాబట్టి అమెరికాకు తెలియకుండా దాచాల్సిన విషయాలేవీ లేవు. వైరస్​ ప్రారంభమైన మొదటి రోజు నుంచి అన్ని విషయాలను వెంటవెంటనే వెల్లడిస్తున్నాం. ఆ విషయం సీడీసీ అధికారులకూ తెలుసు’’ అని టెడ్రోస్​ చెప్పుకొచ్చారు.