Arshad Nadeem: తండ్రి మేస్త్రీ.. నిరుపేద కుటుంబం.. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన పాక్ అథ్లెట్ విశేషాలు

Arshad Nadeem: తండ్రి మేస్త్రీ.. నిరుపేద కుటుంబం.. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన పాక్ అథ్లెట్ విశేషాలు

పారిస్ ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. గురువారం అర్థరాత్రి జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్స్‌లో 27 ఏళ్ల అర్షద్ ఏకంగా బల్లాన్ని 92.97 మీటర్ల దూరం విసిరి గోల్డ్‌ మెడల్ అందుకున్నాడు. తద్వారా 40 ఏళ్లుగా పసిడి కోసం ఎదురుచూస్తున్నస్వదేశం పాకిస్థాన్‌ కల నెరవేర్చాడు. ఈ విజయాన్ని దాయాది దేశం పండగలా జరుపుకుంటోంది.

గతంలో ఎన్నడూ బల్లాన్ని 90 మీటర్ల మించి విసరని అర్షద్, ఒక్కసారిగా 92 మీటర్ల దూరం విసరగలిగాడంటే, అతనిలో పసిడి చేజిక్కించుకజోవాలనే పట్టుదల, కసి ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చాలా నిరుపేద కుటుంబం అతనిది. తండ్రి మేస్త్రీ. అతను సంపాదించే డబ్బే వారికి జీవనాధారం. అలాంటి కుటుంబంలో జన్మించిన అర్షద్.. ఆ తల్లిదండ్రులకు, స్వదేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాడు. అసలు అర్షద్ నదీమ్ ఎవరు..? అతని కుటుంబ నేపథ్యం ఏంటి..? ఈ స్థాయికి రావడానికి అతను పడిన శ్రమేంటి..? అనేది తెలుసుకుందాం.. 

తండ్రి మేస్త్రీ

అర్షద్‌ 1997, జనవరి 2న పాకిస్థాన్‌లోని మియా చాను సమీపంలోని ఖనేవాల్‌ అనే గ్రామంలో జన్మించాడు. అతనిది చాలా నిరుపేద కుటుంబం. తండ్రి పేరు.. మహమ్మద్‌ అష్రఫ్‌. ఆయన మేస్త్రీ. మొత్తం ఏడుగురు సంతానం కాగా, వారిలో మూడోవాడు అర్షద్ నదీమ్‌. అతడు చిన్నప్పటినుంచి ఆటల్లో ముందుండేవాడు. స్కూల్లో క్రికెట్‌, ఫుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, అథ్లెటిక్స్‌.. ఇలా అన్నింటిని ఆడేవాడు. కానీ, అతనికి క్రికెట్‌ అంటే చాలా మక్కువ. జిల్లా స్థాయి ప్లేయర్, మంచి బౌలర్‌. అలాంటిది అతను క్రికెట్‌ను దూరం పెట్టి అథ్లెటిక్స్‌ వైపు ద్రుష్టి సారించాడు.

అర్షద్ అథ్లెటిక్స్ రంగాన్ని అయితే ఎంచుకున్నాడు కానీ, ఒక అథ్లెట్‌కు ఉండాల్సిన వస్తువులేవీ తన దగ్గర ఉండేవి కాదట. ప్రాక్టీస్‌కు వెళ్లే సమయంలో వేసుకునే షూలు సైతం, చిన్న కవర్ల తీసుకెళ్లేవాడట. ఇక జావెలిన్ అయితే, తండ్రితో కలిసి పనికి వెళ్లి వచ్చిన డబ్బులతో కొనుక్కున్నాడట.

నదీమ్‌ జావెలిన్‌ కెరీర్‌ 2015లో మొదలవ్వగా.. తొలిసారి 2022లో బల్లాన్ని 90 మీటర్ల దూరం విసిరి కామన్‌వెల్త్‌లో గోల్డ్ మెడల్ అందుకున్నాడు. దాంతో, అతను ఒలింపిక్స్‌ పతకం సాధించగలడన్న నమ్మకం పాక్ ప్రభుత్వంలో కలిగింది. ఆ నమ్మకంతోనే అతనికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి పారిస్ పంపింది. ఈ ఏడాది పాకిస్తాన్ నుంచి పాల్గొన్న 7 మంది క్రీడాకారుల్లో అర్షద్ కు ఒక్కడికే ఆ దేశ ప్రభుత్వం ఫ్లైట్ టికెట్ బుక్ చేసింది. మిగిలిన ఆరుగురు ఖర్చులు భరించాల్సిందే. ఆ నమ్మకాన్ని అతను వమ్ము చేయలేదు. ప్రపంచాన్ని పాక్ వైపు చూసేలా చేశాడు. అతను బల్లాన్ని విసిరిన 92.97 మీటర్ల దూరం జావెలిన్ త్రో చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్. కూడానూ. 

నీరజ్ చోప్రా.. సిల్వర్

ఇదే విభాగంలో పోటీపడిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రా 89.45 మీటర్ల దూరం పాటు బల్లెం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. దాంతో, అతనికి రజత పతకం దక్కింది. ఒలింపిక్స్ చరిత్రలోనే వరుసగా రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌ నీరజ్ చోప్రా. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో అతను గోల్డ్ మెడల్ అందుకున్నాడు.