ఎవరీ ఏక్‌నాథ్‌ షిండే  ?

ఎవరీ ఏక్‌నాథ్‌ షిండే  ?

ఇప్పటికే శాసనమండలి ఎన్నికల్లో దెబ్బతిన్న  మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వానికి ఇప్పుడు మరో షాక్ తగిలింది. రాష్ట్ర కేబినెట్‌ మంత్రి, శివసేన  సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ షిండే  తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబావుటా ఎగురవేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో 11 మంది ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో లేరని సమాచారం. అయితే ప్రస్తుతం వీరంతా గుజరాత్ సూరత్ లోని ఓ హోటల్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరంతా కూడా పార్టీకి చెందిన ఏ ఫోన్ కాల్స్ కి కూడా స్పందించడం లేదని టాక్. మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. ఇంతకీ ఈ ఏక్‌నాథ్‌ షిండే  ఎవరు? 

 
9 ఫిబ్రవరి 1964  సంవత్సరంలో జన్మించిన  ఏక్‌నాథ్‌ షిండే  .. యశ్వంతరావు చవాన్ ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ పూర్తి చేశాడు.  రాజకీయాల పైన ఇంట్రెస్ట్ ఉండటంతో 1980లో శివసేన పార్టీలో చేరాడు. 1997లో  మొదటిసారి కార్పొరేటర్‌గా థానే మున్సిపల్ కార్పొరేషన్‌ నుంచి ఎన్నికయ్యారు. 2004లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2014, 2019లో  వరుసగా నాలుగుసార్లు  గెలిచి శాసనసభకి ఎన్నికయ్యారు. 2014లో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహారించారు.  ప్రస్తుతం ఉద్ధవ్ జీ ఠాక్రే నేతృత్వంలోని మహా-వికాస్- అఘాడి ఆధ్వర్యంలో కేబినెట్‌ మంత్రిగా కొనసాగుతున్నారు. ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే లోక్‌సభ ఎంపీగా, సోదరుడు ప్రకాష్ షిండే కౌన్సిలర్‌గా ఉన్నారు.