హెల్త్​ రెగ్యులేషన్స్​ సవరణ పేరిట.. డబ్ల్యూహెచ్​వో పెత్తనం!

హెల్త్​ రెగ్యులేషన్స్​ సవరణ పేరిట.. డబ్ల్యూహెచ్​వో పెత్తనం!

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో)1948 ఏప్రిల్ 7న ఏర్పాటైంది. కానీ, దాని ఉనికి కరోనాతో ప్రజలకు బాగా తెలిసింది. ఐక్య రాజ్య సమితి స్థాపించిన తర్వాత, ఆరోగ్యంపై ఒక అంతర్జాతీయ సంస్థ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 1969లో ఇంటర్నేషనల్​ హెల్త్​ రెగ్యులేషన్స్ (ఐహెచ్ఆర్)​ రూపొందించారు. 195 దేశాల సభ్యత్వం ఉన్న వరల్డ్​ హెల్త్​ అసెంబ్లీ ఈ నిబంధనలను ఆమోదించింది. వాటిని అప్పుడప్పుడు సవరించారు. చివరి సవరణ 2005లో అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వ్యాప్తి నేపథ్యంలో చేశారు. ఇప్పుడు కరోనా అనుభవం నేపథ్యంలో మళ్లీ సవరణ చేసే ప్రక్రియ మొదలైంది. 

నియంత్రణ వ్యవస్థను పటిష్టపరిచేందుకు..

అత్యవసర అనారోగ్య పరిస్థితులను గుర్తించి, ప్రతిస్పందించడానికి ఆయా దేశాల సామర్థ్యం పెంచడానికి ఈ నిబంధనలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు అధికారాలు ఇస్తుంది. ప్రతిస్పందనలో భాగంగా చట్టాలు తీసుకురావటం లేదా సవరించటం, వివిధ రకాల సేవల మధ్య సమన్వయం సాధించటం, నిరంతర నిఘా ద్వారా ముందే పసిగట్టడం వంటివి ఉండవచ్చు. వ్యాధి వ్యాప్తిని ఆయా దేశాలు డబ్ల్యూహెచ్​వోకు నివేదించడానికి, తర్వాత తీసుకోవాల్సిన వ్యాధి నియంత్రణ చర్యలను కూడా ఐహెచ్ఆర్ నిర్వచిస్తుంది. అయితే కరోనా టైమ్​లో ఐహెచ్ఆర్ సమాచార నివేదన వ్యవస్థ పరిమితులు స్పష్టమయ్యాయి. చైనా పూర్తి స్థాయి సమాచారం ఇవ్వకపోవడం, కొవిడ్​ మహమ్మారి విజృంభించినా, ఆ విధంగా డబ్ల్యూహెచ్​వో ప్రకటన చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో రాబోయే ప్యాండమిక్స్​ను దృష్టిలో పెట్టుకొని ఆ పరిమితులు ఉండకుండా అంతర్జాతీయ ఆరోగ్య నియంత్రణ వ్యవస్థను పటిష్టపరచడానికి డబ్ల్యూహెచ్​వో పూనుకున్నది. ప్రపంచ ఆరోగ్య సభలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇండియా సహా సభ్య దేశాలు సూచనలు కూడా చేశాయి. 

ఇంటర్నేషనల్​ ప్యాండమిక్​ ట్రీటీ 

2021 మార్చి 30న యూరోపియన్ యూనియన్ నేతృత్వంలో 25 మంది ప్రపంచ నాయకులు సమావేశమైనప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ బలోపేతం చేయడానికి ఒక ఇంటర్నేషనల్​ప్యాండమిక్​ను ​ట్రెటీ తయారీకి మొదటి అడుగు వేశారు. తర్వాత ఆ ఒప్పందాన్ని సాకారం చేయడానికి డబ్ల్యూహెచ్​వో అంతర్జాతీయ సంప్రదింపుల సంస్థ(ఐఎన్​బీ)ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో భారత్, చైనా, అమెరికా దేశాలు పాల్గొనలేదు.  మహమ్మారి ఒప్పందానికి ప్రేరణ ఈ మూడు దేశాల నుంచి ఉద్భవించలేదు. కనీసం నేరుగా కాదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న మహమ్మారి ప్రకటన, చికిత్స, వ్యాక్సిన్ భద్రత తదితర అంశాలతో సహా కొవిడ్-19ను ఎదుర్కొన్న తీరుపై ఈ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మొత్తానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో తయారు చేస్తున్న ఇంటర్నేషనల్ ​ప్యాండమిక్​ ట్రీటీ ‘సున్నా’ ముసాయిదాను 2023 ఫిబ్రవరి1న విడుదల చేశారు. భవిష్యత్తులో వచ్చే ప్యాండమిక్స్​ను నివారించడానికి, యంత్రాంగాలను సిద్ధం చేయడానికి, సమన్వయానికి, టీకాలు, చికిత్సకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే, ఈ యంత్రాంగం, దాని నిబంధనలు, మహమ్మారి పట్ల స్పందన అంతర్జాతీయ ప్రయాణాలను, వాణిజ్యాన్ని భంగపరచకూడదు.

ప్రైవేటు కంపెనీల లాభాలు

రెండవ కీలక అంశం ఏమిటంటే.. వ్యాక్సిన్ కోసం కోట్లు పెట్టి పరిశోధనలు చేశాం.. వాటి ధరల మీద, ఉత్పత్తి మీద, వినియోగం మీద సర్వహక్కులు మాకే ఉండాలని ప్రైవేటు కంపెనీలు వాదిస్తున్నాయి. ఈ వాదనను అంగీకరిస్తూనే, అందరికీ, వివక్ష లేకుండా వ్యాక్సిన్లు అందించాలని తాజా ఒప్పంద లక్ష్యమని డబ్లూహెచ్​వో ప్రకటిస్తున్నది. ఈ పరస్పర విరుద్ధ లక్ష్యాలు ఎట్లా సాధ్యం అంటే ప్రజా ధనం వినియోగం ద్వారా అనే సమాధానం వస్తున్నది. అవసరం లేని వ్యాక్సిన్ల ఉత్పత్తికి, వినియోగానికి ప్రజాధనం వినియోగం అవసరం అని డబ్ల్యూహెచ్​వో ఈ ఒప్పందం ద్వారా సంక్రమించే అధికారాలను ఉపయోగించి మహమ్మారికి చికిత్సలో సమానత్వం లక్ష్యం పేరుతో ప్రజల మీద రుద్దే అవకాశం ఉంది. కరోనా టీకాల పరిశోధనలో అమెరికా, భారత్ సహా అనేక ప్రభుత్వాలు ప్రజాధనం పెట్టుబడి పెట్టాయి. పరిశోధనల తర్వాత ఆయా టీకాల ఉత్పత్తి ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పాయి. ఉపయోగం లేని ఆ టీకాలను కచ్చితంగా తీసుకోవాల్సిందేనని నిబంధనలను తెచ్చి, ప్రైవేటు కంపెనీలు తమ మార్కెట్లను పదిలపరుచుకుని, కోట్ల లాభాలు ఆర్జించాయి. దీని మీద అమెరికా ప్రజా ప్రతినిధుల సభలో లోతైన చర్చ జరిగింది. ప్రజల ధనం వినియోగం మీద ఆధారాలు ఉన్నా, ప్రైవేటు కంపెనీలు వ్యాక్సిన్ ధరల మీద ప్రభుత్వాలకు అధికారం లేదని, ఉండొద్దని వాదిస్తున్నాయి. ఈ వాదనను ఈ ముసాయిదా ఒప్పందంలో మేధో సంపత్తి హక్కుల పేరిట గుర్తింపు ఇవ్వడం శోచనీయం. మూడోది డబ్ల్యూహెచ్​వోకు దఖలు పడే అధికారాల మీద ప్రజాస్వామ్య సూత్రాల అమలు ఏ మేరకు ఉంటుందనేది ప్రశ్న. ముసాయిదా తయారీలో లేని ప్రజల భాగస్వామ్యం ఒప్పందం మీద సంతకాలు చేసేటప్పుడు ఉంటుందా, ఒప్పందం అమలులోకి వచ్చాక డబ్ల్యూహెచ్​వో ప్రజాస్వామ్య సూత్రాలను పాటిస్తుందా అని సందేహాలు వస్తున్నాయి. కరోనా టైమ్​లో వచ్చిన విమర్శలను డబ్ల్యూహెచ్ వో సహేతుకంగా తీసుకోలేదని కొన్ని అంతర్గత నివేదికలు చెబుతున్నాయి. ప్రజల భాగస్వామ్యం లేని, ప్రజాస్వామ్య సూత్రాలు పొందుపరచని ఈ ముసాయిదా ఒప్పందంను అన్ని దేశాలు ఆమోదిస్తాయా అనేది అనుమానమే! 

బ్రిటన్​ పార్లమెంట్​లో చర్చ

ఇప్పటికే బ్రిటన్ పార్లమెంటులో తాజా ముసాయిదా ఒప్పందం చర్చకు వచ్చింది. అమెరికా కాంగ్రెస్ లోనూ కచ్చితంగా చర్చకు వస్తుంది. కానీ, మన దేశంలో ఇప్పటి వరకు పార్లమెంటు సభ్యుల దృష్టికి రాలేదు. కేంద్రం కరోనా టైమ్​లో తీసుకున్న నిర్ణయాల మీద చర్చ జరిగింది. రాబోయే మహమ్మారి నివారణకు, వస్తే తీసుకునే జాగ్రత్తలు, చికిత్స సంబంధ చర్యలు మీద ఈ ఒప్పందంలో ఉన్న అంశాలపై మన పార్లమెంటులోనూ చర్చ జరగాలి. 2023 జూన్ 12- నుంచి16 తేదీల మధ్య జరిగే డబ్ల్యూహెచ్​వో సమావేశంలో తొలి ముసాయిదాపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో భారత ప్రతినిధులు పాల్గొనే చాన్స్​ఉంది. ఈ సవరణ చేస్తున్నప్పుడు ప్రపంచ మహమ్మారి ఒప్పందం అవసరాన్ని కొన్ని దేశాలు ప్రశ్నిస్తున్నాయి. కాగా, మహమ్మారి ఒప్పందం సవరించే  అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు(ఐహెచ్ఆర్ 2005) మధ్య సంబంధం ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. రెండింట్లో ఏది పూర్తయినా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారాలు విశేషంగా పెరుగుతాయి. కరోనా అనుభవం దృష్ట్యా ఒకే సంస్థకు(ప్రజాస్వామ్య ప్రక్రియలకు దూరంగా) రాజకీయ, ఆర్థిక, సాంఘిక, పర్యావరణ, ఆరోగ్య సంబంధ అంశాల మీద అధికారాలు ఇవ్వడం ఆందోళనకర అంశమే. ఆయా ప్రక్రియల్లో పొందుపరిచిన అంశాలను లోతుగా పరిశీలించాలి. 

ఒప్పంద ముసాయిదాపై ఆందోళనలు

ఇంటర్నేషనల్​ ప్యాండమిక్​ ట్రీటీ ముసాయిదా చూసిన తర్వాత మూడు అతి ముఖ్యమైన అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జాతీయ సార్వభౌమత్వం, మేధో సంపత్తి పాలన, ప్రజాస్వామిక పాలనా సూత్రాలు. ఈ ఒప్పందం వల్ల ఒక దేశం మహమ్మారి పట్ల తనకు తానుగా నిర్ణయించుకునే అధికారం కోల్పోతుంది. కొవిడ్- టైమ్​లో అనేక దేశాలు డబ్ల్యూహెచ్​వో సూచనలను ఖాతరు చేయలేదు. ఈ ఒప్పందం అలాంటి పరిస్థితిని అధిగమిస్తుంది. అయితే డబ్ల్యూహెచ్​వోకు దేశీయ ప్రభుత్వాల మీద అధికారం చెలాయించే విధంగా ఈ ఒప్పందం ఆస్కారం కల్పిస్తుంది. ప్రైవేటు ఫార్మా కంపెనీలు, ప్రైవేటు ఫౌండేషన్ సంస్థలు ప్రజల సార్వభౌమత్వం మీద పైఎత్తు సాధిస్తాయి. కరోనా టైమ్​లో తాము చెప్పిందే చికిత్స, తాము నిర్దేశించిన జాగ్రత్తలు పాటించాల్సిందే అని చెప్పి, మభ్యపెట్టి, అవగాహన లేని ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజల మీద ఒక దమననీతి రుద్దిన ఈ ఆధునిక ఫార్మా వ్యవస్థ దేశీయ ప్రభుత్వాలు కూడా తాము చెప్పినట్టు నడుచుకుంటలేవని గ్రహించి, ఈ ఒప్పందం ప్రక్రియకు తెరలేపాయి. వ్యాక్సిన్లు కరోనాను తగ్గించకున్నా, నివారించకున్నా, వాటి ప్రభావం శాస్త్రీయంగా నిరూపణ కాకున్నా, అత్యవసర పరిస్థితి పేరు మీద ప్రజలకు అంటగట్టిన ఈ ప్రైవేటు వ్యవస్థ చేతిలో కీలుబొమ్మ అయిన డబ్ల్యూహెచ్​వోకు ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాల మీద అధికారం చెలాయించే అధికారం ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్​ అని బ్రిటీష్ పార్లమెంటు సభ్యుడు ఒకరు అడిగారు. ఈ ఒప్పందం అవసరాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. 

ప్యాండమిక్​ ప్రకటన వెనుక..

ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వెలువడే సందేశాలు శాస్త్రోక్తంగా రుజువైన తర్వాతే వెలువడతాయని నమ్మేవారు ఉన్నారు. కానీ, కరోనా విషయంలో అది అనేక తప్పిదాలు చేసింది. పరిశోధన లేకపోయినా తమ మీద ఉన్న నమ్మకాన్ని వాడుకుని కొన్ని అశాస్త్రీయ సందేశాలు విడుదల చేసింది. అనేక మరణాలకు, కొన్ని విపరీత పరిణా మాలకు ఈ సంస్థ బాధ్యత ఉందని వివిధ దేశాల్లో ప్రజాప్రతినిధులు, పౌర సంస్థలు అనేక సార్లు ఎండగట్టారు. అందుకే ఒక ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని మహమ్మారిగా ప్రకటించడానికి పరిగణనలోనికి తీసు కునే శాస్త్రీయ ప్రమాణాలు, ఎంచుకునే అప్రజాస్వామిక పద్ధతుల గురించి పౌర సమాజం ఆందోళన పడుతున్నది. మహమ్మారిని ఎలా నిర్వచిస్తారు? ఈ నిర్వచనంలో సైన్స్, వ్యాపారం, ప్రజాస్వామ్యం, రాజకీయం పాత్ర ఏమిటనే దానిపై ఆందోళన ఉన్నది.

- డా. దొంతి నర్సింహా రెడ్డి, పాలసీ ఎనలిస్ట్