పీసీసీ కొత్త చీఫ్ ​ఎవరు? ..లోక్ సభ ఎన్నికలదాకా రేవంత్​నే కొనసాగించే చాన్స్

పీసీసీ కొత్త చీఫ్ ​ఎవరు? ..లోక్ సభ ఎన్నికలదాకా రేవంత్​నే కొనసాగించే చాన్స్
  • టైం తక్కువుండటంతో మార్పులు చేర్పులతో ఇబ్బంది అని యోచన 
  • పీసీసీ కొత్త చీఫ్ పదవిపై పలువురు సీనియర్ల ఆశలు 
  • రేసులో భట్టి, ఉత్తమ్, వెంకట్ రెడ్డి, పొన్నం, మధుయాష్కీ 

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ స్టేట్ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఇప్పుడు పీసీసీ కొత్త చీఫ్​గా ఎవరుంటారన్న చర్చ మొదలైంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు ఆ పదవికి రేసులో ఉన్నారు. లీడర్ల సీనియారిటీ, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. కేబినెట్​లో చోటు కోసం ప్రయత్నిస్తున్న కొందరు సీనియర్లు కూడా పీసీసీ చీఫ్ పదవికి అర్హులుగా ఉన్నారన్న చర్చ సాగుతున్నది. కాంగ్రెస్ పార్టీలో సీఎంగా ఉన్నవాళ్లు పీసీసీ చీఫ్​గా కొనసాగకపోవడం సంప్రదాయంగా వస్తున్నది.

అన్ని రాష్ట్రాల్లోనూ అలాగే జరుగుతున్నది. ఇప్పుడు కూడా పీసీసీ చీఫ్, సీఎం పదవులు రెండూ ఒక్కరికే ఇచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. ఒకే నాయకుడు ఈ రెండు పదవులను సమర్థంగా నిర్వహించడం సాధ్యం కాదని అంటున్నారు. లోక్​సభ ఎన్నికలయ్యేదాకా రేవంత్ రెడ్డినే పీసీసీ చీఫ్​గా కొనసాగిస్తారని.. ఎన్నికల తర్వాతే మారుస్తారని తెలుస్తున్నది.   

ముందు వరుసలో భట్టి 

పీసీసీ చీఫ్​గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేరు ముందు వరుసలో ఉన్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే సీఎల్పీ లీడర్​గా పనిచేసిన అనుభవం ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశమని పార్టీ వర్గాలంటున్నాయి. దళిత సామాజిక వర్గం నుంచి పెద్ద లీడర్ కూడా కావడంతో ఆయనకు పీసీసీ చీఫ్ పదవి దక్కే అవకాశాలు లేకపోలేదంటున్నారు. కర్నాటకలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​ను పీసీసీ చీఫ్​గా చేశారు. ఇప్పుడు తెలంగాణలోనూ అదే ఫార్ములాను అనుసరిస్తే భట్టికి పీసీసీ చీఫ్ పదవి దక్కే చాన్స్ ఉంటుందని భావిస్తున్నారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు కూడా పీసీసీ చీఫ్ పదవి రేసులో వినిపిస్తున్నది. ఇప్పటికే ఆయనకు పీసీసీ చీఫ్​గా పనిచేసిన అనుభవం ఉండడంతో మరోసారి ఆ పదవి దక్కొచ్చనే చర్చ సాగుతున్నది. మరోసారి ఆయనకు అధిష్టానం అవకాశం ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా, ఎంపీగా 30 ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్ హయాంలో కీలక మంత్రి పదవులను చేపట్టారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ ​లీడర్​గా వెంకట్​రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.   

పొన్నం, మధుయాష్కీ కూడా.. 

పీసీసీ చీఫ్ రేసులో బీసీ నేతల పేర్లూ వినిపిస్తున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్​కు పీసీసీ చీఫ్ పదవి ఇస్తారంటూ ప్రచారం సాగుతున్నది. ఆయన కూడా అందుకు సిద్ధంగానే ఉన్నారని చెప్తున్నారు. మరో బీసీ లీడర్ మధుయాష్కీకి ఆ పదవి దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న వాదన వినిపిస్తున్నది. ప్రస్తుతం పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​గా ఉన్న ఆయన.. గతంలో నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు. రాహుల్ గాంధీతోనూ మంచి సంబంధాలున్నాయి. ఒకవేళ బీసీ సమీకరణాలను ప్రామాణికంగా తీసుకుంటే వీరిద్దరిలో ఒకరికి ఆ పదవి దక్కొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

అలాగే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పనిచేస్తున్న వారిలో ఒకరికి పీసీసీ చీఫ్​గా అవకాశం దక్కే సూచనలున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం పొన్నం ప్రభాకర్, మహేశ్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్నారు. కానీ మంత్రులుగా పనిచేస్తున్న వారైతేనే పీసీసీ చీఫ్ పదవికి ఇప్పుడు బెటర్ అని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది.

లోక్​సభ ఎన్నికల తర్వాతే.. 

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లోనూ ఇదే స్థాయిలో విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నది. ఇలాంటి సమయంలో పీసీసీ చీఫ్​ను మారిస్తే మళ్లీ సంస్థాగతంగా మార్పులు చేయాల్సి వస్తుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తున్నది. లోక్​సభ ఎన్నికలకు మరో 4 నెలల సమయం మాత్రమే ఉండడంతో..

ఇప్పుడు మార్పులు చేస్తే అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ ఎన్నికల్లో ఎఫెక్ట్ పడుతుందని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని సమర్థంగా నడిపించిన రేవంత్ రెడ్డినే లోక్​సభ ఎన్నికల వరకు కొనసాగించి.. రిజల్ట్ వచ్చాక కొత్త పీసీసీపై నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో అధిష్టానం ఉన్నట్టు చెప్తున్నారు.