
- ఒమిక్రాన్‌పై టీకాల ఎఫెక్ట్ తక్కువన్న డబ్ల్యూహెచ్‌వో
- కేసులు భారీగా పెరిగే ముప్పు
- ఇప్పటికే 77 దేశాలకు కొత్త వేరియంట్
- ఒమిక్రాన్ కొత్త లక్షణాలు రాత్రిపూట చెమటలు, నడుము నొప్పి, నీళ్ల విరేచనాలు
- మన దేశంలో 65కు పెరిగిన కేసులు.. మహారాష్ట్రలోనే 28
జెనీవా/న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై ఇప్పుడున్న వ్యాక్సిన్ల ప్రభావం తక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాక్సిన్లు వేసుకున్నోళ్లలో ఇప్పటికే వచ్చిన ఇమ్యూనిటీనీ ఒమిక్రాన్ తప్పించుకుంటోందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనోం గెబ్రియేసస్ చెప్పారు. బూస్టర్ డోస్ వేసుకుంటే దాని నుంచి రక్షణ లభించే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే, ఒమిక్రాన్‌పై టీకాల పనితనాన్ని తెలుసుకునేందుకు మరింత రీసెర్చ్చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒమిక్రాన్‌తో చాలా డేంజర్ అని, దానిని తక్కువ అంచనా వేయొద్దని సూచించారు. డెల్టా సహా ఇంతకుముందున్న వేరియంట్లతో పోలిస్తే ఊహకందనంత వేగంగా ప్రపంచమంతటా ఒమిక్రాన్ వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వేరియంట్ తీవ్రత తక్కువే అయినా కేసులు పెరిగే ముప్పు ఉందన్నారు. ఇప్పటికే 77 దేశాలకు అది పాకిందన్నారు. మరిన్ని దేశాల్లోనూ ఒమిక్రాన్ కేసులుండే అవకాశాలున్నాయని, జీనోమ్ సీక్వెన్స్ చేస్తే బయటపడతాయని చెప్పారు. ఒమిక్రాన్‌ను చాలా దేశాల్లో లైట్ తీస్కుంటున్నారన్నారు. పేద దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయాల్సిన బాధ్యత పెద్ద దేశాలపై ఉందని మరోసారి గుర్తు చేశారు.
అమెరికాలో పెరుగుతున్నయ్
అమెరికాలోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల్లో నమోదైన కరోనా కేసుల్లో 2.9 శాతం ఒమిక్రాన్ కేసులున్నాయని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. అంతకుముందు వారం అది కేవలం 0.4 శాతమేనని తెలిపింది. చాలా వేగంగా ఒమిక్రాన్ వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, దేశంలో 20 కోట్ల మందికి టీకా రెండు డోసులు ఇచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. మొత్తం దేశ జనాభాలో అది 60 శాతమని అంటున్నారు. ఇప్పటిదాకా వచ్చిన కేసుల్లో 20 శాతం వరకు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నోళ్లే ఉన్నారని సీడీసీ పేర్కొంది. జనవరి నాటికి ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఒకే వారంలో ఏడు రెట్లు పెరిగే ముప్పుందని హెచ్చరించింది. సీడీసీ లెక్కల ప్రకారం 35 రాష్ట్రాల్లో ఒమిక్రాన్కేసులు నమోదయ్యాయి. కాగా, మున్ముందు దేశంలో ఒమిక్రాన్ తీవ్రత మరింత పెరిగే ప్రమాదముందని అమెరికా డిసీజ్ ఎక్స్పర్ట్ ఆంథోనీ ఫౌచీ అన్నారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల ప్రభావం తక్కువగా ఉందన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఒమిక్రాన్‌తో ముప్పు ఎక్కువగానే ఉంటుందని హెచ్చరించారు.
ఈయూ దేశాల్లో 5 నుంచి 11 ఏండ్ల పిల్లలకు కరోనా వ్యాక్సిన్
ఐదేండ్ల నుంచి పదకొండేండ్ల మధ్య పిల్లలకూ యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు వ్యాక్సినేషన్‌ను స్టార్ట్ చేశాయి. ఒమిక్రాన్ వ్యాప్తి పెరగడంతో బుధవారం నుంచి పిల్లలకూ టీకాలు వేస్తున్నారు. గ్రీస్, ఇటలీ, స్పెయిన్, హాంగేరిలు పిల్లలకు వ్యాక్సినేషన్లో వేగం పెంచాయి. ఫైజర్ బెయోఎన్‌టెక్ చిన్న పిల్లల టీకాకు గత నెలలో ఈయూ రెగ్యులేటర్ ఆమోదం తెలిపింది. బుధవారం గ్రీస్ రాజధాని ఏథెన్స్లో పిల్లలకు టీకాలు వేశారు. 30 వేల మంది పిల్లలకు టీకాలేసేందుకు అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు తెలిపారు.
మరో మూడు లక్షణాలు
ఒమిక్రాన్కొత్త లక్షణాలను సైంటిస్టులు బయటపెట్టారు. తీవ్రమైన అలసట, తలనొప్పి, కండరాల నొప్పులు, ఒంటి నొప్పులు, గొంతు గరగర వంటి లక్షణాలున్నట్టు ఇప్పటికే తేల్చిన సంగతి తెలిసిందే. వాటికి తోడుగా మరో మూడు లక్షణాలున్నట్టు బ్రిటన్ సైంటిస్టులు గుర్తించారు. రాత్రిపూట తీవ్రంగా చెమటపట్టడం, నడుము నొప్పి, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాలూ వస్తున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ సైంటిస్ట్, కొవిడ్‌పై బ్రిటన్ ప్రభుత్వ సలహాదారు సర్ జాన్ బెల్ చెప్పారు. ఇటు బ్రిటన్ ఎన్హెచ్ఎస్ (నేషనల్ హెల్త్ సర్వీస్) కూడా చెమట, నడుము నొప్పి వంటి లక్షణాలు వస్తున్నట్టు తేల్చింది.