దేశం నరకప్రాయమైనా వాళ్లు పట్టించుకోవట్లే

దేశం నరకప్రాయమైనా వాళ్లు పట్టించుకోవట్లే

కేంద్ర ప్రభుత్వంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే పరోక్షంగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హిందుత్వ ఎప్పుడూ తప్పుడు విధానాలను నేర్పదని అన్నారు. కానీ కొంత మంది తమ సొంత ఎజెండా కోసం పని చేస్తున్నారని, దేశంలో పరిస్థితులు నరకప్రాయంగా మారినా వాళ్లు పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ ముంబైలోని థాక్రే నివాసానికి వెళ్లి దేశ రాజకీయాలపై చర్చించారు. ఈ సమావేశం తర్వాత ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ తమ హిందుత్వ వాదం సూడో జాతీయ విధానం కాదన్నారు. కేంద్రంలో ఉన్న మోడీ సర్కారుకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఇవాళ్టి నుంచి తాము మరిన్ని పార్టీల నేతలను కలుస్తామన్నారు. అయితే ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమిలో ఎప్పుడూ ప్రధాని అభ్యర్థి ఎవరన్న దానిపై ఎప్పుడూ గందరగోళం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ అంశంపైనా ఉద్ధవ్ స్పందించారు. తమ కూటమిలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నది తర్వాత చర్చిస్తామని ఆయన చెప్పారు.

అంతకు ముందు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో భారీ మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశ రాజకీయాలను చర్చించేందుకే ఇవాళ మహారాష్ట్ర వచ్చానన్నారు.  దేశాభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, దేశ రాజకీయాల్లో మంచి మార్పు కోసం తమ ఇరువురి మధ్య చర్చలు సాగాయని తెలిపారు. చట్టాల్లో చేయాల్సిన మార్పులపైనా చర్చించామన్నారు. రాబోయే రోజుల్లో  కలిసి నడవాలని నిర్ణయించామన్నారు. ఉద్ధవ్ థాక్రేను త్వరలో తెలంగాణకు రావాల్సిందిగా ఆహ్వానించానని, హైదరాబాద్ లేదా మరో చోట   మిగతా ప్రాంతీయ పార్టీలతో సమావేశమవుతామని కేసీఆర్ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు దారుణంగా దుర్వినియోగం అవుతున్నాయని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కేంద్రం తన తీరును మార్చుకోవాలని లేకపోతే భవిష్యత్తులో వాళ్లకు కూడా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

మరిన్ని వార్తల కోసం..

సూడో జాతీయ విధానాన్ని అడ్డుకోవడమే లక్ష్యం

ఓటేసిన ఫొటో వాట్సాప్ లో షేర్ చేసిన మేయర్పై కేసు

నా సమస్యకు పరిష్కారం ఢిల్లీలోనే దొరుకుద్ది