కరోనాపై పోరులో అందరూ ఒక్కటవ్వాలి: డబ్ల్యూహెచ్ఓ

కరోనాపై పోరులో అందరూ ఒక్కటవ్వాలి: డబ్ల్యూహెచ్ఓ

జెనీవా: కరోనాపై పోరాటానికి ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) కోరింది. కరోనా విషయంలో చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విమర్శలు చేసిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనొమ్ గెబ్రెయెసస్ ఈ ప్రకటన చేశారు. చైనాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనాను డబ్ల్యూహెచ్ఓ నోటిఫై చేసి గురువారానికి వంద రోజులు అయ్యింది. ఈ సందర్భంగా జెనీవాలో వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో టెడ్రోస్ మాట్లాడారు. 2009 లో హెచ్1ఎన్ 1 ప్రబలినప్పుడు డబ్ల్యూహెచ్ఓ బాగా పని చేసిందని, ఐదేళ్ల తర్వాత వెస్ట్ ఆఫ్రికాలో ఎబోలా ప్రబలినప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించేందుకు జాప్యం చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం కరోనాపై అలర్ట్ చేయడంలోనూ లేట్ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో పరస్పరం నిందలు వేసుకోవడం సరికాదని, చైనాతో కలిసి అమెరికా కరోనాపై పోరాడాలని టెడ్రోస్ సూచించారు. రాజకీయ పార్టీలు ప్రజలను రక్షించుకునే అంశంపై దృష్టి పెట్టాలని, కరోనాపై రాజకీయాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. “మీకు మరిన్ని బాడీ బ్యాగ్ లు వద్దనుకుంటే, కరోనాపై రాజకీయాలు చేయకండి. ఇది నిప్పుతో చెలగాటమాడటమే. ఇప్పటివరకు జరిగింది సరిపోదా. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది” అని ట్రెడోస్ హెచ్చరించారు. కరోనాపై అవగాహన కల్పించేందుకు మ్యూజిక్ ఐకన్స్ పాల్ మెక్ కర్ట్నీ, స్టెవీ వండర్ లతో కలిసి టెడ్రోస్ ఈ నెల 18న ‘ఒన్ వరల్డ్ : టుగెదర్ ఎట్ హోమ్’ అనే ఆన్ లైన్ కన్సర్ట్ ను నిర్వహించనున్నారు.

నిగ్రో అని పిలిచినా పట్టించుకోను: టెడ్రోస్

వ్యక్తిగత విమర్శలపై స్పందించిన ట్రెడోస్ తాను నల్లవాడినని చెప్పుకునేందుకు గర్వపడుతున్నానని, నిగ్రో అని పిలిచినా పట్టించుకోనని చెప్పారు. అయితే బ్లాక్ కమ్యూనిటీని, ఆఫ్రికాను ఇన్సల్ట్ చేస్తే సహించేది లేదన్నారు. ట్రెడోస్ కు ఆఫ్రికన్ యూనియన్, సౌత్ ఆఫ్రికా, నైజీరియా, రువాండ్ ప్రెసిడెంట్లు, యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్, లేడీ గాగా లాంటి యూఎస్ సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు.