నిద్రలోనూ ఫోన్​ గురించే..పిల్లలు ఎందుకింతగా అడిక్ట్​ అవుతున్నారు? 

నిద్రలోనూ ఫోన్​ గురించే..పిల్లలు ఎందుకింతగా అడిక్ట్​ అవుతున్నారు? 

శివాని ఎప్పుడూ ఇంటి పని, ఆఫీస్​ వర్క్​ అంటూ బిజీగా ఉంటుంది. తన రెండేండ్ల కూతురు పదే పదే విసిగిస్తుందని, తన పనికి అడ్డు రాకుండా ఉండేందుకు చిన్నారి కోసం ఒక స్మార్ట్‌‌ఫోన్​ కొని ఇచ్చింది. దాంతో చిన్నారి ఎప్పుడూ యూట్యూబ్‌‌లో కార్టూన్స్​ చూస్తుండేది. అదే ఆ బుజ్జిపాపకు పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది. చిన్నారి పదే పదే భయపడేది. ఇంటికి ఎవరైనా కొత్తవాళ్లు వస్తే గట్టిగా అరిచేది. ఎవరితోనూ సరిగా ఉండేది కాదు. దాంతో చిన్నారిని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. చిన్నారి యాంగ్జయిటీతో బాధపడుతున్నట్లు డాక్టర్లు చెప్పారు. ప్రతి రోజూ ఏడెనిమిది గంటలు స్మార్ట్‌‌ఫోన్‌‌ వాడడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతిని ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పారు. 

  *   *   *

స్మార్ట్‌‌ ఫోన్‌‌ అందుబాటులోకి వచ్చాక టీనేజర్లు ఎక్కువగా పబ్జీలాంటి గేమ్స్‌‌కు బాగా అలవాటు పడ్డారు. ఇలాంటి గేమ్స్‌‌ వల్ల వాళ్లలో అనేక రకాల మానసిక సమస్యలు వస్తున్నాయి. 2019లో నిజామాబాద్​కు చెందిన తొమ్మిదో తరగతి అబ్బాయిని ‘పబ్జీ ఆడొద్దు’ అని తల్లి మందలించినందుకు ఆత్మహత్య చేసుకున్నాడు.  

*   *   *

బిహార్​లోని బరారీ పోలీస్ స్టేషన్ పరిధిలో సర్ధో గ్రామంలో ఉంటున్న రోషన్ కుమార్ స్మార్ట్‌‌ఫోన్‌‌లో ఎక్కువగా గేమ్స్‌‌ ఆడేవాడు. గేమ్‌‌లో ఓడిపోయిన ప్రతిసారి అతని ప్రవర్తనలో మార్పు కనిపించేది. ఒకరోజు గేమ్‌‌లో ఓడిపోవడంతో ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. 
ఇప్పటివరకు ఇలాంటి కేసులు ఎన్నో రికార్డ్ అయ్యాయి. స్మార్ట్‌‌ ఫోన్​ అడిక్షన్‌‌ వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు. 

*   *   *

ఒకప్పుడు పిల్లలు ఏడిస్తే.. ఏడుపు మాన్పించడానికి ఆట బొమ్మలు చేతిలో పెట్టేవాళ్లు. అయినా.. వినకపోతే.. బయటకు తీసుకెళ్లి.. రోడ్డు మీద వెళ్తున్న మనుషులనో లేకపోతే కుక్కలు, గేదెలు, కోళ్లను చూపించేవాళ్లు. కానీ.. ఇప్పడు పిల్లలు ఏడుపు మొదలుపెడితే చాలు.. చేతిలో ఫోన్​ పెట్టి నోరు మూయిస్తున్నారు. జ్వరమొస్తే.. పారాసిటమాల్​ డ్రాప్స్​ వేసినట్టు ఏడుపొస్తే.. స్మార్ట్‌‌ఫోన్​​ ఇస్తున్నారు. కానీ.. ఇలా చేయడం వల్ల వాళ్ల జీవితాలపై చాలా ఎఫెక్ట్‌‌ పడుతుందని ఎక్స్​పర్ట్స్‌‌ అంటున్నారు. మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పిల్లలను పట్టి పీడిస్తున్న సమస్య ఇది. 

తల్లిదండ్రులే కారణమా? 

ఈ రోజుల్లో పిల్లలు సెల్‌‌ఫోన్ లేకపోతే లైఫ్​లో ఎంజాయ్​మెంట్​ లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. చాలామంది పిల్లలు మొబైల్ ఫోన్లకు  బానిసలయ్యారు. మన దేశంలో స్మార్ట్‌‌ఫోన్​​ అందుబాటులో ఉన్న పిల్లల్లో దాదాపు  93శాతం మంది మొబైల్ గేమ్స్​ ఆడటానికి ఇష్టపడుతున్నారు. వాళ్లలో చాలామందికి అవుట్‌‌డోర్ గేమ్స్ ఆడడం ఇష్టం లేదని సౌరాష్ట్ర యూనివర్సిటీ  చేసిన ఒక సర్వేలో తెలిసింది. ఈ యూనిర్సిటీలోని సైకాలజీ డిపార్ట్​మెంట్​ కొన్నాళ్ల క్రితం ఈ సర్వే చేసింది. అందులో తెలిసింది ఏంటంటే.. 54 శాతం మంది పిల్లలకు వాళ్ల తల్లులే ఫోన్​ వాడడం అలవాటు చేస్తున్నారు. తల్లులు పని చేసుకునేటప్పుడు పిల్లలు అడ్డు రాకుండా ఉండేందుకు ఫోన్​ ఇచ్చి, ఆడుకోమంటున్నారు. ఇలా మొబైల్​ అలవాటు చేసేవాళ్లలో దాదాపు 30శాతం మంది మాత్రమే ఉద్యోగాలు చేసే వాళ్లు ఉన్నారు. మిగతా 70శాతం మంది ఇంట్లోనే ఉంటున్నారు. మరో సర్వే ప్రకారం.. 82 శాతం మంది పిల్లలు తమ తల్లిదండ్రులను ఫోన్​ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. వాళ్లలో 78శాతం పిల్లలకు మొబైల్ స్క్రీన్ చూస్తూ ఫుడ్​ తినటం అలవాటుగా మారిపోయింది. 

మొబైల్ అడిక్షన్​ ఉన్న పిల్లల్లో 82శాతం మందికి అనేక రకాల మానసిక సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలామంది పిల్లలు ఒంటరితనం(లోన్లీనెస్​ డిజార్డర్​)తో బాధపడుతున్నారు. పిల్లల్ని ‘‘మీరు స్కూల్ వెళ్లినప్పుడు ఏం మిస్​ అవుతున్నారు?” అని అడిగితే..  ‘‘అమ్మానాన్నల్ని’’ అని సమాధానం చెప్పడం లేదు. దాదాపు 73శాతం మంది పిల్లలు ‘‘మేం స్కూల్‌‌లో ఉన్నప్పుడు మొబైల్‌‌ను మిస్ అవుతున్నాం” అంటున్నారు. అందుకే చాలామంది పిల్లలు సాయంత్రం స్కూల్‌‌ నుంచి ఇంటికి రాగానే ఫోన్‌‌ కావాలని మారాం చేస్తున్నారు. అంతెందుకు కొందరు పిల్లలైతే.. మొబైల్​ స్క్రీన్​ చూడకుండా అన్నం కూడా తినలేకపోతున్నారు. ఇంకొందరు హోమ్‌‌వర్క్ కూడా మొబైల్​ స్క్రీన్​ చూస్తూనే చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లలు ఫోన్లకు బానిసలయ్యారు. తల్లిదండ్రులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. 

నిద్రలోనూ ఫోన్​ గురించే 

కొన్నాళ్ల క్రితం యూట్యూబ్​లో ఒక వీడియో బాగా వైరల్​ అయ్యింది. అందులో ఐదేండ్ల పిల్లాడు గాఢ నిద్రలో ఉంటాడు. కానీ.. చేతులు మాత్రం ఫోన్​ స్క్రీన్​ని  స్క్రోల్​ చేస్తున్నట్టు ఆడిస్తున్నాడు. అంటే నిద్రలో కూడా పిల్లలు ఫోన్​ గురించే ఆలోచిస్తున్నారు. ఒక సర్వే ప్రకారం.. మొబైల్​ అడిక్షన్​ ఉన్న పిల్లల్లో 64 శాతం మంది నిద్రలో మాట్లాడుతున్నారని వాళ్ల తల్లిదండ్రులు చెప్పారు. అంతేకాదు.. దాదాపు 77శాతం మంది పిల్లల సగటు స్లీపింగ్​ టైం ఆలస్యం అయ్యింది. అంటే.. ఫోన్​ అడిక్షన్​ లేకముందు.. ప్రతిరోజూ రాత్రి 8 గంటలకే పడుకునే పిల్లవాడు ఫోన్​ అడిక్ట్‌‌ అయ్యాక రాత్రి పది లేదా పదకొండు గంటల తరువాతే నిద్రపోతున్నాడు.

స్కూలుకు వెళ్లకముందే.. 

కొందరు పిల్లలైతే స్కూల్​కు వెళ్లి ‘అ..ఆ..’ లు కూడా రాకముందే ఫోన్​ వాడడం ​నేర్చుకుంటున్నారు. నాలుగైదేండ్ల పిల్లలకు కూడా యూట్యూబ్​ ఓపెన్​  చేయడం, అందులో పాటలు పెట్టడం తెలుసు. ఇంకొందరైతే.. ఇన్​స్టాగ్రామ్​ ఓపెన్​ చేసి రీల్స్​ కూడా చూస్తున్నారు. తల్లిదండ్రులు ఫొటోలు, వీడియోలు తీస్తుంటే.. కొందరు పిల్లలు రకరకాల పోజులు ఇస్తున్నారు. అదంతా ఫోన్​ వల్ల వచ్చిన జ్ఞానమే. ఒక సర్వే ప్రకారం.. యూకేలో మూడు.. నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లల్లో దాదాపు 69 శాతం  మంది పిల్లలు ఫోన్లు వాడుతున్నారు. అంతేకాదు.. ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరికి సొంతంగా స్మార్డ్‌‌ డివైజ్​ ఉంది. అంటే.. పిల్లలు ఆడుకోవడానికి తల్లిదండ్రులే ప్రత్యేకంగా స్మార్ట్‌‌ఫోన్​ లేదా ట్యాబ్ కొనిస్తున్నారు.

వాస్తవానికి మూడు.. నాలుగేండ్ల వయసులో కనీసం పెన్ను కూడా పట్టుకోవడం తెలియదు. వాళ్ల బట్టలు వాళ్లు వేసుకోలేరు. కానీ.. వాళ్లలో 92 శాతం మందికి యూట్యూబ్​ ఓపెన్​ చేయడం తెలుసు. దాదాపు సగం మందికి వాయిస్ మెసేజ్​లు, వీడియోలు షేర్​ చేయడం తెలుసు. 23శాతం మందికి ఇతర సోషల్ మీడియా యాప్‌‌లు, సైట్‌‌లు వాడడం తెలుసు.18 శాతం మంది ఆన్‌‌లైన్‌‌లో గేమ్స్​ కూడా ఆడుతున్నారు. ఎక్కువమంది పిల్లలు కిడ్స్​ కంటెంట్‌‌ ఉన్న ఛానెళ్లు, ట్రాక్టర్ల వీడియోలు చూస్తున్నారు. 

*   *   *

ఎందుకింతగా అడిక్ట్​ అవుతున్నారు? 

ప్రస్తుతం పిల్లలు స్మార్ట్‌‌ఫోన్లకు ఈజీగా అడిక్ట్ అవుతున్నారు. కొందరు పిల్లలు ఎవరి ప్రమేయం లేకుండానే ఫోన్లకు అలవాటు పడుతున్నారు. అందుకు ముఖ్య కారణం... ఫోన్లు చాలా ఈజీగా వాడగలగడమే. అందుకే  సంవత్సరం వయసున్న పిల్లలు కూడా ఫోన్ పట్టుకుని స్వైప్ చేసేస్తున్నారు. 

చూసి నేర్చుకుంటారు

తల్లిదండ్రులు ఏది చేస్తే.. పిల్లలు అదే చేయడానికి ఇష్టపడతారు. తల్లిదండ్రులు ఎప్పుడుచూసినా ఫోన్లు పట్టుకుని ఉంటే.. పిల్లలకు కూడా అలాగే ఉండాలి అనిపిస్తుంది. తల్లిదండ్రులనే అనుకరిస్తూ నేర్చుకుంటారు. వాళ్లు రీల్స్​ స్వైప్​ చేస్తుంటే.. పిల్లలు కూడా అలాగే స్వైప్​ చేయాలి అనుకుంటారు. అప్పటి నుంచి ఫోన్​ అడగడం మొదలుపెడతారు. చాలామంది పిల్లలు ఇలాగే ఫోన్లకు బానిసలు అవుతుంటారు. 

ఆనందం

పెద్దల్లాగే పిల్లలకు కూడా స్మార్ట్‌‌ఫోన్లు తక్షణ ఆనందాన్ని ఇస్తాయి. తల్లిదండ్రులకే కాదు.. పిల్లలకు కావలసినవన్నీ కూడా ఫోన్లలో ఉన్నాయి. గేమ్స్​ నుంచి నర్సరీ రైమ్స్​, వాళ్లకు ఇష్టమైన కార్టూన్స్​, అన్నీ ఒకే చోట దొరుకుతాయి. అందుకే పిల్లలు కూడా వాటితోనే ఎంటర్‌‌‌‌టైన్​ కావాలి అనుకుంటారు. 

రివార్డ్స్‌‌

ఫోన్లలో గేమ్స్ ఆడే పిల్లలు వాటికి ఎక్కువగా అడిక్ట్‌‌ కావడానికి కారణం.. గేమ్స్​లో ఇచ్చే స్కోర్లు, రివార్డ్స్‌‌. పిల్లలు తమ ఫ్రెండ్స్​ కంటే ఎక్కువ స్కోర్​ చేయాలి అనుకుంటారు. అందుకే పోటీ పడి మరీ గేమ్స్​ ఆడుతుంటారు. అంతేకాదు.. షార్ట్‌‌ వీడియోలు చేసే పిల్లలు లైక్స్‌‌, షేర్లు ఎన్ని ఎక్కువ వస్తే.. అంత గొప్ప​గా ఫీలవుతుంటారు. వాటిని కూడా రివార్డ్స్‌‌లాగే భావిస్తుంటారు.  

గోల భరించలేక ఇస్తున్నారా? 

పిల్లల ఆనందం కోసం ఫోన్లు ఇచ్చేవాళ్లు కొందరైతే వాళ్ల గోల భరించలేక ఫోన్లు ఇచ్చే తల్లిదండ్రులే ఎక్కువ అంటున్నారు సైకియాట్రిస్ట్‌‌ హరీష్. ఎందుకంటే.. చాలామంది తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆఫీస్​, ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. ఏడుస్తున్న పిల్లాడిని ఊరుకోపెట్టడానికి ఫోన్లు ఇస్తున్నారు. లేదంటే.. పిల్లలు తిండి తినకుండా మారాం చేసినప్పుడు, బయటికి తీసుకెళ్లాలని గోల చేసినప్పుడు ఫోన్లు ఇస్తుంటారు. ఫోన్​ ఇస్తే ఇబ్బంది పెట్టకుండా వాళ్లంతట వాళ్లే ఆడుకుంటారులే అనుకుంటారు. కానీ.. దానివల్ల బయటి మనుషులతో కనెక్ట్‌‌ కావాల్సిన పిల్లలు ఫోన్​లో కనిపించే బొమ్మలకు కనెక్ట్‌‌ అవుతుంటారు. ఫోన్​లో కనిపించే విజువల్స్‌‌ని చూస్తూ వాటికి రియాక్ట్‌‌ అవుతుంటారు. దానివల్ల రియల్‌‌ వరల్డ్‌‌కి దూరమవుతున్నారు. 

తోటి పిల్లల్ని చూసి.. 

తమ పిల్లల విషయంలో చాలా స్ట్రిక్ట్‌‌గా ఉండి, మొదట్లో ఫోన్​లు అస్సలు ఇవ్వని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ.. వాళ్లను స్కూల్లో జాయిన్​ చేశాక ఫోన్లు ఇవ్వాల్సి వస్తోంది. ఎందుకంటే.. స్కూల్‌‌కు వెళ్లే పిల్లల్లో ఫోన్లు వాడేవాళ్లే ఎక్కువ. వాళ్లకున్న ఖాళీ టైంలో ఫోన్‌‌లో ఆప్షన్స్‌‌, గేమ్స్‌, రీల్స్​, యూట్యూబ్​ వీడియోల గురించి డిస్కస్​ చేస్తుంటారు. వాటి గురించి తెలియని పిల్లల్ని ఎగతాళి చేస్తారు. అందువల్ల ఫోన్​ చూడని పిల్లలు తమను తాము తక్కువగా అంచనా వేసుకుని, చాలా వెనుకబడి ఉన్నాం అనుకుంటారు. ఫోన్​ వాడకపోవడం వల్ల చాలా కోల్పోతున్నామని ఫీల్​ అవుతుంటారు. అందుకే ఫోన్​ ఇవ్వాలని ఇంట్లో మారాం చేస్తుంటారు. చేసేదేమీ లేక వాళ్లకు కూడా ఫోన్లు ఇస్తుంటారు. 

 *   *   *

ఎలా తెలుసుకోవాలి? 

పిల్లలు స్మార్ట్‌‌ఫోన్ లేదా ఇంటర్నెట్​కు అడిక్ట్‌‌ అవుతున్నారా? అనేది తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. పిల్లల్లో నిరాశ, ఆందోళన, ఒంటరితనం కనిపిస్తే వాళ్లు అడిక్ట్‌ అయినట్టు. అయితే.. అవి ఎందుకొస్తాయని అడిగితే..  ‘కోడి ముందా?  గుడ్డు ముందా?’ అన్నట్టే ఉంటుంది. ఎందుకంటే అప్పటికే ఈ లక్షణాలు ఉన్న పిల్లలు ఎక్కువగా ఫోన్లు వాడుతున్నారా లేక ఫోన్లు వాడేవాళ్లలో ఈ లక్షణాలు ఉన్నాయా? చెప్పడం కాస్త కష్టమే. 

లక్షణాలు :  పిల్లలు ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటుంటారు. 
                      ఫోన్‌‌ను ఎప్పుడూ ఆన్‌‌లో ఉంచి, దాన్ని వాళ్ల దగ్గరే ఉంచుకోవాలి అనుకుంటారు. 
                      ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తుంటాయి. 
                      భావోద్వేగాలు అదుపులో ఉండవు. 
                      అసహనం, చిరాకు, అశాంతి, చదువు మీద దృష్టి పెట్టలేకపోవడం లాంటివి గమనించవచ్చు. 
                      నిద్రలో ఇబ్బందులు. 
                      కోపం, దూకుడు లక్షణాలు ఎక్కువ అవుతాయి. 
                     ఎప్పుడూ -ఒంటరిగా ఉన్నట్టు ఫీల్​ అవుతుంటారు. 
                     ఫోన్​ కనిపించకపోతే విపరీతంగా బాధపడుతుంటారు. 

   *   *   *

బ్రెయిన్​ మీద ఎఫెక్ట్‌

ఎదుగుతున్న పిల్లల మీద స్మార్ట్‌‌ఫోన్లు చాలా ఎఫెక్ట్‌‌ చూపిస్తాయి. వాళ్ల మనసులు, శరీరాలు మొబైల్​ ఫోన్స్, ట్యాబ్స్​ లాంటి గాడ్జెట్ల నుంచి వచ్చే రేడియేషన్స్​ వల్ల చాలా ఎఫెక్ట్‌‌ అవుతాయి. వాళ్లకు హాని కలిగిస్తాయి. సెల్​ఫోన్లతో పాటు ఇతర వైర్‌‌లెస్ పరికరాల నుండి వచ్చే మైక్రోవేవ్ రేడియేషన్‌‌ చాలా హానికరం. ఈ రేడియేషన్​ ఎఫెక్ట్‌‌ పెద్దల కంటే కంటే పిల్లల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ల మెదడు కణజాలాలు వీటిని ఎక్కువగా శోషించగలవు. మైక్రోవేవ్ రేడియేషన్స్ ఎక్స్​పోజర్ మెదడు నాడీకణాల మీద ప్రభావం చూపుతుంది. 
ఈ మధ్య జరిగిన రీసెర్చ్‌‌ల ప్రకారం.. పిల్లల మెదడు కణజాలం పెద్దల కంటే రెండు రెట్లు ఎక్కువ మైక్రోవేవ్ రేడియేషన్‌‌లను గ్రహిస్తుంది. అంతేకాదు.. పిల్లల ఎముకల్లో ఉండే మజ్జ పెద్దల కంటే పది రెట్లు మైక్రోవేవ్ రేడియేషన్​ని గ్రహిస్తుంది. పిల్లలు వైర్‌‌లెస్ డివైజ్​లను ఉపయోగించడంపై  బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, చైనా ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చాయి. తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. 

ఐ.క్యు. తగ్గుతుంది

సెల్‌‌ఫోన్ల మితిమీరిన వాడకం వల్ల పిల్లల్లో ఐ.క్యు. తగ్గుతుంది. మానసిక ఎదుగుదల, నిద్ర లేమి, మెదడు కణితులు, మానసిక వ్యాధుల బారిన పడతారు. ఇప్పటివరకు సెల్​ఫోన్ల వాడకం మీద ఎన్నో రీసెర్చ్‌‌లు జరిగాయి. అవన్నీ పిల్లలకు ఫోన్లను దూరం చేయాలనే చెప్తున్నాయి. కానీ.. వైర్‌‌లెస్ డివైజ్​లు ఇప్పుడు డైలీ రొటీన్​లో భాగమయ్యాయి. కాబట్టి ఫోన్​ తప్పనిసరి అయినప్పుడు వీలైనంత సురక్షితమైన పద్ధతిలో వాడుకోవాలని ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంటున్నారు. 

నెలల వయసున్న పిల్లలపై కూడా...​ 

ఆరు నెలల దాటిన పిల్లలకు సాధారణంగా తల్లిపాలతో పాటు సెమీ సాలిడ్​ ఫుడ్స్​ కూడా పెడుతుంటారు. కానీ.. చాలామంది పిల్లలు వాటిని సరిగా తినరు. ఏడాది వచ్చేసరికి ప్రతిదానికి ‘నో’ చెప్పడం. ఒక చోట కూర్చమంటే  కూర్చోకుండా ఇల్లంతా అల్లకల్లోలం చేస్తుంటారు. అయితే.. అది ఆ వయసులో నేచురల్​ బిహేవియర్‌‌‌‌. తల్లిదండ్రులు దాన్ని అర్థం చేసుకోకుండా వాళ్లను సైలెంట్‌‌గా ఉంచడానికి ఫోన్లు ఇస్తుంటారు. అయితే.. పిల్లలు మనం చెప్పినదానికంటే.. విజువల్​గా చూసిన విషయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందుకే ఫోన్లకు బాగా అలవాటు పడుతుంటారు. చివరికి ఫోన్​ చూపిస్తేనే తినే పరిస్థితికి వస్తారు. 

13 నుంచి 19 ఏండ్ల పిల్లల మీద ఎక్కువ

స్మార్ట్‌‌ ఫోన్ల ఎఫెక్ట్‌‌ 13 నుంచి 19 ఏండ్లు ఉన్న పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది. కరోనా తర్వాత ఆన్​లైన్​ క్లాసుల పేరుతో పిల్లలకు ఎక్కువ టైం ఫోన్లు ఇస్తున్నారు. పైగా ఫోన్‌‌లో పిల్లలు ఏం చేస్తున్నారనే పట్టించుకోకపోవడం వల్ల పోర్న్‌‌, బెట్టింగ్​ లాంటి వ్యవసనాలకు బానిసలు అవుతున్నారు. కాబట్టి పేరెంట్స్ తప్పనిసరిగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. 

అదొక్కటే ఆనందాన్ని ఇవ్వదు

పిల్లలకు ఫోన్​ ఒక్కటే ఆనందాన్ని ఇవ్వదు. వాళ్లను సంతోషంగా ఉంచే విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు అవేంటో తెలుసుకుని పిల్లలకు ఇవ్వాలి. వాళ్లతో టైం స్పెండ్​ చేయాలి. వాళ్ల ఇష్టాయిష్టాలను తెలుసుకోవాలి. అప్పడప్పుడు పార్క్‌‌లకు తీసుకెళ్లాలి. ఫోన్​ స్క్రీన్​ టైం ఎంత ఉంది? ఫోన్​లో ఏం చూస్తున్నారు? అనేది గమనిస్తుండాలి. ఫోన్​ ఇచ్చే ఆనందం కన్నా ఎక్కువ ఆనందాన్ని ఇవ్వగలిగితే ఫోన్​ వంక చూడడానికి కూడా ఇష్టపడరు. పిల్లల ప్రవర్తనలో ఏమైనా మార్పులు వస్తున్నట్టు గమనిస్తే.. సైకియాట్రిస్ట్‌‌ని కలిసి సలహాలు తీసుకోవాలి. 

క్యాన్సర్‌‌ వస్తుందా?

చాలామంది నమ్మలేని నిజం ఇది. ఫోన్లు అతిగా వాడే పిల్లలకు బ్రెయిన్​ క్యాన్సర్​ వస్తుందని కొన్ని స్టడీలు చెప్తున్నాయి. వైర్‌‌లెస్, మొబైల్ డివైజ్‌‌ల ద్వారా వచ్చే రేడియో-ఫ్రీక్వెన్సీ దీనికి కారణం. అవి శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా పసిబిడ్డల నుంచి టీనేజర్లు వరకు అందరిపై ఈ ఎఫెక్ట్‌‌ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ చేసిన రీసెర్చ్‌‌లో మొబైల్ ఫోన్‌‌ ఎక్కువగా వాడడం గ్లియోమా, అకౌస్టిక్ న్యూరోమా వంటి మెదడు కణితులు ఏర్పడతాయని తేలింది. 

 *   *   *

చిన్నప్పుడు ఇస్తే.. 

పిల్లలకు చిన్న వయసులోనే స్మార్ట్‌‌ఫోన్లు ఇస్తే టీనేజ్​కి వచ్చే నాటికి మెదడుపై చాలా ఎఫెక్ట్ పడుతుందని చెప్తున్నారు. ఈ అంశంపై సెపియన్ ల్యాబ్స్ ‘ఏజ్ ఆఫ్ ఫస్ట్ స్మార్ట్‌‌ఫోన్ అండ్ మెంటల్ వెల్‌‌ బీయింగ్’ పేరుతో  ఒక స్టడీ చేసింది. ఈ స్టడీ దాదాపు ఇండియాతోపాటు 40కి పైగా దేశాల్లో చేశారు. ఇందులో14–18 ఏళ్ల మధ్య వయసున్న 27,969 మందిని చేర్చారు. వాళ్లలో 4,000 మంది టీనేజర్లు ఉన్నారు.  ఇండియా వాళ్లు కూడా ఉన్నారు. ఈ స్టడీ ప్రకారం...  అమ్మాయిలు ఎక్కువగా మానసిక ఒడిదుడుకులకు గురవుతున్నారు.​ ఆరేండ్ల వయసులో మొదటిసారిగా ఫోన్​ వాడామని చెప్పిన అమ్మాయిల్లో 74 శాతం మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాదు.. వీళ్లు మానసిక ఆరోగ్య ఎంసీక్యూ(మల్టిపుల్​ చాయిస్​ క్వశ్చన్స్​) పరీక్షల్లో చాలా తక్కువ స్కోర్ చేశారు. పదేండ్ల వయసులో స్మార్ట్‌‌ఫోన్ వాడడం మొదలుపెట్టిన అమ్మాయిల్లో 61 శాతం మందికి తక్కువ స్కోర్ వచ్చింది.15 ఏళ్ల వయసులో స్మార్ట్‌‌ఫోన్ చేతికి వచ్చిన వాళ్లకు ఇంచుమించు ఇదే స్కోర్​ వచ్చింది. అయితే 18 ఏళ్ల వయసులో స్మార్ట్‌‌ఫోన్ తీసుకున్న అమ్మాయిల్లో తక్కువ స్కోర్ సాధించినవాళ్లు 42 శాతం మంది మాత్రమే ఉన్నారు. 

అబ్బాయిల విషయానికి వస్తే ఆరేండ్ల వయసులో ఫోన్ వాడిన వాళ్లలో 42 శాతం మందికే మానసిక సమస్యలు వచ్చినట్టు స్టడీలో తేలింది. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లో యుక్త వయసు కాస్త త్వరగా మొదలవుతుంది. అందుకే వాళ్లలో ఎక్కువ మందికి స్కోర్ తక్కువగా ఉండొచ్చని ఎక్స్​పర్ట్స్‌‌ అంటున్నారు. అయితే.. చిన్న వయసులోనే స్మార్ట్‌‌ఫోన్లు చేతికి వచ్చిన వాళ్లలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు, విపరీతమైన కోపం, హ్యాలూసినేషన్ లాంటి సమస్యలు కూడా ఉన్నట్టు గుర్తించారు. 

కళ్లపై ఒత్తిడి

పిల్లలు స్క్రీన్‌‌లను వాడడం మొదలుపెట్టే సగటు వయసు గత దశాబ్దంలో 3–5 ఏండ్ల నుండి 12–18 నెలలకు పడిపోయింది. అందుకే దాదాపు 70 శాతం మంది భారతీయ తల్లిదండ్రులు పిల్లల కళ్లపై స్క్రీన్ టైమ్ ఎఫెక్ట్‌‌ గురించి ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా 2–3 ఏండ్ల వయసులో పిల్లల్లో రెటినా డెవలప్​ అవుతుంది. కానీ.. బ్రైట్​ లైట్​ ఉండే స్మార్ట్‌‌ ఫోన్ల లాంటివి వాడడం వల్ల పిల్లల చూపు మీద ఎఫెక్ట్‌‌ పడుతుంది. రెటీనాలోని ఒక భాగం దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల స్క్రీన్​ టైం తగ్గించేందుకు ప్రయత్నించాలి. 

సమస్య ఉన్న పిల్లల్లో కనిపించే లక్షణాలు 

  •     ఎప్పుడూ కళ్లు రుద్దడం.
  •     విపరీతమైన లైట్​ సెన్సిటివిటీ.
  •     దేనినైనా ఫోకస్​ చేసి చూడలేకపోవడం.
  •     పేలవమైన విజువల్​ ట్రాకింగ్. 
  •     కళ్లను ఎక్కువగా తిప్పడం (6 నెలల వయసు తర్వాత).
  •     కళ్లు ఎప్పుడూ ఎర్రగా ఉండడం, నీళ్లు కారడం. 
  •     కనుగుడ్డు నలుపు రంగులో కాకుండా కాస్త తెలుపు రంగులో ఉంటుంది.
  •     బడి వయసు​ పిల్లల్లో  దూరంగా ఉన్న వస్తువులను చూడలేకపోవడం.
  •     బ్లాక్‌‌ బోర్డ్‌‌పై రాసిన అక్షరాలు చదవడంలో సమస్య.
  •     పుస్తకం చదవడంలో ఇబ్బంది.
  •     టీవీ దూరం నుంచి చూస్తే సరిగా కనిపించదు. కాబట్టి టీవీకి దగ్గరగా కూర్చుంటారు

ఈ లక్షణాలు కనిపిస్తే.. తల్లిదండ్రులు బిడ్డకు కంటి చూపు సరిగా లేదని గమనించి, వెంటనే హాస్పిటల్​కు తీసుకెళ్లాలి. ముందుగా సమస్యను తెలుసుకుంటే.. పరిస్థితి చేయి దాటిపోకుండా కాపాడుకోవచ్చు. 

జాగ్రత్తలు 

ప్రత్యేకించి ఐదేండ్ల లోపు వాళ్ల స్క్రీన్​ టైం తక్కువగా ఉండాలి. మరీ అవసరం అనిపిస్తే తప్ప వాళ్లకు స్మార్ట్‌‌ ఫోన్​ ఇవ్వద్దు. ఏదైనా కంటి వ్యాధిని గుర్తిస్తే.. అది పెరగకముందే ట్రీట్​మెంట్​ చేయించాలి. స్క్రీన్​ను  కళ్లకు కాస్త దూరంగా ఉంచాలి.  స్క్రీన్​ చూసేటప్పుడు మధ్యమధ్యలో కంటికి వ్యాయామం అవసరం. పాఠశాలకు వెళ్లే పిల్లలు ప్రతిరోజూ తక్కులో తక్కువ గంట సేపు స్క్రీన్ చూస్తున్నారు. సెలవుల్లో రెండు గంటల వరకు చూస్తున్నారు. మన దేశంలో ప్రతి 1000 మంది పిల్లల్లో 0.8 మంది అంధులు ఉన్నట్లు అంచనా. 

 *   *   *

పిల్లలు స్మార్ట్​ఫోన్​కు అలవాటు కాకుండా ఉండాలంటే వాళ్లకి కొన్ని స్మార్ట్​ అలవాట్లు చేయాలి.

పుస్తకాలు

చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం అలవాటు చేయాలి. పిల్లలు ఒక విషయాన్ని తెలుసుకుంటే.. దాన్ని ఊహించుకుంటారు. అలా ఊహించుకోవడం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది. కానీ.. స్మార్ట్‌‌ఫోన్ వల్ల ఆ క్రియేటివిటీ తగ్గిపోతుంది. అదే పుస్తకాలు చదివితే ఆలోచనాశక్తి, క్రియేటివిటీ పెరుగుతాయి. ఒక రాజు గురించి కథ చదివారు అనుకోండి ఆ రాజు ఎలా ఉంటాడో ఊహించుకుంటారు. అందుకే ప్రతి ఒక్కరూ పిల్లలకు పుస్తకాలు చదవడం అలవాటు చేయాలి. ముందు చిన్న బొమ్మల కథల పుస్తకాలు ఇచ్చి ఎంకరేజ్​ చేయాలి. నెలకు ఒక పుస్తకమైనా చదవడం వల్ల స్క్రీన్​ టైం తగ్గుతుంది అంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌.

స్మార్ట్‌‌ ఫోన్​కు దూరంగా.. 

చాలా విషయాలు చూసే నేర్చుకుంటారు పిల్లలు. స్మార్ట్‌‌ఫోన్​ వాడకం కూడా తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా పిల్లలతో ఉన్నప్పుడు తల్లిదండ్రులు స్మార్ట్‌‌ఫోన్​ వీలైనంత తక్కువ వాడాలి. కొందరు అవసరం ఉన్నా.. లేకున్నా ఎప్పుడూ ఫోన్​ పట్టుకునే ఉంటారు. దాంతో పిల్లలు కూడా ఫోన్​ చూడడం నేర్చుకుంటారు. కొందరు డైనింగ్​ టేబుల్ దగ్గర  కూర్చున్నప్పుడు కూడా ఫోన్​ వదలరు. అలాంటి వాళ్లను చూసి ఇంట్లో పిల్లలు కూడా నేర్చుకుంటారు. కాబట్టి కొన్ని రూల్స్‌‌ పెట్టుకోవాలి. ఎప్పుడు ఫోన్​ వాడాలి? ఎప్పుడు వాడకూడదు? పిల్లలతో  టైం ఎప్పుడు టైం స్పెండ్​ చేయాలనేది స్ట్రిక్ట్​గా ఫాలో కావాలి. 

స్క్రీన్ టైం బౌండరీస్

కొందరు పిల్లలు స్మార్ట్ ఫోన్​ ఇవ్వకపోయినా డిప్రెషన్​లోకి వెళ్తారు. కాబట్టి అలాంటివాళ్లకు రోజూ కాసేపు ఇవ్వాలి. కానీ.. వాళ్లు ఫోన్​తో ఏం చేస్తున్నారనేది ఎప్పటికప్పుడు మానిటర్​ చేస్తుండాలి. పిల్లలు టీవీ, కంప్యూటర్లు, మొబైల్ లాంటి స్క్రీన్ల ముందు ప్రతిరోజూ రెండు గంటల కంటే ఎక్కువ సేపు గడపకూడదని చాలామంది ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెప్తున్నారు. కాబట్టి పిల్లల్ని ఎక్కువ సేపు స్క్రీన్ల ముందు కూర్చోనీయొద్దు. పిల్లలకు గాడ్జెట్స్‌‌ ఇచ్చే ముందే టైం పిరియడ్​ చెప్పి, ఆ టైం అయిపోతే వెనక్కి తీసుకుంటామని చెప్పాలి. వీకెండ్స్‌‌లో కూడా హోమ్​ వర్క్​ పూర్తి చేస్తేనే ఫోన్​ ఇస్తాననేటువంటి కండిషన్లు పెట్టాలి. అలా అయితేనే పిల్లల స్మార్ట్‌‌ఫోన్​ వాడకం తగ్గుతుంది.

యాక్టివిటీస్​ పెంచాలి

పిల్లల్లో ఫోన్ వ్యసనాన్ని అరికట్టడంలో సాయపడే ఉత్తమమైన మార్గం యాక్టివిటీస్​లో పాల్గొనేలా చేయడం. అంటే బయట పిల్లలతో ఆడుకోనివ్వాలి. స్పోర్ట్స్ టీమ్​లో చేర్పించడం లాంటివి చేయాలి. అంతేకాదు.. వాళ్ల ఆలోచనలను ఇతర యాక్టివిటీస్​ మీదకు మళ్లించడం వల్ల స్క్రీన్‌‌కు దూరమవుతారు. ఇంటి పనుల్లో పిల్లలు పాల్గొనేలా చేసినా ఫోన్​కు దూరంగా ఉంటారు.

వివరించి చెప్పాలి

ఫోన్​ కావాలని మారాం చేయగానే ఇచ్చేయొద్దు. ముందుగా ఫోన్​ వల్ల కలిగే ఇబ్బందుల గురించి వాళ్లకు స్పష్టంగా వివరించాలి.  వాళ్ల ఫోకస్​ను ఫోన్​ నుంచి తప్పించే ప్రయత్నం చేయాలి. లేదంటే.. ఒక గంట చదువుకుంటే.. 10 నిమిషాలు ఫోన్​ ఇస్తాననే కండీషన్లు పెట్టాలి. ఫోన్‌‌కు అడిక్ట్​ అయితే నిద్రలేమి, సామాజిక సంబంధాల మీద ఫోన్​ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పాలి. 

రాత్రిపూట ఫోన్ ఇవ్వద్దు 

ఉదయంతో పోలిస్తే.. రాత్రి పూట ఫోన్​ ఎఫెక్ట్‌‌ ఎక్కువ. అందుకే రాత్రి పూట ఫోన్​ ఇవ్వద్దు. ఒక వేళ ఇచ్చినా వెంటనే తీసేసుకోవాలి. అలా చేయడం వల్ల నిద్రపోయే టైం పెరుగుతుంది. ఎందుకంటే.. పడుకునే ముందు ఫోన్​ చేతిలో పెడితే ఛార్జింగ్​ అయిపోయేదాక నిద్రపోరు. 

బోర్​ అనిపించినప్పుడు

పిల్లలు ఎక్కువగా ‘‘నాకు బోర్​ కొడుతుంది నాన్నా. కాసేపు ఫోన్​ ఇవ్వు. గేమ్స్​ ఆడుకుంటా”అని అడుగుతుంటారు. అలాంటప్పుడు ఫోన్​కి బదులు ఇంకేమైనా చేయొచ్చా? అని ఆలోచించండి. ఇదివరకు రోజూ రాత్రి పెద్దవాళ్లు కథలు చెప్తే పిల్లలు ‘ఊ...’ కొడుతూ నిద్రలోకి జారేవాళ్లు. అందుకే ప్రతి రోజూ ఏదో ఒక కథ చెప్పడానికి ట్రై చేయాలి.  కథ చెప్పినంత సేపు విని, తర్వాత దాని గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఫోన్​ అవసరం రాదు. 

ఆటలు ఆడనివ్వాలి

కొన్నాళ్ల క్రితం ఓ వీడియో బాగా వైరల్‌‌ అయ్యింది. అందులో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్​ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు లావుగా ఉన్న ఒక అబ్బాయిని చూసి.. ‘గేమ్స్​ ఆడడం లేదా?’ అని అడిగాడు. అందుకు ఆ పిల్లోడు ‘‘మా ఇంట్లో ఫోన్​ ఇవ్వడంలేదు సార్” అంటాడు. వాస్తవానికి చాలామంది పిల్లల పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. ఆటలంటే.. ఫోన్​లో ఆడుకునేవే అనుకుంటున్నారు. బయటికెళ్లి క్రికెట్​, కబడ్డీ లాంటివి ఆడడం చాలామంది మర్చిపోయారు. తల్లిదండ్రులు వాళ్ల పిల్లలు తోటి పిల్లలతో ఆడితే చెడిపోతున్నాడని, దెబ్బలు తగిలించుకుంటారని బయటికి వెళ్లనివ్వరు. ఇలాంటి పిల్లలే ఎక్కువగా ఫోన్లకు అడిక్ట్‌‌ అవుతారు. కాబట్టి భయాలన్ని పక్కనపెట్టి పిల్లల్ని బయటికి వెళ్లనివ్వాలి. ఫ్రెండ్స్​తో ఆడుకోనివ్వాలి. కానీ.. ఎలాంటి వాళ్లతో స్నేహం చేస్తున్నారనేది గమనిస్తూ ఉండాలి. బయటికి పంపడానికి వీలు కాకపోతే కనీసం ఇంట్లో అయినా.. ఇండోర్ గేమ్స్‌‌ ఆడుకునే అవకాశం కల్పించాలి. లేదంటే.. ఫోన్​ అడిక్షన్​తో పాటు మానసిక, శారీరక సమస్యలు కూడా వస్తాయి. 

ఫోన్​తో ఏం చేయొచ్చు

పిల్లలకు ఫోన్​ ఇచ్చేటప్పుడు వాళ్లు ఏం చూడాలి? ఫోన్​తో ఏం చేయాలి? అనేది తల్లిదండ్రులే సెట్​ చేయాలి. ఇప్పుడు వచ్చే చాలా ఫోన్లలో ‘‘కిడ్స్​ స్పేస్​” లాంటి ఆప్షన్స్ డిఫాల్ట్‌‌గానే వస్తున్నాయి. లేదంటే.. కొన్ని యాప్స్ వాడి సెట్​ చేసుకోవచ్చు. యూట్యూబ్​ కూడా ఇలాంటి ఆప్షన్‌‌ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆప్షన్‌‌ని ఎనేబుల్​ చేస్తే కేవలం పిల్లలు చూడదగిన కంటెంట్​ మాత్రమే కనిపిస్తుంది. ఇంకా యాప్స్‌‌ వాడి.. ఏ యాప్​ ఎంత టైం పనిచేయాలనే టైమ్‌‌ కూడా సెట్‌‌ చేయొచ్చు. ఇలాంటివి వాడి పిల్లలకు ఫోన్స్​ దూరం చేయాలి. 

ఓపిక పట్టాలి

పిల్లలు ఫోన్లకు బానిసలుగా మారితే.. తల్లిదండ్రులకు కాస్త కష్టంగానే ఉంటుంది.  అలాగని వాళ్లను కొట్టడం, తిట్టడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే.. పిల్లలు కఠినంగా మారే ప్రమాదం ఉంది. లేదా పిల్లలు మరీ సెన్సిటివ్​ అయితే.. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి వాళ్లు బుజ్జగిస్తూనే చెప్పాలి. నెమ్మదిగా ఫోన్​ అడిక్షన్​ను దూరం చేయాలి.
 
ఇదివరకు పిల్లలు అన్నం తినమని మారాం చేస్తే.. ‘‘చందమామ రావే... జాబిల్లి రావే.. కొండెక్కి రావే.. గోగు పూలు తేవే” అంటూ పాటలు పాడుతూ.. బుజ్జగిస్తూ తినిపించేవాళ్లు. కానీ.. ఇప్పుడు పిల్లలు ‘నాకు అన్నం వద్దు..’ అనగానే ఫోన్​ తీస్కో అంటున్నారు. ఇన్‌‌స్టాగ్రామ్​ రీల్స్, యూట్యూబ్​లో షార్ట్స్‌‌ చూపిస్తూ.. అన్నం తినిపిస్తున్నారు.
అదే ‘నేను పడుకోన’ని మారాం చేస్తే... మొబైల్​ఫోన్​లో పిల్లల పాటలు పెట్టి నిద్ర పుచ్చుతున్నారు. అందుకే పసి వయసులోనే పిల్లల కళ్లు మసకబారుతున్నాయి. ఊహ తెలిసేనాటికే మానసిక రోగాల బారిన పడుతున్నారు.కొందరు పిల్లలైతే ‘ఫోన్​ ఉంటే చాలు... ఇంకేం వద్దు’ అనే స్థితికి చేరుకున్నారు. ఇదిలానే కొనసాగితే.. వాళ్ల భవిష్యత్తు డేంజర్​లో పడే అవకాశం ఉంది? ఆ పరిస్థితి నుంచి పిల్లల్ని కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి?

భావోద్వేగాలపై ఎఫెక్ట్‌‌

పెద్ద వాళ్లతో పోలిస్తే.. చిన్న పిల్లలకు ఎక్కువ భావోద్వేగాలు ఉంటాయి. అందుకే స్మార్ట్‌‌ ఫోన్ల ఎఫెక్ట్‌‌ వాళ్లపై ఎక్కువగా ఉంటుంది. అందులో ఆడే గేమ్స్​లో ఓడిపోతే.. ఏదో కోల్పోయినట్టు ఫీలవుతారు. ఆ విషయాన్ని బయటికి చెప్పడానికి కూడా ఇష్టపడరు. అదే బయట పిల్లలతో ఆడుకున్నప్పుడు.. ఓడిపోయినా, గెలిచినా చుట్టు పక్కల వాళ్లు, తల్లిదండ్రులు ఓదార్చడం, మెచ్చుకోవడం చేస్తుంటారు. దాని వల్ల పిల్లల్లో మనోధైర్యం పెరుగుతుంది. ఓర్పు పెరుగుతుంది. కానీ.. ఆన్​లైన్​ గేమ్స్‌‌ విషయంలో అలాకాదు. వాళ్లు ఓడిపోయినట్టు ఎవరికీ తెలియదు. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేరు. కాబట్టి లోలోపల బాధపడుతుంటారు. సడెన్​గా ఫ్రస్టేట్ అవుతుంటారు. ఫోన్లు పగులగొడతారు. గేమ్స్‌‌లో బాగా ఇన్వాల్వ్ అయ్యే పిల్లలు వాళ్ల మనసును కంట్రోల్ చేసుకోలేకపోతారు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. స్కూల్‌‌కి వెళ్లినా.. అక్కడ టీచర్లు చెప్పింది పట్టించుకోరు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు ఉంటారు. 

– డాక్టర్​ హరీష్ పిన్నోజు, కన్సల్టెంట్‌‌ సైకియాట్రిస్ట్‌‌, వనస్థలిపురం, హైదరాబాద్​

అయస్కాంతంలా..

మెదడుకు రోజూ కొన్ని వేల సిగ్నల్స్‌‌ వెళ్తుంటాయి. స్మార్ట్‌‌ఫోన్ వాడుతున్నప్పుడు వీడియోతోపాటు ఆడియో సిగ్నల్స్‌‌ కూడా మెదడుకు చేరుతాయి. అవి మెదడుని ఆకర్షిస్తాయి. దాంతో ఫోన్​ ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది. అది ఎక్కడున్నా మెదడు దాని గురించి ఆలోచిస్తుంటుంది. అలాంటప్పుడు అతిగా ఫోన్‌‌ వాడే పిల్లల మెదడులో కొన్ని రకాల మార్పులు జరుగుతాయి. పిల్లల మెదడు అభివృద్ధి చెందుతున్న దశలో మంచి, చెడులను గ్రహించడం వాళ్లకు అంతగా తెలియదు. మరో విషయం ఏంటంటే.. వాళ్లకు ఏదైనా వీడియో నచ్చితే వాళ్ల మొదడులో డోపమైన్‌‌ అనే కెమికల్​ విడుదల అవుతుంది. దాంతో సంతోషం పెరుగుతుంది. ఆ సంతోషం మళ్లీ మళ్లీ కావాలనే ఉద్దేశంతో స్మార్ట్‌‌ఫోన్లకు అడిక్ట్‌‌ అవుతున్నారు.

టీనేజర్లు జాగ్రత్త

కొందరు పిల్లలు, పెద్దలకు సెల్ ఫోన్ జేబులో లేనప్పుడు కూడా ఫోన్​ వైబ్రేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఈ పరిస్థితిని ‘ఫాంటమ్ పాకెట్ వైబ్రేషన్ సిండ్రోమ్’ అంటారు. డాక్టర్ మిచెల్ డ్రౌయిన్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం... 89శాతం మంది టీనేజర్లు ఈ రకంగా ఫీల్​ అయ్యారు. ముఖ్యంగా సోషల్ మీడియా అడిక్షన్​ ఉన్న టీనేజర్లలో ఈ సిండ్రోమ్​ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఎక్కువగా టెక్స్ట్‌‌ మెసేజ్​లు చేసేవాళ్లలో ఉంటుంది. ఎందుకంటే.. అవతలి వాళ్లు పంపే  టెక్స్ట్‌‌ మెసేజ్​ని మిస్​ అవుతామేమో అనే ఆందోళన వల్ల అలా చెక్​ చేసుకుంటుంటారు. దీన్నుంచి బయటపడాలంటే.. మొబైల్ ఫోన్‌‌ వాడకాన్ని తగ్గించాలి. లేదంటే.. ఫోన్ వైబ్రేషన్‌‌ ఆపివేయాలి. 

92 శాతం

ప్రపంచ జనాభాలో 92శాతం మంది ప్రస్తుతం మొబైల్స్‌‌ వాడుతున్నారని ఒక సర్వేలో తేలింది. వాళ్లలో 31శాతం మంది వాళ్ల ఫోన్లను ఎప్పుడూ ఆఫ్ చేయరు. 90శాతం కంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సెల్ ఫోన్స్​ ఇస్తున్నారు. 

చైనాలో కొత్త రూల్స్‌‌

స్మార్ట్​ఫోన్ వాడడం వల్ల టీనేజర్లు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారనే ఉద్దేశంతో చైనా కొన్ని రూల్స్​ తీసుకొచ్చేందుకు ప్లాన్​ చేస్తోంది. ముఖ్యంగా యువతలో స్మార్ట్‌‌ఫోన్ వినియోగాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటోంది. కొత్తగా తీసుకొస్తున్న రూల్స్‌‌ ప్రకారం.. మూడేండ్లు.. అంతకంటే తక్కువ వయసున్న పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో నర్సరీ రైమ్స్‌‌ మాత్రమే చూడొచ్చు. మిగతా ఏ యాప్స్​ పనిచేయవు. యూత్​కు లైఫ్​ స్కిల్స్‌‌, నాలెడ్జ్‌‌ పెంచే వీడియోలు, ఇన్ఫర్మేషన్​ ఉండే కంటెంట్‌‌ చూసేందుకు మాత్రమే యాక్సెస్​ ఉంటుంది. ఇక16 నుంచి18 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్లు ప్రతిరోజూ రెండు గంటలు మాత్రమే స్మార్ట్‌‌ఫోన్ వాడాలి.16 ఏళ్లలోపు వాళ్లకు ఒక గంట, ఎనిమిదేండ్ల పిల్లలకు ఎనిమిది నిమిషాలు మాత్రమే ఇంటర్నెట్‌‌ యాక్సెస్​ ఇస్తారట.

::: కరుణాకర్ మానెగాళ్ల