
వర్షా కాలం వచ్చిందంటే మష్రూమ్ ప్రియులకు పండుగే. కొందరికి మష్రూమ్స్ అంటే ఇష్టం ఉంటుంది. కానీ వాటితో వెరైటీ వంటలు చేయటం రాదు. అలాంటి వాళ్ల కోసమే మష్రూమ్స్ తో కొన్ని వెరైటీస్ . మరి మనసుకు నచ్చింది వండుకు తినాలి కదా!
మష్రూమ్ చిల్లీ ఫ్రై
కావాల్సినవి
మష్రూమ్స్: 250 గ్రాములు
ఉల్లిగడ్డ : 1పెద్దది
పచ్చిమిర్చి : 3
జీలకర్ర పొడి : పావు టీ స్పూన్
పసుపు : పావు టీస్పూన్
మిరియాల పొడి : పావు టీస్పూన్
కారం: పావు టీ స్పూన్
గరం మసాలా: చిటికెడు
నూనె : 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర : 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు : తగినంత
తయారు చేసే విధానం:
ఒక గిన్నెలో మష్రూమ్స్ వేసి శుభ్రం చేయాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిలను పొడవు ముక్కలుగా కట్ చేయాలి. పొయ్యి మీద కడాయి పెట్టి నూనె పోయాలి. వేడయ్యాక ఉల్లిగడ్డ వేసి వేగించాలి. ఉల్లిగడ్డ మరీ డీప్ గా ఫ్రై చేయకూడదు. అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసి అర నిముషం పాటు వేగించాలి. శుభ్రం చేసుకున్న మష్రూమ్స్. తగినంత ఉప్పు వేసి వేగించాలి. మష్రూమ్స్ లో నీరంతా పోయే వరకు వేగించాలి. అందులో జీలకర్రపొడి, గరం మసాలా, కారం, పసుపు, మిరియాలపొడి వేసి కలపాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించాలి. పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే రెడీ అయినట్లే. ఇవి అలాగే తినేయొచ్చు లేదా చపాతి రోల్స్ లో పెట్టుకుని కూడా లాగించేయొచ్చు.
మాన్సూన్ మష్రూమ్స్
కావాల్సినవి
బాస్మతి బియ్యం: 1 కప్పు
నెయ్యి: 1 టీస్పూన్
పుట్టగొడుగులు (మష్రూమ్స్) : 250గ్రాములు
పుదీనా : 1/4 కప్పు
కొత్తిమీర : పావు కప్పు
పచ్చిమిర్చి : 4
అల్లం:కొద్దిగా
పెరుగు: 3టేబుల్ స్పూన్లు
పసుపు : అర టీస్పూన్
కారం : అర టీస్పూన్
గరంమసాల : అర టీస్పూన్
ధనియాల పొడి: ఒక టీ స్పూన్
నూనె : 2 టేబుల్ స్పూన్లు
దాల్చినచెక్క : చిన్న ముక్క
యాలకులు: 4
లవంగాలు : 5
మిరియాలు: 8
బిర్యానీ ఆకు : 2
మరాఠి మొగ్గ : 1
జాజిపువ్వు, జాపత్రి: 1
షాజీరా : కొద్దిగా
చిక్కటి కొబ్బరిపాలు : 1కప్పు
ఉప్పు : తగినంత
టొమాటో తరుగు: అరకప్పు
ఉల్లిగడ్డ తరుగు : అర కప్పు
తయారీ విధానం:
బాస్మతి బియ్యాన్ని శుభ్రం చేసి 30 నిముషాలు నానబెట్టాలి. తరువాత బియ్యంలో నీళ్లు మొత్తం ఒంపేసి ఒక స్పూన్ నెయ్యి బియ్యానికి పట్టించి మరో 25 నిమిషాలు నానబెట్టాలి. పుట్టగొడుగులను శుభ్రం చేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేయాలి. ఒక మిక్సీ జారు తీసుకొని అందులో పావు కప్పు పుదీన, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
ఒక గిన్నె తీసుకొని అందులో పుట్టగొడుగు ముక్కలు, మిక్సీ చేసిన గ్రీన్ చట్నీ, పెరుగు, ధనియాలపొడి, పసుపు, కారం, గరం మసాలా వేసి బాగా కలిపి 40 నిమిషాలు నానబెట్టాలి. పొయ్యి మీద బిర్యానీ తయారు చేసే కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. వేడయ్యాక దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, మిరియాలు, షాజీరా, జాజిపువ్వు, జాపత్రి వేయాలి.
ALSO READ : Good Food : కాకర కాయ అని లైట్ తీసుకోవద్దు.. వానాకాలం ఎక్కువగా తింటే మస్త్ ఆరోగ్యం
తర్వాత ఉల్లిగడ్డలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. అవి వేగాక టొమాటో ముక్కలు వేసి ఉడికించాలి. తరువాత ముందుగా కలిపి ఉంచిన పుట్టగొడుగులను వేయాలి. అవి వేగాక బియ్యం ఉడికేందుకు సరిపడానీళ్లు పోయాలి. అవి మరిగాక, కొబ్బరి పాలు పోసి మరిగించాలి. తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత నానబెట్టిన బియ్యాన్ని వేసి ఉడికించాలి. చివరిగా కొత్తిమీరచల్లి తినేయాలి.