విశ్లేషణ: ఇండియాతో చైనా సరిహద్దు వివాదాలెందుకు?

విశ్లేషణ: ఇండియాతో చైనా సరిహద్దు వివాదాలెందుకు?

ప్రపంచ దేశాల మధ్య ఆధిపత్య పోరు అనేది ఈనాటిది కాదు. ఎన్నో ఏండ్ల సంది జరుగుతూనే ఉంది. కానీ గత రెండేండ్లుగా చైనా చేసే దుశ్ఛర్యలు ప్రపంచ దేశాలకు తీరని నష్టాన్ని కలిగించాయి. అది సరిహద్దు ప్రాంతమైన ఇండియాకి మరింత కంటకంగా మారింది. భారత్‌‌ భూభాగాలను ఆక్రమించేందుకు చైనా చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఓ పక్క సంధి ప్రయత్నాలు అంటూనే దేశ సైనికులపై దుశ్ఛర్యలకు పాల్పడింది. లడఖ్​ నుంచి అరుణాచల్‌‌ ప్రదేశ్​ వరకూ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచుతూనే వస్తోంది. ముఖ్యంగా జీ జిన్‌‌పింగ్‌‌ అధికారంలోకి వచ్చాక తన లైఫ్​ టర్మ్‌‌ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అతని ఆలోచన ధోరణి మరింత వికృతంగా పెరిగింది. ఒక్క ఇండియాతోనే కాదు ప్రపంచ దేశాలతో కూడా ఆయనలో ఎక్కడా స్నేహ భావం కనిపించడం లేదు. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ చైనాపై నిఘా మరింత కట్టుదిట్టం చేస్తూ జిన్‌‌పింగ్‌‌ చర్యలను అదుపు చేయాల్సి ఉంది. 
 
లడఖ్​ నుంచి అరుణాచల్​ ప్రదేశ్​ వరకు ఇండియా -చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల భూటాన్, చైనా మధ్య డోక్లాం ప్రాంతంపై కుదిరిన ‘‘మూడు దశల ఒప్పందం’’, ఇండియన్​ ఆర్మీపై దాడులు జరగడం మొదలైన విషయాలు మనకు ఆందోళన కలిగించేవే. ఈ పరిణామాలు వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న చైనా కదలికలను స్పష్టం చేస్తున్నాయి. మనదేశ సరిహద్దుల్లో, తైవాన్, దక్షిణ చైనా సముద్రం సహా ఇతర ప్రాంతాల్లో చైనా దూకుడు కదలికలను అర్థం చేసుకోవడానికి, ఆధునిక చైనా విదేశీ, సైనిక విధానాల్లో వివిధ దశలను పరిశీలించాలి.

అన్నింట్లో పీఎల్ఏదే కీలకపాత్ర
తుపాకీ గొట్టం ద్వారా విప్లవం సాధించిన చైనా వంటి కమ్యూనిస్ట్ దేశంలో, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మావో పాలనలో అధికార, రాజకీయ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక నిర్ణయాల్లో కీలకపాత్ర పోషించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డెంగ్ జియావోపింగ్ ఆర్థిక సంస్కరణ చర్యల్లో సైనిక ప్రభావాన్ని, సైద్ధాంతిక అడ్డంకులను తగ్గించారు. యూఎస్ఎస్ఆర్ పతనం, తైవాన్​లో పెరుగుతున్న స్వాతంత్ర్య ఉద్యమం, వియత్నాం, జపాన్, ఫిలిప్పీన్స్​తో సముద్ర వైరుధ్యం 1990ల్లో చైనాలో కొన్ని సైనిక సంస్కరణలను అమలు చేయడానికి జియాంగ్ జెమిన్​కు తప్పనిసరైంది. మావో, డెంగ్ లు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతులుగా సైన్యంపై పూర్తి ఆధిపత్యం చలాయించేవారు. జియాంగ్ జెమిన్ కు సైన్యంలో పని చేసిన అనుభవం లేదు. సైన్యాన్ని నియంత్రించడానికి, సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ గా దాని కదలికలపై దృష్టి పెట్టడానికి, పీఎల్ఏను దేశీయ, రాజకీయ, సైనిక, విదేశీ వ్యవహారాల నిర్ణయ ప్రక్రియలో భాగస్వామ్యం చేశాడు. చైనాలో బీజం వేసుకుంటున్న ప్రజాస్వామ్య ఆకాంక్షలు, తైవాన్ లో చోటుచేసుకుంటున్న స్వాతంత్ర్య ఉద్యమాలు, ఆగ్నేయాసియా దేశాలతో ప్రాదేశిక జలాలపై ఏర్పడుతున్న ఘర్షణలు మొదలగు సమస్యలను చైనా జాతీయవాద దృక్పధంతో చూడటం ద్వారా, రాజకీయ సైనిక సమ్మిళిత విధానాలతో సమర్థవంతంగా ఎదుర్కోగలమనే ఆలోచన సైనిక వర్గాల్లో కలిగించాడు. యూఎస్ఎస్ఆర్ పతనం తర్వాత, చైనా సూపర్ పవర్ కావాలన్న ఆకాంక్షలతో కమ్యూనిస్ట్ భావజాలానికి రక్షకురాలిగా, సామ్రాజ్యవాద వ్యతిరేకిగా తనను తాను చూడటం ప్రారంభించింది.

మొదట్లో అంతర్జాతీయ వివాదాలకు దూరం
1990 నుంచి 2000 మధ్యకాలం వరకు చైనా విదేశాంగ విధానం సార్వభౌమాధికారం, జాతీయ స్వాతంత్ర్యం, ఆర్థిక సంస్కరణలు, ఆధునీకరణకు అనుకూలమైన అంతర్జాతీయ వాతావరణాన్ని సృష్టించడం వంటి లక్ష్యాలతో నడిచింది. అంతర్జాతీయ సంఘర్షణల్లో ఒక స్టాండ్ తీసుకోకుండా ఉండటానికి చైనా ప్రయత్నించింది. అంతర్జాతీయ వ్యవస్థలోని శక్తివంతమైన అమెరికా, పశ్చిమ దేశాల పట్ల రక్షణాత్మక వైఖరిని అవలంబించింది. అప్పటి చైనా ప్రధాని లీ పెంగ్ 96వ ఇంటర్-పార్లమెంటరీ కాన్ఫరెన్స్​లో చేసిన ప్రసంగం అప్పటి ఆ దేశ విదేశాంగ విధాన ఎజెండాను ముందుకు తెచ్చింది. దీని ప్రకారం ఆయుధాల పోటీ, సైనిక విస్తరణ, ఆధిపత్య రాజకీయాలు, దురాక్రమణ, ఇతర దేశాల భూభాగాల్లోకి చొరపడటం లాంటి పనులకు చైనా పాల్పడదు.

అంతర్జాతీయంగా చురుకైన పాత్ర 
2005–-06 తర్వాత ప్రెసిడెంట్ వెన్ జియాబావో కాలం నుంచి ఈ లక్ష్యాల్లో సవరణలు మొదలయ్యాయి. ఆయన అనేక విదేశీ పర్యటనలు చేయడం ద్వారా కొత్త ఒరవడిని, ప్రపంచ వ్యవహారాల్లో చైనా దృక్పధాన్ని మార్చడం ప్రారంభించాడు. అలాగే షైగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, చైనా- – ఆసియాన్ స్మారక సదస్సు, చైనా-–ఆఫ్రికా కోఆపరేషన్​ ఫోరం లాంటి అనేక అంతర్జాతీయ సదస్సులను నిర్వహించడం ద్వారా చుట్టుపక్కల దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకుని విదేశీ వ్యవహారాల్లో మారుతున్న చైనా దృక్పథాన్ని స్పష్టం చేశారు. ఈ సదస్సులు అంతర్జాతీయ సమస్యల్లో చురుకైన పాత్ర పోషించాలనే కోరికను వ్యక్తం చేయడానికి చైనాకు సహాయపడ్డాయి. అదే సమయంలో ఆర్థిక మాంద్యం వల్ల పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనం అవడం, చైనా వృద్ధిరేటు మాత్రం పురోగమనంలో ఉండటం అంతర్జాతీయంగా ఆ దేశ ప్రతిష్టను, విశ్వాసాన్ని పెంచింది. ఇలాంటి పరిస్థితుల్లో 1989 నుంచి 2012 వరకు చైనా రక్షణ బడ్జెట్ సగటున సంవత్సరానికి 15 శాతం పెరిగింది. మరోవైపు జీ జిన్‌‌‌‌పింగ్ పాలనలో చైనా విదేశాంగ విధానం కూడా లో ప్రొఫైల్​ నుంచి 'గో గ్లోబల్' వ్యూహంతో దృఢమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం లాంటి మార్పులను పొందింది. 2013లో జరిగిన చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ విదేశీ వ్యవహారాల సదస్సులో జీ జిన్‌‌‌‌పింగ్ ప్రసంగంలోనూ ఇదే ప్రతిబింబించింది. ఈ సందర్భంగా చైనా తన జాతీయ ప్రయోజనాల నిర్వచనంలో సార్వభౌమాధికారం, సమగ్రత, ఆర్థిక వృద్ధి, పరిశ్రమలకు ఆటంకం లేని ముడిసరుకుల సరఫరా, ఎనర్జీ సెక్యూరిటీ వంటి కొత్త అంశాలను చేర్చింది. వీటి రక్షణలో సైన్యం పాత్రను పెంచింది.

సోషలిస్ట్​ దేశం.. గ్లోబల్​ పవర్..
19వ చైనా కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కాంగ్రెస్(ఎన్సీసీపీసీ) 2049 నాటికి రెండు ముఖ్యమైన లక్ష్యాలను సాధించాలని నిర్దేశించుకుంది. ఒకటి ఆధునిక సోషలిస్ట్ దేశాన్ని స్థాపించడం, రెండు ప్రపంచ శక్తిగా మారడం. దీని అర్థం చైనా భద్రతా ప్రయోజనాలను పరిరక్షించే బలమైన సైన్యాన్ని అభివృద్ధి చేయడం, సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్టమైన, ఆధునిక సైన్యాన్ని నిర్మించడం, అంతర్జాతీయంగా వ్యూహాత్మకంగా ముఖ్యమైన స్థానాల్లో స్థావరాలను ఏర్పాటు చేయడం లాంటివి. అప్పటి నుంచి చైనా విదేశాంగ విధానం మారి రష్యా వంటి దేశాలతో వ్యూహాత్మక సంబంధాన్ని పెంచుకోవడం, పశ్చిమ దేశాల కేంద్రీకృతంగా ఉన్న ప్రపంచ వ్యవస్థలను తనకు అనుకూలంగా మార్చుకోవడం, స్థిరమైన ఆర్థిక వృద్ధి లాంటి పనులపై దృష్టి పెట్టింది. జీ జిన్​పింగ్ ఆరంభించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్(బీఆర్ఐ) లాంటి పాలసీలు చైనాను ప్రపంచ భౌగోళిక, రాజకీయ క్రీడలో కీలక పాత్రధారిగా చేశాయి. ఈ సందర్భంగా బీఆర్ఐకి పార్టీ, ప్రజలు, సైనిక  మద్దతు కావాలంటే చైనా జాతీయవాదాన్ని, జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగా చూపాలి. అందులో భాగంగానే ఇండియాతో సరిహద్దు సమస్యలు, దక్షిణ చైనా సముద్రంలో ప్రాదేశిక జలాల పరిరక్షణ, తైవాన్ పట్ల దూకుడు చర్యలకు పాల్పడుతోంది.

కనెక్టివిటీ ప్రాజెక్టులే ముఖ్యమైనవి
ఆర్థిక కారణాలతో పాటు, బీఆర్ఐ వంటి కనెక్టివిటీ ప్రాజెక్టులు చైనాకు వ్యూహాత్మకంగా ముఖ్యమైనవి. చైనాలో బాగా వెనుకబడిన జిన్జియాంగ్ ప్రావిన్స్​తో సహా చాలా ప్రాంతాలను అభివృద్ధి చేయడం, అలాగే 'మలక్కా డైలమా'సమస్యను పరిష్కరించడానికి ఇది చాలా కీలకమైనది. ప్రస్తుతం చైనా చమురు దిగుమతుల్లో 80 శాతం హిందూ మహాసముద్ర ప్రాంతంలోని మలక్కా జలసంధి గుండానే సాగుతోంది. ఇది చైనాకు వ్యూహాత్మకంగా బలహీనమైన ప్రాంతం. ఎందుకంటే మలక్కా జలసంధి దగ్గర సముద్ర జలాల్లో ఇండియా, అమెరికా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇవి జపాన్, ఆస్ట్రేలియా లాంటి ప్రాంతీయ శక్తులతో కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి.

చైనాలో మార్పులపై దృష్టి పెట్టాలె
1990 నుంచి చైనా తన సైన్యాన్ని పెంచుకోవడంతో పాటు ఆధునీకరిస్తున్నా.. 2013లో జీ జిన్​పింగ్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇండియాతో సరిహద్దుల్లో వివాదాలు పెరిగాయి. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను నిర్మించడం, ఆర్మీని మోహరించడం వంటి చర్యలు ఎక్కువయ్యాయి. జిన్​పింగ్​ తన రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి, మావో మాదిరిగా చైనా చరిత్రలో నిలిచిపోవడానికి, ప్రపంచ శక్తిగా చైనా ఆధిపత్యానికి రూపకర్తగా తన స్థానాన్ని నిరూపించుకోవడానికి ఇలాంటి వివాదాలను వాడుకోవాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చైనాలో రాజకీయంగా, విదేశాంగ విధానాల పరంగా వస్తున్న మార్పులను, వాటిలో పీఎల్ఏ ప్రభావం మొదలైన పరిణామాలను నిశితంగా గమనిస్తూ ఉండాలి. సమీప భవిష్యత్తులో ఎప్పుడైనా తైవాన్​తో చైనా ప్రాంతీయ యుద్ధాన్ని మొదలుపెడుతుంది. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. చైనాలో రాజకీయంగా, విదేశాంగ విధానాల పరంగా వస్తున్న మార్పులను అలాగే చైనా విధానాల్లో పీఎల్ఏ ప్రభావం మొదలైన పరిణామాలను ఇండియా నిశితంగా గమనిస్తూ ఉండాలి. అలాగే తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి జిన్​పింగ్​ చేస్తున్న ప్రయత్నాలను ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. అలాగే చైనాతో దీర్ఘ కాల సరిహద్దు వివాదాల పరిష్కారానికి సిద్ధంగా ఉండాలి.

- డా.గద్దె ఓంప్రసాద్, అసిస్టెంట్​ ప్రొఫెసర్, సెంట్రల్​ వర్సిటీ, సిక్కిం