ఆరోగ్యానికి ఆరోగ్యం.. పచ్చదనానికి పచ్చదనం..హెల్దీ మిద్దె తోట!

ఆరోగ్యానికి ఆరోగ్యం.. పచ్చదనానికి పచ్చదనం..హెల్దీ మిద్దె తోట!

కరోనా తర్వాత అందరికీ అరోగ్యం మీద అవగాహన పెరిగింది. అప్పటినుంచి ఎంతోమంది కెమికల్స్‌‌‌‌‌‌‌‌ లేని ఫుడ్‌‌‌‌‌‌‌‌ తినాలనే ఉద్దేశంతో మిద్దె తోటలను పెంచుకుంటున్నారు. పల్లెల్లో ఉండేవాళ్లైతే ఇంటి దగ్గర ఉండే ఖాళీ స్థలంలోనే కావాల్సిన కూరగాయలు, ఆకు కూరలు సాగు చేసుకుంటున్నారు. అయితే.. అలాంటివాళ్లు సరైన జాగ్రత్తలు పాటించకపోతే దంచి కొడుతున్న వానలు మొక్కల్ని దెబ్బతీస్తాయి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మొక్కలు ఏపుగా పెరగడమే కాకుండా వంటకు కావాల్సినన్ని కూరగాయల్ని కూడా ఇస్తాయి. 

వర్షాకాలం మొక్క పెరుగుదలకు ఎంత ఉపయోగపడుతుందో.. భారీ వర్షాలు కురిసినప్పుడు అంతే హాని కలిగిస్తుంది. కాబట్టి, బాగా వర్షాలు కురిసే జులై, ఆగస్టు, సెప్టెంబర్​ల్లో మొక్కల్ని కంటికిరెప్పలా కాపాడుకోవాలి. ముఖ్యంగా వానలను తట్టుకునే కూరగాయలు, ఆకుకూరల మొక్కల్నే నాటుకోవాలి. భూమి బాగా తడిగా ఉన్నా పాలకూర, తోటకూర, మెంతికూర, ముల్లంగి, దోస, బెండ, చిక్కుడు, బీర, అనప లాంటివి బాగా పండుతాయి. టొమోటోలు, క్యారెట్లు, ఆలుగడ్డ లాంటివి చాలా సున్నితమైనవి. కొన్ని రోజులు రోజూ వర్షం కురిస్తే దెబ్బతిని, కుళ్ళిపోతాయి. లేదంటే ఫంగల్‌‌‌‌‌‌‌‌ డిసీజ్‌‌‌‌‌‌‌‌లకు గురవుతాయి. ఒకవేళ ఇలాంటి మొక్కల్ని పెంచాలంటే నాణ్యమైన విత్తనాలు, మొలకలల్ని ఎంచుకోవాలి. వర్షాకాలంలో వచ్చే తెగుళ్లను తట్టుకునే ప్రత్యేకమైన రకాలను మాత్రమే నాటాలి. 

నీళ్లు నిలవకుండా 

మిద్దెమీద తోటలు పెంచేవాళ్లు సాధారణంగా గార్డెన్ బెడ్స్ వాడుతుంటారు. అయితే.. వానాకాలంలో వాటిని కాస్త ఎత్తులో పెట్టి, నీళ్లు నిలవకుండా చూసుకోవాలి. అంటే వాటి కింద ఇటుకలు, రాళ్లు లాంటివి పెట్టాలి. నేల రకం, వర్షపాత తీవ్రతను బట్టి బెడ్లను నేల మట్టానికి 15 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తులో ఉంచడం మంచిది. చెక్కతో చేసిన బెడ్లను వాడితే ఎక్కువైన నీళ్లు ఈజీగా బయటికి వెళ్లిపోతాయి. ఇంటి పెరట్లో పెంచేవాళ్లు నీళ్లు పారేందుకు కాల్వలు లోతుగా తవ్వుకోవాలి. నీళ్లు ఎక్కువైతే వేర్లు కుళ్లిపోతాయి. ఫంగల్ డిసీజ్‌‌‌‌‌‌‌‌లు సోకుతాయి. 

మల్చింగ్ 

వానాకాలంలో కూరగాయ మొక్కలను రక్షించుకోవడానికి మల్చింగ్ అత్యంత ప్రభావవంతమైన పద్ధతుల్లో ఒకటి. అంటే మొక్క చుట్టూ ఎండు గడ్డి, ఎండిన ఆకులు, చెక్కపొట్టు లాంటివాటితో మందపాటి పొరలా కప్పాలి. అది కవచంలా మారి.. మట్టిని తొలగించి లేత వేర్లను దెబ్బతీసే పెద్ద పెద్ద వాన చినుకుల నుంచి రక్షిస్తుంది. మొదట్లో కలుపు మొక్కలు ఎక్కువగా పెరగవు. నేల కోతకు గురికాకుండా కాపాడుతుంది. దీనివల్ల మరో బెనిఫిట్ ఏంటంటే.. వర్షాలు సరిగ్గా కురవనప్పుడు నేలను తేమగా ఉంచుతుంది. మల్చ్‌‌‌‌‌‌‌‌ పొరను ఐదు నుంచి ఏడు సెంటీమీటర్ల మందంతో వేసుకోవచ్చు. అది కుళ్ళిపోయినా సేంద్రియ ఎరువులా
మారి మొక్కలకు మేలు చేస్తుంది.

తెగుళ్లు, వ్యాధులు

వర్షాకాలంలో తడి, తేమ వల్ల మొక్కలను నాశనం చేసే అనేక తెగుళ్లు, వ్యాధులు పెరుగుతాయి. ముఖ్యంగా బూజు తెగులు, ఆకు ముడత లాంటివి విపరీతమవుతాయి. వాటి వ్యాప్తిని నత్తలు, పేనుబంక, గొంగళి పురుగులు లాంటివి వేగవంతం చేస్తాయి. కాబట్టి అప్రమత్తత చాలా ముఖ్యం. రోజూ ఆకుల రంగు మారడం, మచ్చలు ఏర్పడడం, వాడిపోవడం లాంటివి ఉంటే సేంద్రియ నివారణ పద్ధతులు పాటించాలి. 

రెయిన్ కవర్లు 

ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నప్పుడు మొక్కలను రెయిన్ కవర్లు లేదా షేడ్ నెట్లు కప్పి కాపాడుకోవాలి. ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పరెంట్‌‌‌‌‌‌‌‌ ప్లాస్టిక్ షీట్లు, గార్డెన్ క్లోచెస్, మినీ–గ్రీన్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ లాంటివి మొలకలని కుండపోత వర్షం నుంచి కాపాడతాయి. వీటిలో షేడ్ నెట్‌‌‌‌‌‌‌‌లు వాడడం మరీ మంచిది. ఇవి సూర్యరశ్మిని ఫిల్టర్ చేయడంతోపాటు వర్షం, గాలి తీవ్రతను తగ్గిస్తాయి. 

వ్యాధులు, తెగుళ్లు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే పరిశుభ్రత కూడా చాలా మఖ్యం. పనిముట్లను వాడిన ప్రతిసారి శుభ్రంగా కడగాలి. దానివల్ల ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాధులు సోకకుండా కాపాడుకోవచ్చు. గార్డెన్‌‌‌‌‌‌‌‌లో పేరుకుపోయే చెత్తను కూడా ఎప్పటికప్పుడు తొలగించాలి.

సపోర్ట్‌‌‌‌‌‌‌‌ అవసరం

వర్షాకాలంలో ఒక్కోసారి భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వస్తాయి. అవి మొక్కలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఒక్కోసారి వేళ్లతో సహా పెకిలిస్తాయి. కాబట్టి వాటికి సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా చిన్న చిన్న కర్రలు నాటాలి. టొమాటోలు, బీన్స్, దోసకాయలు లాంటి మొక్కల ఆకులను తడి నేలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే కుళ్ళిపోతాయి. మొక్కల్ని కర్రలకు కట్టేటప్పుడు కాండం దెబ్బతినకుండా జాగ్రత్తపడాలి. పాత బట్టలు, హార్టికల్చరల్‌‌‌‌‌‌‌‌ టేప్‌‌‌‌‌‌‌‌, లేదంటే మృదువైన పురికోసతో కట్టాలి. 

గాలి తగిలేలా.. 

వర్షాకాలంలో మొక్కల మధ్య దూరం కాస్త ఎక్కువగా ఉండేలా నాటుకోవాలి. ఏపుగా పెరిగేలోపే కలుపు మొక్కల్ని తీసేయాలి. మొక్కల మధ్య గాలి ఆడకపోతే.. ఆకుల మీద పడిన వర్షపు చినుకులు కిందపడకుండా అలాగే ఉండిపోతాయి. 

దాంతో వ్యాధులకు అనువైన వాతావరణం క్రియేట్‌‌‌‌‌‌‌‌ అవుతుంది. అందుకే ప్రతి మొక్కకు వెలుతురుతోపాటు సరిపడా గాలి తగిలేలా చూసుకోవాలి. స్వేచ్ఛగా పెరగడానికి తగినంత స్థలం ఉండాలి. వ్యాధిసోకిన, కింది భాగంలో నేలను తాకే ఆకులను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. దానివల్ల మొక్కకు నేల ద్వారా సంక్రమించే వ్యాధులు వ్యాపించకుండా అరికట్టవచ్చు.