
భారతదేశం జాతీయ భాష అయిన హిందీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది సంస్కృతి, వారసత్వం విషయంలో గొప్ప భాష మాత్రమే కాకుండా.. దేశంలోని విభిన్న ప్రజలను ఏకం చేసే శక్తిగా ఉంది.. ప్రతి సంవత్సరం జనవరి 10వ తేదీన, ఈ భాష ప్రచారం, వేడుకలను జరుపుకునేందుకు ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే మనం ఈ రోజును ఎందుకు జరుపుకుంటామని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచ హిందీ దివాస్ చరిత్ర, ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచ హిందీ దివస్ చరిత్ర:
ప్రపంచ హిందీ దివస్ ను 2006 సంవత్సరంలో అప్పటి భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హిందీని ప్రపంచ భాషగా జరుపుకోవాలనే ఆలోచనను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు విస్తృత మద్దతు లభించింది. 1975లో భారతదేశంలోని నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి ప్రపంచ హిందీ కాన్ఫరెన్స్ వార్షికోత్సవంతో సమానంగా జనవరి 10వ తేదీని ప్రపంచ హిందీ దివస్‌గా జరుపుకోవాలని నిర్ణయించారు. అప్పటి నుండి ఈ రోజును ప్రపంచం అంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.
ప్రపంచ హిందీ దివస్ ప్రాముఖ్యత:
ప్రపంచ హిందీ దివస్‌కు అపారమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది ఒక భాషను సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా సాంస్కృతిక, భాషా వైవిధ్యం కోసం దాని సహకారాన్ని చూపిస్తుంది. ఇది మన మాతృభాషను కాపాడుకోవడం, ప్రోత్సహించడం ప్రాముఖ్యతను సైతం గుర్తు చేస్తుంది. హిందీ అనేది కేవలం ఒక భాష మాత్రమే కాదు. అది మన గుర్తింపు, చరిత్ర, సంస్కృతిలో అంతర్భాగమని చాలా మంది నమ్ముతారు కూడా. ఇది శతాబ్దాలుగా కవులు, రచయితలు, కళాకారులకు వ్యక్తీకరణ మాధ్యమంగా ఉంది. మన దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని రూపొందించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషించింది. ప్రపంచ హిందీ దివస్‌ను జరుపుకోవడం ఈ సహకారాలన్నింటినీ గుర్తించి, గౌరవిస్తుంది. భవిష్యత్ తరాల కోసం ఈ భాషను సంరక్షించాలనే మన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.
ప్రపంచ హిందీ దివస్ వేడుకలు:
ఈ రోజున హిందీ భాష దాని గొప్ప వారసత్వం గురించి ప్రచారం చేయడానికి, అవగాహన కల్పించడానికి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సెమినార్లు, సమావేశాలు నిర్వహిస్తారు. పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులకు వ్యాసరచన, కవితా పఠనం, హిందీలో చర్చలు వంటి పోటీలను నిర్వహిస్తాయి. ప్రభుత్వ సంస్థలు కూడా ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి పలు కార్యక్రమాలను నిర్వహిస్తాయి. హిందీ అభివృద్ధికి గణనీయమైన కృషి చేసిన వ్యక్తులకు భారత రాష్ట్రపతి అవార్డులను కూడా ఈ రోజున అందజేస్తారు.
భారతదేశంలోనే కాకుండా, మారిషస్, ఫిజీ, నేపాల్, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో, గయానా వంటి హిందీ మాట్లాడే ఇతర దేశాలలో కూడా ప్రపంచ హిందీ దివస్ వేడుకలు జరుపుకుంటారు ఇది భాష ప్రపంచవ్యాప్త పరిధిని హైలైట్ చేయడమే కాకుండా ఈ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను సైతం బలపరుస్తుంది.