టీచర్ల ప్రమోషన్లపై నిర్లక్ష్యమెందుకు?

V6 Velugu Posted on Nov 01, 2021

అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన చదువు అందాలంటే విద్యా సంస్థల్లో ఖాళీలు లేకుండా నియామకాలు సక్రమంగా జరగాలి. కొన్ని నియమాకాలు నేరుగా జరిగితే, కొన్ని ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే మన రాష్ట్రంలో అటు నియామకాలు, ఇటు పదోన్నతుల ప్రక్రియ రెండూ నిలిచిపోయాయి. దీనికి కారణం టీచర్లే అని ప్రభుత్వం చెబుతోంది. కానీ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పదోన్నతులు ఇచ్చిన, ప్రస్తుతం తెలంగాణలో పదోన్నతులు పొందే అవకాశాలను కోల్పోయిన సందర్భాలను ఒకసారి చర్చించుకుందాం.
ప్రమోషన్లకు న్యాయపరమైన చిక్కులు
టీచర్ల పదోన్నతులకు ప్రధాన అడ్డంకి సర్వీసు నిబంధనల్లో ఏర్పడ్డ న్యాయపరమైన సమస్యలు. మన రాష్ట్రంలో ఉన్న లక్షా 30 వేల టీచర్​ పోస్టుల్లో 93% మంది పంచాయతీరాజ్ టీచర్లే. వీరికి డిపార్ట్​మెంట్ ఆఫీసర్స్ పోస్టులైన డీఈవో, ఎంఈవో, హెడ్​ మాస్టర్, జూనియర్ లెక్చరర్ పోస్టులకు పదోన్నతులు పొందే అవకాశం లేదు. పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేస్తున్న టీచర్​ పోస్టులకు లోకల్ కేడర్ ఆర్గనైజ్ కాకపోవడమే దీనికి కారణం. ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీరాజ్ టీచర్లకు అన్యాయం జరుగుతోంన్నదని 1998లో ఉమ్మడి సర్వీస్​ రూల్స్ జీవోలు 505, 535  ద్వారా వారికి పదోన్నతులు కల్పించారు. ప్రభుత్వ టీచర్లు కోర్టులను ఆశ్రయించి ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేసినప్పటికి, 2005లో 95, 96 జీవోలను ఇచ్చి కామన్ సర్వీస్ రూల్స్ ద్వారా పదోన్నతులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను కోర్టుల్లో సవాల్ చేయడంతో 2009లో తాత్కాలిక సర్వీస్​ నిబంధనలతో ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లకు వేర్వేరుగా పదోన్నతులు ఇచ్చారు. తెలంగాణలో 2015లో ఒకసారి మాత్రమే వేర్వేరు యాజమాన్యాలుగా పదోన్నతులిచ్చింది. ఆరేండ్లుగా పదోన్నతులకు అవకాశం వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన లేదు. 2016 సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వులు జీఎస్ఆర్ 637, 639ని అనుసరించి 2017 జులై 21న రాష్ట్ర ప్రభుత్వం జీవో 165ను విడుదల చేసింది. దీని ప్రకారం ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించి పదోన్నతులు ఇచ్చే అవకాశం ఉన్నా.. సర్కారు జాప్యం కారణంగా హైకోర్టు అభ్యంతరంతో నిలిచిపోయాయి.
రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం ద్వారా మూడున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు తీరడంతోపాటు పంచాయతీరాజ్ టీచర్ల సర్వీసు రూల్స్ ఆకాంక్ష తీరే అవకాశం లభించింది. రాష్ట్ర విభజనతో 1975 నాటి 371డి రద్దయ్యింది. పార్లమెంట్ ఉభయ సభల అమోదంతో తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 371-డి అమలులోకి వచ్చింది. దీని ఆధారంగా సర్వీసు రూల్స్ పొందడానికి ప్రభుత్వం రాష్ట్రంలోని ఉద్యోగ, టీచర్​ పోస్టులను లోకల్ కేడర్  గా ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జీఎస్ఆర్ 820(ఇ)ని 2019 ఆగస్టు 29న పొందింది. దీని ప్రకారం విద్యాశాఖలోని పోస్టులను జోనల్, మల్టీ జోనల్, జిల్లా పోస్టులుగా వర్గీకరిస్తూ జీవో 255, 256, 257లను 2021 ఆగస్టు 27న ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా పదోన్నతుల ప్రక్రియను వెంటనే చేపట్టే అవకాశం ఉంది. ఈ నిబంధనలను ప్రభుత్వ టీచర్లు హైకోర్టులో సవాల్ చేసినప్పటికి రాష్ట్రంలో అన్ని యాజమాన్యాల్లోని పోస్టులను లోకల్ కేడర్ గా ఆర్గనైజ్ చేసిన విషయాన్ని తెలిపి పదోన్నతుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేపట్టవచ్చు.
ఎన్నికల అస్త్రంగా మారిన అప్​గ్రేడేషన్​
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల అస్త్రంగా పండిట్, పీఈటీల అప్ గ్రేడేషన్ ను మారడం దురదృష్టకరం. ప్రతి హైస్కూలులో 10వ తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్లు బోధించాలి. కానీ తెలుగు, హిందీ పండిట్​లతో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్​ పోస్టులు మాత్రం కేటగిరి-3, ఎస్​జీటీ స్థాయి కలిగిన పోస్టులు. కానీ, ఈ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్​కు కావలసిన అర్హతలున్న తెలుగు, హిందీ, పండిట్, పీఈటీలు బోధన చేయడం జరుగుతున్నది. పండిట్, పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా మంజూరు చేయాలనే డిమాండ్ ను అంగీకరిస్తూ, 8,630 తెలుగు, హిందీ పండిట్, 1,849 పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్ గ్రేడ్ చేశారు. దీనికి సంబంధించి టీచర్​ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు 2017 ఫిబ్రవరిలో జీవో 17, 18ను విడుదల చేశారు. అయితే ఈ విషయంలో న్యాయపరమైన వివాదాల వల్ల పదోన్నతులు నిలిచిపోయింది. పండిట్, పీఈటీ అర్హతలున్న ఎస్​జీటీలు పదోన్నతికి అర్హులే అనే కారణం వల్ల పదోన్నతుల ప్రక్రియ ముందుకు సాగలేదు. 
హెచ్ఎం పోస్టులకు కోత పడే అవకాశం
2021 జనవరిలో అప్ గ్రేడ్ అయిన 10,479 పోస్టులు పండిట్, పీఈటీలకే అని, ఎస్​జీటీలకు అన్యాయం జరగకుండా 10 వేల పీఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమస్యకు పరిష్కారం లభించింది. అయినా పదోన్నతుల ప్రక్రియను చేపట్టకుండా భవిష్యత్​లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికకు దీనిని అస్త్రంగా మలుచుకోవడానికి పదోన్నతులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. 10 వేల పీఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రేషనలైజేషన్ ఉత్తర్వులో ప్రైమరీ స్కూల్​లో 150 మంది స్టూడెంట్లు ఉంటేనే పీఎస్ హెచ్ఎంకు అవకాశం ఇచ్చింది. ఈ లెక్కన చూస్తే ఇప్పుడున్న 3,500 పీఎస్ హెచ్ఎం పోస్టుల్లోనే కోత పడే అవకాశం ఉన్నది. కావున రేషనలైజేషన్ జీవోలో సవరణ చేసి 100 మంది పిల్లలకు పీఎస్ హెచ్ఎం పోస్టును మార్చాలి. బడిలో చేరిన పిల్లల సంఖ్య ఆధారంగా కాకుండా ఆ పాఠశాల ఆవాసంలోని పిల్లల సంఖ్య ఆధారంగా పీఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేసి ఎస్​జీటీలకు న్యాయం చేయాలి. దేశ ప్రజలకు న్యాయ సేవలు అందించడంలో న్యాయ వ్యవస్థ విఫలమవుతున్నదని, దీనికి కారణం దేశవ్యాప్తంగా కోర్టుల్లో జడ్జీల పోస్టులుగా ఉండటమే కారణమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ ఇటీవల పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ఈ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించి.. ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్వీ రమణ తెలుగుబిడ్డ అయినందుకు గర్వపడుతూ, తెలంగాణ విద్యా శాఖలో ఏండ్లుగా భర్తీ కాకుండా ఉన్న పోస్టులను నింపడానికి న్యాయపరమైన వివాదాలను తొలగించి విద్యారంగాన్ని కాపాడడంలో సహకరించాలని కోరుతున్నాం.

ఎమ్మెల్సీలు, యూనియన్లు బాధ్యత తీసుకోవాలి
చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీచర్​ ఎమ్మెల్సీలు.. ఉపాధ్యాయుల హక్కులను కాపాడాలి. ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు అధికార పార్టీ అప్పగించిన బాధ్యతలు తీసుకోవడంతోపాటు రాష్ట్రంలో నాశనమవుతున్న విద్యరంగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అలాగే 30 ఏండ్ల సర్వీసు పూర్తి చేసుకున్నా ఎలాంటి పదోన్నతి లేకుండా ఉద్యోగ విరమణ చేస్తున్న వేలాది మంది టీచర్ల పదోన్నతి హక్కును కాపాడాలి. ఉమ్మడి రాష్ట్రంలో న్యాయపరమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ 1998, 2005లో జీవోలు విడుదల చేసిన వెంటనే పదోన్నతులు ఇచ్చారు. కానీ రాష్ట్రంలో 2017లో వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులనే అమలు చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు 2019 రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా వచ్చిన అవకాశాన్నయినా ఉపయోగించుకోవాలి. హైకోర్టు స్టే ఇవ్వకముందే వీటిని అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వెంటనే పదోన్నతులు చేపట్టేలా టీచర్​ ఎమ్మెల్సీలు, యూనియన్​ నాయకులు కృషి చేయాలి.

Tagged Telangana, teachers, promotions, Neglect,

Latest Videos

Subscribe Now

More News