ఇండియాపై మళ్లీ నవారో అక్కసు.. ఫ్యాక్ట్ చెక్తో తిప్పికొట్టిన ‘ఎక్స్’

ఇండియాపై మళ్లీ నవారో అక్కసు.. ఫ్యాక్ట్ చెక్తో తిప్పికొట్టిన ‘ఎక్స్’
  • ఎక్స్​ ఒక చెత్త అంటూ నోరుపారేసుకున్న నవారో
  • స్వలాభం కోసమే రష్యా ఆయిల్ కొనుగోలు
  • ఫ్యాక్ట్ చెక్​తో నవారో ఆరోపణలను కొట్టిపారేసిన ఎక్స్

న్యూయార్క్: రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న ఇండియాపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో మరోసారి అక్కసు వెళ్లగక్కారు. ఇండియా కేవలం సొంత లాభం కోసమే రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తూ, ఉక్రెయిన్​లో యుద్ధానికి ఊతమిస్తోందన్నారు. అయితే, నవారో మాటల్లో నిజం లేదని, నిజానికి అమెరికా కూడా రష్యా నుంచి యురేనియం, తదితర దిగుమతులు చేసుకుంటోందని బిలియనీర్ ఎలాన్ మస్క్ కు చెందిన ‘ఎక్స్’ ఫ్యాక్ట్ చెక్ చేసి తిప్పికొట్టింది. దీంతో ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ ఒక చెత్త అని నవారో మళ్లీ నోరుపారేసుకున్నారు.

గత నెలలో ఇండియాపై ట్రంప్ 25 శాతం టారిఫ్ లు వేసినప్పటి నుంచీ నవారో తరచూ ఇండియాకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా శనివారం ఆయన ఎక్స్ లో స్పందించారు. ‘‘ఇండియా కేవలం లాభం కోసమే రష్యా నుంచి చమురు కొంటోంది. ఉక్రెయిన్​తో రష్యా యుద్ధం చేసేందుకు ఈ కొనుగోళ్లతో సాయం చేస్తోంది. యుద్ధంలో ఉక్రెయిన్, రష్యా ప్రజలు చనిపోతున్నారు. అలాగే ఇండియా భారీగా టారిఫ్​లు వేయడం వల్ల అమెరికన్లపై భారం పడటంతోపాటు ఉద్యోగాలు కోల్పోతున్నారు” అని ట్వీట్ చేశారు.

అయితే, నవారో పోస్ట్​కు ఎక్స్ కమ్యూనిటీ నోట్ (ఫ్యాక్ట్ చెక్ నోట్)ను జత చేసింది. ‘‘ఇండియాపై నవారో కామెంట్లలో నిజం లేదు. ఇండియా కేవలం ఇంధన భద్రత కోసమే రష్యా నుంచి ఆయిల్ కొంటోంది. ఈ కొనుగోళ్లలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడంలేదు. రష్యా నుంచి అమెరికా కూడా యురేనియం, ఇతర దిగుమతులు చేసుకుంటోంది. అందువల్ల నవారో కామెంట్లు కపటత్వంతో కూడుకున్నవి” అని కమ్యూనిటీ నోట్ లో పేర్కొంది. దీంతో మస్క్ పైనా నవారో మండిపడ్డారు.

‘‘వావ్. ప్రజలు పెట్టే పోస్టులతో మస్క్ ప్రోపగండా చేస్తున్నారు. ఎక్స్ ట్యాగ్ చేసిన కమ్యూనిటీ పోస్ట్ ఒక చెత్త” అని పేర్కొన్నారు. ఇండియా ఆయిల్ కొనుగోళ్లు రష్యా యుద్ధానికి ఊతం అందిస్తున్నాయంటూ మళ్లీ అదే పాట పాడారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి, దేశ ప్రయోజనాల కోసమే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నామని ఇండియా ఇదివరకే స్పష్టం చేసినా, నవారో మాత్రం పదే పదే అక్కసు వెళ్లగక్కుతున్నారు.