భర్త అనుమానించాడని..! బిడ్డ గొంతుకోసి తానూ కోసుకుంది

భర్త అనుమానించాడని..! బిడ్డ గొంతుకోసి తానూ కోసుకుంది

అనుమానం ఓ కుటుంబంలో చిచ్చురేపింది. పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. లోకం చూడని ఓ చిన్నారి బతుకు అర్థాంతరంగా ముగిసిపోయింది. సైకోలాగా మారిన భర్త పదే పదే అనుమానిస్తుండటంతో…  కోపంలో… భార్య దారుణమైన చర్యకు పాల్పడింది.

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ లో ఈ సంఘటన జరిగింది. నారాయణరెడ్డి, సుశీల ఇద్దరికీ పెళ్లై రెండేళ్లయింది. వీరిది ఒంగోలులోని పొదిలి. ఏడాది కిందట హైదరాబాద్ లోని జీడిమెట్లకు వచ్చినట్టు తెలిసింది. వీరికి ఏడాది వయసున్న దీక్ష అనే పాప ఉంది. ఐతే.. అనుమానం వారి కుటుంబంలో గొడవలు రేపింది. భార్యను భర్త అనుమానిస్తుండేవాడు. దీంతో.. ఆ కుటుంబంలో గొడవలు తరచుగా జరుగుతుండేవి. నిన్న రాత్రి కూడా ఇలాగే గొడవ జరగడంతో… విసుగు చెందిన భార్య దారుణానికి పాల్పడింది.

తెల్లవారుజామున 3 గంటలకు బాత్ రూమ్ లోకి తన బిడ్డను బాత్ రూమ్ కు తీసుకెళ్లి… కూరగాయలు కోసే కత్తితో గొంతు కోసింది. తన గొంతు కూడా కోసుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. చిన్నారి దీక్ష అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయానికి ఇంట్లోనే ఉన్నాడు భర్త నారాయణరెడ్డి. భార్య చేసిన అఘాయిత్యం గురించి చుట్టుపక్కల వాళ్లకు చెప్పి.. అదే సమయంలో ఇద్దరినీ హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. బిడ్డ చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. సుశీల హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. తన భార్య ఇంత దారుణానికి ఒడిగడుతుందని తాను అనుకోలేదని భర్త చెప్పాడు.