10 సంవత్సరాలు.. 10 లక్షల జీవజాతులు అంతం

10 సంవత్సరాలు..  10 లక్షల జీవజాతులు అంతం

ప్రకృతికి పెద్ద కష్టమొచ్చిపడింది. భూమ్మీదున్న 80 లక్షల జీవజాతుల్లో, పది లక్షల జాతుల చెట్లు, జంతువులు అంతరించేలా ఉన్నాయంటూ సైంటిస్టులు సంచలన ప్రకటన చేశారు. ఐక్యరాజ్యసమితి‘బయోడైవర్సిటీ’పై చేసిన ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ ఫాం ఆన్ బయోడైవర్సిటీ, ఎకోసిస్టం సర్వీసెస్(ఐపీబీఈఎస్) రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. మునుపెన్నడూ లేనంత వేగంగా జీవజాతులు అంతరించిపోతున్నాయట. మరికొన్ని దశాబ్దాల్లో ఈ పది లక్షల జాతులు ఎన్నటికీ కనిపించకుండాపోతాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయం, కరెంటు, వాతావరణ మార్పును సరైన పద్ధతుల్లో వాడుకుంటే ఆ నష్టానికి బ్రేకులేయొచ్చంటున్నారు. లేకపోతే మానవ చరిత్రలో కనీవినీ ఎరుగని గడ్డు పరిస్థితుల్ని చవి చూడాల్సివస్తుందని చెప్పారు. భూమ్మీద బతికే జీవుల సంఖ్య 1900 తర్వాత 20 శాతానికి తగ్గిపోయింది. ఉభయచరాలు 40 శాతం, కోరల్ రీఫ్స్ 33 శాతానికి పడిపోయాయి. మూడొంతుల సముద్ర జీవుల్లో ఒక వంతుకు ప్రాణహాని పొంచివుంది. 16వ శతాబ్దం నుంచి 680 జాతుల సకశేరుకాలు కనుమరుగైపోయాయి. తొమ్మిది శాతానికిపైగా క్షీరదాలు 2016 కల్లా అంతమైపోయాయి. వీటిలో ఇంకా వెయ్యి జాతులు నశించిపోయే స్థితిలో ఉన్నాయి.

ప్రకృతికి తిరిగిచ్చేయాలి..!
ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 200 కోట్లకుపైగా ప్రజలు వంట చెరకుగా కట్టెల్ని వాడుతున్నారు. 400 కోట్ల మంది ఆరోగ్యం కోసం చెట్ల ఔషధాలను ఆశ్రయిస్తున్నారు. వీళ్లలో 70 శాతం మంది కేన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చికిత్స కోసం ప్రకృతి ఔషధాలపై ఆధారపడుతున్నారు. ప్రపంచంలో పండుతున్న 75 శాతం పంటలు జంతువుల ఫలదీకరణంపై ఆధారపడి పండుతున్నాయి. ప్రకృతికి ఈ పరిస్థితి దాపురించడానికి కారణమెవరో తెలుసా? మనిషి. ప్రకృతిలోని వస్తువులను, పరిమితికి మించి తోడేసుకుంటున్నాం. ఆహారం, ఎనర్జీ, భూమి, మెటీరియల్స్ ఇలా వస్తువేదైనా, తరిగిపోయే దాకా వదిలిపెట్టడం లేదు. ఇకనైనా మనిషి నిరంతర ఆర్థికాభివృద్ధి కాంక్షను వదులుకుంటేనే, జీవజాతులు బతికిబట్టకడతాయని సైంటిస్టులు తేల్చి చెబుతున్నారు.

మూడేళ్ల రివ్యూ..
గ్లోబల్ అసెస్ మెంట్ రిపోర్టు ఒక్క రోజులో చేసింది కాదు. దాదాపు మూడేళ్ల పాటు 15 వేల పేపర్లను అధ్యయనం చేసి, దీన్ని రూపొందించారు. వీటిలో 50 ఏళ్ల పారిశ్రామికీకరణ, భూమిపై దాని ప్రభావం గురించి పూర్తి స్థాయి వివరణ ఉంది. వీటిని పరిశీలించిన సైంటిస్టులు, ప్రకృతిలో ఈ విపరీత మార్పులకు కారణం ఐదుగురు నిందితులని తేల్చారు. భూమి సముద్రాలు, వస్తువుల మితిమీరిన వాడకం, వాతావరణ మార్పు, పొల్యూషన్, కొత్త జాతుల ప్రవేశం.

బెంగాల్ టైగర్స్ బలి!
వాతావరణ మార్పు, పెరుగుతున్న సముద్రమట్టం ధాటికి బెంగాల్ టైగర్స్ అంతరించే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ రిపోర్టులోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ టైగర్లు ఎక్కువగా ఉండే మడ అడవులు, సముద్రమట్టం పెరిగి మునిగే అవకాశం ఉందని ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ పరిశోధకులు తేల్చారు. 2070 నాటికి ఈ ప్రాంతంలో పులులన్నవే ఉండవని చెబుతున్నారు.