దక్షిణాన కమల వికాసం ఎంత?

దక్షిణాన కమల వికాసం ఎంత?

పదేండ్లు కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి.. మూడోసారి గెలుపే లక్ష్యంగా ‘వికసిత్​ భారత్’ ప్రచార నినాదం ఎత్తుకుంది. ఈసారి ఎలాగైనా కేంద్రంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా  ‘ఇండియా కూటమి’గా జట్టు కట్టింది. ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తోంది. ఇకపోతే మనదేశం ప్రధానంగా రాజకీయంగా, సాంస్కృతికంగా, సంప్రదాయికంగా రెండు ప్రాంతాలుగా విభజితమై ఉంటుంది. ఉత్తరాదిలో మతానికి అధిక ప్రాధాన్యతను ఇస్తే..  దక్షిణాదిలో ఆత్మగౌరవానికి, సామాజిక చైతన్యానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు. దక్షిణ భారతీయులు భాషాపరంగా, సాంస్కృతికపరంగా మిగతా భారత్ కంటే భిన్నంగా ఉంటారని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ కూడా స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే పార్లమెంట్​లో పేర్కొన్నారు.  

కేంద్రంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ అధికార పరంగా పాగా వేయాలని బీజేపీ ఎప్పటి నుంచో రాజకీయంగా తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. దక్షిణ భారత్ లో  తెలంగాణ (గేట్ వే ఆఫ్ ఉత్తర, దక్షిణ భారత్), ఆంధ్రప్రదేశ్​, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలను పరిగణిస్తారు. ఈ ఆరు రాష్ట్రాల్లో మొత్తం 130 లోక్ సభ సీట్లు ఉన్నాయి.  ఇవి దేశంలోని మొత్తం 543 సీట్లలో నాలుగోవంతు.  2019లో  కూడా బీజేపీ 303 లోక్‌‌సభ సీట్లను సాధించినా, అందులో దక్షిణాదిలో కర్నాటకలో 25 ,  తెలంగాణలో 4  సీట్లు వచ్చాయి.  ఆంధ్రప్రదేశ్, కేరళలో ఖాతా కూడా తెరవలేదు. 

 అబ్ కీ బార్ .. నినాదమెందుకంటే.. 

ఈసారి బీజేపీ ‘అబ్ కీ బార్ 400 పార్’  నినాదాన్ని ఎత్తుకుంది. దీనిపైనే దేశవ్యాప్తంగా ప్రతి సభలోనూ ప్రధాని నరేంద్ర మోదీ తమ పార్టీ శ్రేణులకు కూడా పిలుపునిస్తున్నారు. ఇలా ఎందుకంటే 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో ఆనాడు కాంగ్రెస్ 404  సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దేశ పార్లమెంటరీ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా అన్ని సీట్లు సాధించి కాంగ్రెస్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ ఆ రికార్డును  ఏ పార్టీ కూడా బ్రేక్ చేయలేదు. ఇకపోతే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు.. కాంగ్రెస్ రికార్డును చెరిపేసేందుకు  ప్రధాని మోదీ 400 సీట్లపైగా నినాదం ఎత్తుకున్నారని కూడా చెప్పొచ్చు.  ఇప్పటికే  కాంగ్రెస్  విముక్త భారత్ దిశగా బీజేపీ రాజకీయంగా వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నది తెలిసిందే. కానీ,  కాంగ్రెస్ మాత్రం ఎప్పటికప్పుడు బలం పుంజుకుంటూనే ఉంది. కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి రావడమే దీనికి ప్రధాన కారణం.

కర్ణాటకలో అధికారం కోల్పోగా.. 

ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ గత రెండు పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన లోక్​సభ సీట్ల కంటే  తక్కువే వచ్చే చాన్స్ లేకపోలేదు. 2023 మార్చిలో కర్ణాటకలో అధికారం కోల్పోయింది. ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారమంతా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఇద్దరే తమ భుజస్కంధాలపై వేసుకుని ప్రచారం చేసినా ఓడిపోయారు. డబుల్ ఇంజిన్ సర్కార్​కు బ్రేక్ వేశారు.  గతేడాది డిసెంబర్​లో తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.  కమలం పార్టీ బీసీ ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసినా ప్రజలు తిరస్కరించారు.  8 సీట్లలోనే గెలవగా..  బీఆర్ఎస్ మాత్రం అధికారం కోల్పోయింది.  మరోవైపు అసెంబ్లీ ఎన్నికల గెలుపు ఊపుతో  కాంగ్రెస్ ఈసారి14కు పైగా  పార్లమెంటు స్థానాల్లో పాగా వేసేందుకు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో  ప్రచారంలో ముందుకెళ్తున్నది తెలిసిందే.  ప్రస్తుతం కర్ణాటక,  తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ ఉంటే, ఆంధ్రప్రదేశ్​లో వైఎస్ఆర్ సీపీ, తమిళనాడులో డీఎంకే, కేరళలో సీపీఎం, పుదుచ్చేరిలో అఖిల భారత ఎన్‌‌ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి.
  
ఇండియా కూటమికే ప్లస్ 

దక్షిణాదిలో ఎలాగైనా ఈసారి గతం కంటే అధిక సీట్లు గెలవాలనే టార్గెట్  బీజేపీ పెట్టుకుంది. ఇందులో భాగంగా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే  ప్రధాని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభాలతో పాటు మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని హామీలు ఇస్తున్నారు. అయినా.. ప్రాంతీయ పార్టీలతో  పొత్తుపైనే ఆ పార్టీ ఆధారపడక తప్పని పరిస్థితి ఉంది. తాజాగా ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణలో బీజేపీ ప్రభావం అంతగా ఉండకపోవచ్చు.  కేరళలోని వయనాడు నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండోసారి కూడా పోటీ చేస్తున్నారు.  2022లోనూ జోడో యాత్రను కూడా తమిళనాడులోని కన్యాకుమారి  నుంచే చేపట్టారు.తద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఆ దిశగా బీజేపీని ఓడించేందుకు దక్షిణాది రాష్ట్రాలు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయని, అది ఇండియా కూటమికే ప్లస్​అని చెప్పొచ్చు. ప్రధానంగా బీజేపీ దేశభక్తి వాదంతో ముందుకెళ్తున్నా.. ఈ పదేండ్ల పాలనలో జమ్ముకశ్మీర్​లో 370 ఆర్టికల్ రద్దు, అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తి చేయగలిగింది. కానీ,   దేశంలో  పేదరికాన్ని,  నిరుద్యోగాన్ని  తగ్గించలేకపోయింది.  ధరల పెరుగుదలను అరికట్టలేకపోయింది. అదేవిధంగా విదేశాల నుంచి నల్లధనాన్ని తెచ్చి ఆ డబ్బును దేశ ప్రజల ప్రతి ఒక్కరి ఖాతాలో  వేస్తామని చెప్పిన  హామీని నెరవేర్చలేకపోయింది. ఆపై దేశ సంపదను  కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టిందనే  విమర్శలను ప్రతిపక్షాల నుంచి ఎదుర్కొంటోంది. ఇలాంటి విఫల విధానాల ద్వారా   దక్షిణాదిన బీజేపీ మునుపటి కన్నా అధిక స్థానాలు గెలిచే అవకాశాలు అంతగా లేవనే చెప్పొచ్చు. 

దక్షిణాదిపై చిన్నచూపే.. 

దక్షిణాది ప్రజలు ఉత్తరాది కంటే సామాజికంగా చైతన్యవంతులు.  దక్షిణాది రాష్ట్రాల్లోనే విద్యాస్థాయి మెరుగ్గా ఉంది. మత విధానాల అంశంలోనూ ఉత్తరాదితో పోల్చితే దక్షిణ ప్రాంతం భిన్నంగా ఉంటుంది. మత స్వేచ్ఛ కూడా ఎక్కువ. మరోవైపు పదేండ్లు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉత్తరాది  పాలనలో ఉండడంతో దక్షిణాదికి నిధులు, పాలన, అభివృద్ధిపరంగా అన్యాయం, వివక్ష జరిగాయనే విమర్శలు రాజకీయ విశ్లేషకులు, ప్రాంతీయ పార్టీల నుంచి వినిపిస్తున్నది తెలిసిందే. దక్షిణాది నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి భారీగానే ఆదాయం వెళ్తుంది.  రాష్ట్రాలు కూడా కేంద్రానికి ఎక్కువగా పన్నులు చెల్లిస్తున్నాయనే వాదన ఉంది. కానీ.. అదేస్థాయిలో కేంద్రం నుంచి అరకొర ఆర్థికసాయం మాత్రమే అందుతుందనే ఆరోపణలు ప్రతిపక్షపార్టీల నుంచే ఎదుర్కొంటుంది. భవిష్యత్ లో జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల సీట్లను మరింత తగ్గుతాయనే ప్రచారం కూడా ఉంది. దీంతో ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్​లో సీట్ల సంఖ్య తగ్గి  పాలనలో ప్రాతినిధ్యం బలహీన పడుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. 

- వేల్పుల సురేష్
సీనియర్ జర్నలిస్ట్