కాంగ్రెస్​ మళ్లా గెలుపు బాట పడ్తదా?

కాంగ్రెస్​ మళ్లా గెలుపు బాట పడ్తదా?

19వ శతాబ్దంలో పురుడు పోసుకున్న కాంగ్రెస్​ పార్టీ ఏకచ్ఛత్రాదిపత్యంగా దాదాపు 49 ఏండ్ల పాటు దేశంలో పాలన సాగించిందంటే మాటలు కాదు. అంతటి ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్​కి చెదలు ప్రారంభమై కూడా చాలా రోజులు అవుతోంది. ఇటు తెలంగాణ.. అటు ఆంధ్రాలో ఆ పార్టీ పరిస్థితి బాగలేదు. సరైన నాయకులు లేక, వ్యూహాత్మక రచనలు లేక దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఎంత శ్రమటోడ్చినా డిపాజిట్​ దక్కకుండా పరాజయం పాలవుతూ గెలుపు రుచి మరచిపోయేలా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే పార్టీ ఫేడవుటయ్యే చాన్స్​ ఉండటమే కాదు మొత్తానికే కనుమరుగయ్యే పరిస్థితి రావొచ్చు.

ప్రజాస్వామిక ఎన్నికల పంథాలో పాలక ప్రతిపక్షాలను ప్రజలే నిర్ణయిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీల సరళి, మీడియాలో వారిపై అంచనాలు ఎలా ఉన్నాయన్న  ప్రచారం పూర్తి భిన్నంగా ఉంది. అదీ, కోరింది నెరవేర్చుకోవాలనుకునే పాలకపక్షాల వైపు నుంచి ఒకింత వ్యూహాత్మకంగా జరగటమే ఆశ్చర్యకరం. ఇంకా ఎన్ని పర్యాయాలు తామే అధికారంలో ఉంటామో! తమకు ప్రధాన పోటీదారు ఎవరో? తమతో పోటీపడలేక ఎవరు చతికిల పడిపోతారో.. పడి పోవాలో... పాలక పక్షమే నిర్ణయిస్తుందా? తెలంగాణ రాజకీయవర్గాల్లో కొంత కాలంగా ఈ ప్రచారమే నడుస్తోంది. ఈ సరళిని గుడ్డిగా నమ్ముతున్నాయా? అన్నట్టు రాష్ట్రంలోని మిగతా రాజకీయ పార్టీల నడక, వ్యవహార శైలి మరింత విస్మయం కలిగిస్తోంది. రాజకీయాలన్నపుడు వ్యూహ..ప్రతివ్యూహాలు సహజమే! గెలుపోటములు అంతకంటే సహజం. అలా అని... శాశ్వతంగా గెలిచే పార్టీ, నిరంతరం ఓడే పార్టీ అని ఎక్కడా ఉండవు. ఎన్నికల రాజకీయాల్లో ఓడలు బళ్లవుతాయ్‌‌, బళ్లూ ఓడలవుతాయ్‌‌! రాజకీయ దురందరులుగా పేరుపడ్డ ఎంతోమంది నాయకులు ఓడిపోయిన సందర్భాలు దేశ రాజకీయ చరిత్రలో కోకొల్లలు. అలాగే అనామకులు, రాజకీయ అర్బకులు కూడా తాడూ బొంగరం లేకుండానే ఎకాఎకి ఎన్నికల్లో నెగ్గి అందలాలెక్కిన సందర్బాలున్నాయి. కారణం ప్రజలే. ఆయా రాజకీయ నాయకుల పార్టీల మనుగడను ప్రత్యక్షంగా, పరోక్షంగా జనం శాసించడమే ఇందుకు కారణం. ఇది తెలిసిన పార్టీలు, వాటి నాయకులు జనం నాడి గమనిస్తూ రాజకీయాల్ని వ్యూహాత్మకంగా నడపడం రివాజు. అంత మాత్రాన... ఓ గెలుపుతో తమకిక తిరుగులేదని విర్రవీగటం, ఒక ఓటమితో నిరాశ నిస్పృహలకు గురై చేష్టలుడగటం రాజకీయాల్లో సరైన పంథా కాదు. ఈ సూక్ష్మం గ్రహించి, అందుకనుగుణంగా నడిచిన వారే నాలుగు కాలాలపాటు  రాజకీయాల్లో మనగలుగుతారు. గ్రహించని వారు రోజురోజుకు కొడిగట్టిన దీపాలై, కడకు ఆరిపోయి కాలగర్భంలో కలుస్తారు. తెలంగాణలో కాంగ్రెస్‌‌ పార్టీకి ఏమైంది? ఇది చాన్నాళ్లుగా, రాజకీయ కనీస అవగాహన ఉన్నవాళ్లు వేస్తున్న ప్రశ్న.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచీ, ప్రతి ఎన్నికలో ఘోరంగా ఓడిపోతూ కూడా ఏ మాత్రం పాఠం నేర్చుకోకుండా, మెరుగులు దిద్దుకోకుండా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్‌‌ మాత్రమే. 

ఎందుకీ పరిస్థితి?

కేంద్రంలో వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉండి, ఇక్కడి సబ్బండ వర్గాల ఆకాంక్షల మేరకు ఏడెనిమిదేండ్ల కింద తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌‌కు ఎందుకీ దుస్థితి? రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవు అనే సామెత వ్యక్తులకే కాక సంస్థలకీ వర్తిస్తుందా? అదే నిజమైతే... రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ది హత్య కాదు, ఆత్మహత్య! ఆ పార్టీ రాజకీయ దుస్థితి స్వయంకృతమే! వాస్తవిక పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకొని రాజకీయ వ్యూహాలు రచించే తెలివి లోపించడం దాని నాయకత్వ లేమికి తోడైన మరో పెద్ద సమస్య! నాయకత్వ లేమి అనేది కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏకరీతిలో ఉంది. ఒకప్పుడు ఈ పార్టీలో ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పడగల సమఉజ్జీ నాయకులు కనీసం ఓ అరడజను మంది ఉండేవారు. బ్రహ్మానందరెడ్డి సమయం నుంచి దాదాపు వైఎస్‌‌.రాజశేఖర్​రెడ్డి కాలం వరకు ఇదే పంథా సాగింది. అలాంటి వాళ్లు ఇప్పుడేరి? అర్హతతో నిమిత్తం లేకుండా... సీఎం కుర్చీ ఆశించే వారు మాత్రం ఓ డజన్‌‌ పైనే ఉంటారు. వారి మధ్య ఎప్పుడూ స్పర్ధలే. నేనంటే నేనని, పార్టీ ప్రయోజనాల్ని పణంగా పెట్టయినా ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం యత్నిస్తుంటారు. వీధుల్లో పడి పోరుతుంటారు. ప్రత్యర్థులతో కాదు, తమలో తాము. నిత్యం అభద్రత మధ్య కుట్రలు కుతంత్రాలూ చేస్తూనే ఉంటారు. వారి చర్యలు సొంతానికి పెద్ద మేలు చేయకపోయినా పార్టీకి తీరని నష్టాన్ని తెచ్చి పెడతున్నాయి.  అన్ని స్థాయిల్లో పనితీరును సమూలంగా మార్చుకోవాలి కానీ, గాంధీభవన్‌‌కు మరమ్మతులు చేసి రంగులు వేస్తే పార్టీ అవకాశాలు మెరుగవుతాయా? పాలక పక్షమైన టీఆర్‌‌ఎస్‌‌ పట్ల ప్రజల్లో వ్యతిరేకత బలపడిందా? బలహీనమైందా? అని ప్రశ్నించే ముందు... అదే జరిగితే, ఎవరు ప్రత్యామ్నాయం? అనే ప్రశ్న వేసుకోవడం సహేతుకం. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా పౌరులకు భరోసా కల్పించలేకపోవడం కాంగ్రెస్‌‌కు పెద్ద మైనస్‌‌. దీన్ని ఆసరా చేసుకొని బీజేపీ బలోపేతం కావాలని చూడటం మూడేండ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామం! మూడింట రెండు ఉప ఎన్నికలు గెలిచి, హైదరాబాద్‌‌ మహానగర ఎన్నికల్లో దీటైన పోటీ ఇచ్చి... తాను సరైన దిశలోనే  ఉన్నట్లు బీజేపీ భావిస్తోంది. ఆ ధీమాతోనే అడుగులు ముందుకు వేస్తోంది.

కాంగ్రెస్‌‌ను ఎదగనీయొద్దు..

ఏం చేసైనా కాంగ్రెస్‌‌ను ఎదగనీయొద్దు, దానికి బదులు బీజేపీనే ప్రధాన ప్రత్యర్థి అనే భావన కలిగించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని సీఎం కేసీఆర్​ఎత్తుగడలు వేస్తున్నారని ఒక ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది!  ఆయన మాటలు కూడా ఒకోసారి అదే భావన కలిగిస్తున్నాయి. నిజంగా అది కేసీఆర్‌‌ చేతిలో ఉందా? ఎవరు ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలి? ఎవరు మూడో స్థానంలో ఉండాలి? ఇంకెన్ని పర్యాయాలు తామే అధికారంలో కొనసాగాలి? అనేది ఆయన వ్యూహరచన నిర్ణయం పరిధిలోదా? అనే ప్రశ్నలు సహజం. కనీస రాజకీయ అవగాహన ఉన్న ఎవరికైనా ఈ సందేహం వస్తుంది. కాంగ్రెస్‌‌కు ఎంతో కొంత నిర్ధిష్ట ఓటు బ్యాంకు ఉంది. పరిస్థితి మారితే ఎప్పటికైనా కాంగ్రెస్‌‌ పుంజుకునే ప్రమాదం ఉంది. కనుక దాన్ని ఎదగనీయకుండా... అదొక ఉనికిలోనే లేని పార్టీ అనే భావన కల్పించేందుకే ఆయన బీజేపీని తనకు ప్రధాన ప్రత్యర్థిగా తెరపైకి తెస్తున్నారనేది విశ్లేషకుల ఉవాచ. దీన్నొక అవకాశంగా తీసుకొని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదగాలని బీజీపీ ఉబలాటపడుతోందంటూ ఆ పార్టీ ఉత్సాహాన్ని ఉదాహరణగా చూపుతారు. ఇదంతా నిజమేనేమో? మనకిక మనుగడ లేదేమోనని కాంగ్రెస్‌‌ పార్టీ శ్రేణులు రాష్ట్రంలో రోజు రోజుకు నిరుత్సాహపడిపోతున్న వాతావరణం కనిపిస్తోంది. 2018 రాష్ట్ర శాసనసభ ఎన్నికల నుంచి 2019 లోక్‌‌సభ ఎన్నికలు, తర్వాత అసెంబ్లీకి జరిగిన పలు సెగ్మెంట్ల ఉప ఎన్నికలు, హైదరాబాద్‌‌ నగరపాలక సంస్థ ఎన్నికల గణాంకాల్ని విశ్లేషిస్తుంటారు. ఆయా గణాంకాలకు కాస్త తెలివి జోడించి... ఏదేదో విశ్లేషణ చేస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర పార్టీ వ్యవస్థ, యంత్రాంగం లేని బీజేపీని ఎప్పుడంటే అప్పుడు, ఏ నిమిషంలో అయినా, ఎట్లైనా కొట్టొచ్చు, కానీ కాంగ్రెస్‌‌ బలపడితే కష్టమని పాలక పక్షం భావించడమే ఈ సూత్రీకరణ అని టీఆర్​ఎస్​వర్గాలు వివరించవచ్చు. కానీ, వాస్తవాలు మరోలా ఉంటాయి. జనాభిప్రాయాన్ని బట్టి ఎప్పకటికప్పుడు మారుతూ ఉంటాయి.

సభలకొచ్చే జనం ఓట్లేస్తారా?

లోగడ ఓసారి కిక్కిరిసిన ఓ కమ్యూనిస్టుల సభలో మహాకవి శ్రీశ్రీ ప్రసంగిస్తూ....‘‘ఆపలేనే ఎంకి ఈ పడవ విసురు’’ అని హుషార్‌‌ పాటందుకున్నారు. కానీ, అవేవీ ఓట్ల కిందకు మారలే. 1994లో నాటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి నేతృత్వంలో ఏలూరులో జరిగిన ఓ ఎన్నికల సభ ‘నేల ఈనిందా?’ అన్న సందేహం కలిగించింది. అది చూసి సంబరపడ్డ కాంగ్రెస్‌‌ శ్రేణుల ఉత్సాహం ఆకాశాన్నంటింది. కానీ, ఎన్నికల ఫలితాల్లో వారి సంఖ్య ఆశ్చర్యంగా అడుగంటింది. అఖిల భారత స్థాయిలో కన్హయ్య కుమార్‌‌కున్న జనాదరణ తెలియంది కాదు! కానీ, కాంగ్రెస్‌‌లో చేరాక, బీహార్‌‌లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నియోజకవర్గ అభ్యర్థికి కేవలం నాలుగయిదు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాగే  పీసీసీ చీఫ్​ రేవంత్‌‌ రెడ్డి 2018 ఎన్నికలప్పుడు మాంచి జోరుమీద ఉన్నప్పుడు..  మా నియోజకవర్గం సభకి ఇలా ఓ 5 నిమిషాలు రేవంత్‌‌ వచ్చిపోతే చాలని కాంగ్రెస్‌‌ బడా నాయకులు బతిమాలుకున్నారు. తీరా చూస్తే, సొంత నియోజక వర్గం కొడంగల్‌‌ లోనే ఆయన ఓడిపోయారు. కొన్ని నెలల తర్వాత 2019లో తిరిగి ఆయన్ని మల్కాజిగిరి లోక్‌‌సభ స్థానం నుంచి ప్రజలు గెలిపించుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు తెలుగుదేశంతో పొత్తుపెట్టుకొని కాంగ్రెస్‌‌ పెద్ద తప్పు చేసింది. దానికి తోడు రాష్ట్రంలో వైఎస్సార్‌‌సీపీ కూడా పోటీలో లేక పాలక టీఆర్‌‌ఎస్‌‌ పంట పండింది. 2019 లోక్‌‌సభ ఎన్నికల్లో పరిస్థితి మారిపోయింది. మిత్రపక్షమైన మజ్లీస్‌‌కు ఒకటి వదిలి.... ‘కారు సారు పదహారు’ అని ఎంత ప్రచారం చేసినా... సగానికి కొంచెం ఎక్కువ స్థానాలు 9/17 మాత్రమే టీఆర్‌‌ఎస్‌‌కు దక్కాయి. బీజేపీ 4, కాంగ్రెస్‌‌ 3 ఎంపీ స్థానాలు గెలిచాయి. ప్రజాతీర్పు తడాఖా అది! సభలకొచ్చే జనం, నాయకులు చేసే విశ్లేషణలు క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఒకటి కావు.

కాలానికి ఎదురీదాల్సిన పరిస్థితిలో​..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయంతో ఊపుమీదున్న టీఆర్​ఎస్​ ఉత్సాహంపై 2019 లోక్‌‌సభ ఎన్నికల ఫలితాలు నీళ్లు చల్లాయి. తనకు బాగా పట్టున్న ఉత్తర తెలంగాణలోనూ టీఆర్​ఎస్​ ఓడింది. వెనుకబడిన వర్గాల ఓట్లనే కాక, కాంగ్రెస్‌‌కు పట్టున్న అగ్రవర్ణాల ఓట్లనూ కొల్లగొట్టి బీజేపీ ఆదిలాబాద్‌‌, నిజామాబాద్‌‌, కరీంనగర్‌‌ లోక్‌‌సభ స్థానాల్ని కైవసం చేసుకుంది. తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో, హైదరాబాద్‌‌ మహానగర ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ గట్టిగా నిలబడ్డ చోట సరే, నిలబడక జారిపోయిన చోటల్లా సదరు ఓటును బీజేపీ లాక్నున్నట్టు గణాంకాలు చెబుతాయి. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ 24.72 శాతం ఓట్లు లబ్ధిపొందగా టీఆర్​ఎస్​ 16.54 శాతం ఓట్లు కోల్పోయింది. కాస్త నిలబడ్డ కాంగ్రెస్‌‌ కోల్పోయింది 2.86 శాతం ఓట్లను మాత్రమే! అదే కాంగ్రెస్‌‌ది హుజూరాబాద్‌‌లో పూర్తి భిన్న పరిస్థితి. బీజేపీ 51.01 శాతం ఓట్లు లబ్ధిపొందగా, టీఆర్​ఎస్​ కోల్పోయింది 18.96 శాతం ఓట్లనే! కానీ, కాంగ్రెస్‌‌ కోల్పోయింది మాత్రం 33.14 శాతం ఓట్లు. మారుతున్న కాలమాన పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకొని కాలానికి ఎదురీదితే తప్ప కాంగ్రెస్‌‌కు మనుగడ కష్టం! పనితీరు మార్చుకోకుంటే, తెలంగాణ కాంగ్రెస్‌‌ పార్టీ పరిస్థితి కూడా ఓ తమిళనాడు, ఓ బీహార్‌‌, ఓ యూపీలో కాంగ్రెస్‌‌ పార్టీకి ధీటుగా తయారయ్యే సంకేతాలు క్రమంగా మెండవుతాయి. ఎందుకంటే, రాజకీయ పక్షాల మనుగడను నిర్ణయించేది ప్రత్యర్థి పక్షాలు కాదు, సాక్షాత్తు ప్రజలే. 

- దిలీప్‌‌రెడ్డి, డైరెక్టర్‌‌ పీపుల్స్‌‌ పల్స్‌‌