
పంజాబ్ ప్రజలకు తన అవసరం ఉన్నంత కాలం రాజకీయాల్లో కొనసాగుతానని, అవసరమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీకి వెనుకాడబోనని కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ చెప్పారు. పదేండ్ల అకాలీదళ్–బీజేపీ పాలనలో జనం తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, ఆ కష్టాలన్నింటినీ తీర్చేదాకా రెస్ట్ తీసుకోలేనని తెలిపారు. 2017 అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో ‘‘నాకిదే చివరి ఎన్నిక, ఇకపై పోటీ చేయను’’అని ప్రకటించిన కెప్టెన్, ఇప్పుడిలా మాటమార్చడం చర్చనీయాంశమైంది. 2002లో ఫస్ట్‌టైమ్ సీఎంగా ఎన్నికైన ఆయన, 2017లోనూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి రెండోసారి సీఎం అయ్యారు.