ఆ నలుగురు ఎమ్మెల్యేల దారెటు..!

ఆ నలుగురు ఎమ్మెల్యేల దారెటు..!

అంతా అనుకున్నట్లే జరిగింది. అందరూ ఊహించిందే జరిగింది. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన ఎమ్మెల్యేలపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపుతో వైసీపీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. తమ అభ్యర్థి ఓటమికి అసలు కారణాలేంటి అన్నదానిపై పార్టీలో చర్చలు సాగాయి. చివరకు ఆ నలుగురే నమ్మక ద్రోహం చేశారని తేల్చారు. అందుకే నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేల దారెటు..? ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తోంది. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ పాల్పడ్డారన్న కారణంతో నలుగురు ఎమ్మెల్యేలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చర్యలకు దిగింది. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి  చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్‌ చేశారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 నుంచి రూ.15 కోట్లు ఇచ్చి చంద్రబాబు కొనుగోలు చేశారని సజ్జల ఆరోపించారు.

వైసీపీ నుంచి సస్పెండ్ కు గురైన నలుగురు ఎమ్మెల్యేలు ఏ పార్టీకి వెళ్తరానే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నిజంగా ఈ నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారా..? లేదా అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం ఈ నలుగురు టీడీపీలోకే వెళ్తారనే ప్రచారమూ సాగుతోంది. కొంతకాలంగా ఈ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్టానంపై చాలా అసంతృప్తితో ఉన్నారు. సమయం దొరికినప్పుడల్లా పార్టీపై ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ విమర్శలు, సెటైర్లే వేస్తూ వచ్చారు. కొన్నిసార్టు సొంత పార్టీ నాయకులపై విమర్శలు కూడా చేశారు. వీటంటినీ గమనిస్తూ వచ్చిన అధిష్టానం అవకాశం కోసం ఎదురుచూసింది. 

ఇంకేముంది.. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినందుకు నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది జగన్ పార్టీ. అయితే.. తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని ఇప్పటికే ఎమ్మెల్యే శ్రీదేవి వివరణ ఇచ్చారు. ఇటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా తాను వైసీపీ అభ్యర్థికే ఓటు వేశానని చెప్పారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం ఆత్మప్రబోధానుసారం ఓటు వేశానని తెలిపారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం దీనిపై నోరు మెదపలేదు.

కొంతకాలంగా వైసీపీపై అసంతృప్తితో, గుర్రుగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి వెళ్తారనే ప్రచారమూ ఉంది. ఆయా నియోజకవర్గాల్లో వారికి ఉండే వెసులుబాటు, కార్యకర్తలు, నాయకుల మద్దతును బట్టి ఏ పార్టీకి వెళ్తారనేది కొద్దీరోజుల్లోనే తేలనుంది. ముఖ్యంగా పసుపు కండువానే కప్పుకుంటారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎందుకంటే వైసీపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీయే కనుక అధికార పార్టీని ఢీ కొట్టాలంటే సరైన ప్లాట్ ఫాం తెలుగుదేశం పార్టీనే అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టీడీపీలో చేరితో ఈ నలుగురికి చంద్రబాబు టిక్కెట్ ఇస్తారా..? లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. 

మరోవైపు.. ఆనం, కోటంరెడ్డికి టీడీపీ టిక్కెట్లు కాన్ఫమ్ అయ్యాయని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఈ ఇద్దరూ టీడీపీ నుంచే పోటీ చేస్తారని సమాచారం. ఇక ఉండవల్లి శ్రీదేవి పరిస్థితి కొంత ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ శ్రీదేవి టీడీపీకి వెళ్తే ఆమెకే టిక్కెట్ ఇస్తారన్న గ్యారెంటీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఇటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా టీడీపీలోకి వెళ్తారా..? లేక మరే పార్టీలోకి వెళ్తారనే తేలాల్సి ఉంది. ఆయన నియోజకవర్గంలోని అనుచరులు, శ్రేయాభిలాషులతో సమీక్షలు చేసిన తర్వాత ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే చాన్స్ ఉందంటున్నారు. మొత్తానికి వైసీపీ నుంచి గెంటబడ్డ నలుగురు ఎమ్మెల్యేలకు టీడీపీ ద్వారాలు తెరిచే ఉన్నాయట..! ఎప్పుడు చేరుతారనేదే ఆసక్తికరంగా మారింది.