గిరిజనబంధు పేరుతో మిగతా స్కీంలను పక్కన పెట్టనున్నసర్కార్? 

గిరిజనబంధు పేరుతో మిగతా స్కీంలను పక్కన పెట్టనున్నసర్కార్? 

హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర సర్కార్ గిరిజనులను పట్టించుకోవడం లేదు. గత ఎనిమిదేండ్లలో ఎస్టీ సంక్షేమానికి అరకొరగానే నిధులను ఖర్చు చేసింది. బడ్జెట్​లో ఏటా రూ. వేల కోట్లు కేటాయిస్తున్నా.. ఏడాదికి యావరేజ్ గా రూ. 100 కోట్ల చొప్పున ఇప్పటి వరకు రూ.820 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. ఎస్టీలకు అమలు చేసే సబ్సిడీ స్కీములను కూడా ఎత్తేసింది. డ్రైవర్ ఎంపవర్​మెంట్ స్కీంను పక్కకు పెట్టగా, ఎకనామికల్ సపోర్ట్​ స్కీంనూ పట్టించుకోవడం లేదు. 2011 ప్రభుత్వ జనాభా  లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 31.78 లక్షల మంది ఎస్టీలు ఉన్నారు. మొత్తం పాపులేషన్​లో ఇది 9.08 శాతం. ఈ 10  ఏండ్లలో ఆ సంఖ్య మరింత పెరిగింది. అయితే అందుకు తగ్గట్లుగా వారి సంక్షేమం కోసం సర్కార్ నిధులను పెంచడం లేదు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడమే తప్ప వాటికి కనీస సౌలతులను కూడా కల్పించలేదు. చాలా ప్రాంతాల్లో రోడ్లను సైతం చేపట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. పైగా రైతుబంధు, కల్యాణలక్ష్మీ, డబుల్ బెడ్రూం ఇండ్లు, కొన్నిచోట్ల వేసిన రోడ్ల వంటి వాటిని ఎస్టీ స్పెషల్ డెవలప్​​మెంట్ ఫండ్ ఖర్చుల్లో నమోదు చేస్తూ ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసినట్లు చూపెడుతున్నది. గిరిజన బంధు పేరుతో ఇప్పటికే పెండింగ్​లో ఉన్న వివిధ సబ్సిడీ అప్లికేషన్లను పూర్తిగా పక్కకు పడేసే ప్లాన్ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

మూడేండ్లుగా సబ్సిడీలు బంద్ 

ఎస్టీ యువత కోసం తీసుకువచ్చిన డ్రైవర్ ఎంపవర్​మెంట్ స్కీంను నిలిపివేశారు. గత మూడేండ్లుగా ఈ స్కీంకు నిధులు ఇచ్చేందుకు సర్కార్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ప్రతిసారీ ప్రభుత్వానికి పంపిన ప్రపోజల్స్​ను పెండింగ్​లోనే పెడుతున్నారని ఆఫీసర్లు చెప్తున్నారు. ఫండ్స్​కు సంబంధించి ఎలాంటి అప్రూవల్ రాకపోతే స్కీంను కొనసాగించలేమని అంటున్నారు. ఈ స్కీం కోసం దాదాపు లక్ష మంది అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు. ఎనిమిదేండ్లలో 34,873 మందికి మాత్రమే ఈ స్కీం అందింది. మరోవైపు ఎకానమిక్ సపోర్ట్ స్కీంను కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఈ ఎనిమిదేండ్లలో 1,120 మందికి మాత్రమే ఎకానమిక్​ సపోర్ట్​ స్కీం కింద లబ్ధి చేకూరినట్లు ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్​లో ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్ పేర్కొన్నది. రాష్ట్ర సర్కార్ నుంచి కొత్తగా ఏమీ ఇవ్వకపోగా, కేంద్రం నుంచి గిరిజనుల కోసం వస్తున్న కొన్ని సబ్సిడీ స్కీంలను సైతం రాష్ట్ర ఖాతాలో వేసుకుంటోందన్న ఆరోపణలు వస్తున్నాయి.

గిరి వికాసం.. ఎస్టీ ఇన్నోవేషన్ ఆగినయ్ 

 సీఎం గిరి వికాసం పథకం కింద గిరిజనుల పొలాల్లో బోర్‌, విద్యుత్‌ సౌకర్యం కల్పించడంతో పాటు మోటార్‌ ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయ బావులకు పంపుసెట్లు, వైల్డ్ లైఫ్ గ్రామాలలో సోలార్ పంపుసెట్ సౌకర్యాలు కల్పించాలి. ఈ స్కీం కింద 10 వేలకు పైగా అప్లికేషన్లు పెండింగ్​లో ఉండగా.. 3,805 మందికే ఇచ్చారు. ఇందులోనూ అన్ని పూర్తి స్థాయిలో చేయలేదని లబ్ధిదారుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇక గుడుంబా ఎఫెక్టెడ్​ పర్సన్లకు రిహాబిలిటేషన్ స్కీం అమలును 2016–17తో ఆపేశారు. వ్యాపారం పట్ల ఆసక్తి ఉన్న ఎస్టీ యువత కోసం సీఎం ఎస్టీ ఎంటర్​ప్రెన్యూర్​షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీంను కూడా ప్రభుత్వం తీసుకువచ్చినా.. గత నాలుగేండ్లలో కేవలం 143 మందికి మాత్రమే లబ్ధి చేకూరింది. ఇంకా వేలల్లో దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయి. పోయిన ఏడాది, ఈసారి ఒక్క దరఖాస్తుకు కూడా ఆమోదం తెలుపలేదు.

అన్నీ ఆపే ప్లాన్​  

ఎస్టీలకు గిరిజన బంధు అమలు చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే, గిరిజనబంధు ప్రకటనతో ఇప్పుడున్న స్కీంలు అన్నింటిని పక్కన పెట్టనున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. పెండింగ్​లో ఉన్న అప్లికేషన్లు క్లియర్ చేస్తారో లేదో అనుమానమేనని అంటున్నారు. ఇప్పటికే ఎస్సీలకు దళితబంధు అమలు చేయడంతో వారికి సబ్సిడీ స్కీంలు అన్నింటిని ఆపేశారు. గిరిజనబంధు తెస్తే కూడా గిరిజనులకు అరకొరగా అందుతున్న ఇతర స్కీంలు కూడా ఎత్తేస్తారని ఆఫీసర్లలోనే చర్చ జరుగుతోంది.    

ఎనిమిదేండ్లలో ఖర్చు ఇలా

రాష్ట్ర సర్కార్​ లెక్కల ప్రకారం గత 8 ఏండ్లలో స్పెషల్ డెవపల్​మెంట్ ఫండ్ కాకుండా.. ఎస్టీ వెల్ఫేర్​కు ఖర్చు చేసిన మొత్తం రూ.879 కోట్లు మాత్రమే. 2014–15లో రూ.13 కోట్లు, 2015–16లో రూ.89 కోట్లు, 2016–17లో రూ.72 కోట్లు, 2017–18లో రూ.108 కోట్లు, 2018–19లో రూ.239 కోట్లు, 2020–21లో రూ.173 కోట్లు, 2021-–22లో రూ.185 కోట్లు ఖర్చు చేశారు.