ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు యువ ఓటర్లే : రాజీవ్ కుమార్

ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు యువ ఓటర్లే : రాజీవ్ కుమార్

94 కోట్లకు పైగా ఓటర్లు ఉన్న మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం గల దేశం. గత సార్వత్రిక ఎన్నిక(2019)ల్లో 67.4 శాతం ఓటింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే ఇది కొంత ఆశాజనకమైన సంఖ్యనే. అయితే మిగతా 30 కోట్ల మంది ఓటర్లను బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకురావడం మన ముందు ఉన్న సవాలు.

దేశంలో 2011 నుంచి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఓటర్లుగా వారి హక్కులు, బాధ్యతల గురించి భారత పౌరులకు అవగాహన కల్పించడం, చైతన్యం తీసుకురావడం. మొదటి రిపబ్లిక్​డేను పురస్కరించుకొని1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం(ఈసీ) ఏర్పాటైంది. రాజ్యాంగ సభ ఆర్టికల్​324 ద్వారా ఈసీకి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే, పనిచేసే రాజ్యాంగ హోదాను కట్టబెట్టింది. రాజ్యాంగ సభ ఎంతో దూరదృష్టితో ఈసీకి స్వయం ప్రతిపత్తిని కల్పించింది. ఈసీ యోగ్యత, నిష్పాక్షికత, విశ్వసనీయతకు ఇప్పటి వరకు జరిగిన17 లోక్​సభ ఎన్నికలు,16 సార్లు జరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, 399 శాసనసభ ఎన్నికలే నిదర్శనం. ప్రస్తుతం 400వ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతుండటం గమనార్హం. దేశంలో ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ వివాదంలో లేవు. వ్యక్తిగతంగా ఎవరైన వేసిన ఎన్నికల పిటిషన్లపై సంబంధిత హైకోర్టులు విచారించి తీర్పులు ఇస్తున్నాయి. ఎన్నికల సంఘం మెరుగైన పనితీరు, నిబద్ధతతో రాజకీయ పార్టీల, దేశ పౌరుల విశ్వాసాన్ని పొందగలిగింది. పటిష్టమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి బలమైన, సమ్మిళిత ఎన్నికల భాగస్వామ్యం చాలా కీలకం. శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సక్రమంగా, విశ్వసనీయంగా జరగాలి. ఇదంతా పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే సాధ్యపడుతుంది. మహాత్మా గాంధీ చెప్పిన ఒక మాట ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. మనం విధులను నిర్వర్తించకుండా వదిలేస్తే, హక్కుల కోసం పరిగెత్తాల్సి వస్తుంది. పౌరులు విధిగా ఓటు వేసినప్పుడే వారి హక్కుల గురించి ప్రశ్నించగలుగుతారు.

స్వచ్ఛంద నమోదుకు అవకాశం

ఓటర్లు పోలింగ్​బూత్​కు రాకపోవడం వెనుక పట్టణీకరణ, యువత ఉదాసీనత, దేశీయ వలసలు వంటి అనేక కోణాలు ఉన్నాయి. పౌరులు స్వచ్ఛందంగా ఓటర్లుగా నమోదు కావడం, ఓటింగ్​కు తరలిరావడం, ఓటు వేసేలా వారిని ఒప్పించడం లాంటి సులభతర పద్ధతుల ద్వారా తక్కువ ఓటింగ్​జరుగుతున్న సెగ్మెంట్లలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. 80 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న రెండు కోట్లకు పైగా ఓటర్లు, 85 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు, 47,500 మంది థర్డ్​జెండర్​వ్యక్తుల కోసం ఈసీ ఇప్పటికే ఆయా వ్యవస్థలను సంస్థాగతీకరించింది. ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధతను చూపుతూ వందేండ్లు దాటి ఓటు హక్కు వినియోగించుకుంటున్న 2 లక్షల మందికి ఇటీవల నేను వ్యక్తిగతంగా లేఖలు రాసి ధన్యవాదాలు తెలిపాను. దేశ సార్వత్రిక మొదటి ఎన్నికల్లో మొదటి ఓటరైన హిమాచల్​ప్రదేశ్ కు చెందిన శ్యామ్​శరణ్​నేగి 2022 నవంబర్​5న చనిపోయారు. ఆ సందర్భంగా ఆయనకు నివాళి అర్పించే అరుదైన అవకాశం నాకు లభించింది. చనిపోయే నాటికి106 సంవత్సరాల వయసు ఉన్న ఆయన ఏ ఒక్కసారి కూడా ఓటు వేయకుండా ఉండలేదు. చివరి వరకు ప్రతి ఎన్నికలో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఆయన నిబద్ధత దేశంలో ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది.

ఓటర్ల హక్కులు

యువ ఓటర్లే భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు. 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వారు తమ ఓటు హక్కు నమోదు చేసుకొని ఓటర్ల జాబితాలో చేరుతున్నారు. ఓటర్లుగా వారి భాగస్వామ్యం ఈ శతాబ్దమంతా ప్రజాస్వామ్య భవిష్యత్తును రూపొందిస్తుంది. ఓటు హక్కును నమోదు చేసుకుంటున్న యువత, ఓటింగ్​లో పాల్గొన్నప్పుడే సరైన పాలనా సేవలు పొందగలరు. అయితే యువత నిత్యం వివిధ మాధ్యమాల్లో నిమగ్నమవుతున్నది. ఓటింగ్​కు​ దూరంగా ఉంటున్న పట్టణ ఓటర్లది అలాంటి పరిస్థితే. ఓటు హక్కు వినియోగంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈసీ ప్రతి పోలింగ్​స్టేషన్​లో తాగునీరు, విద్యుత్, ర్యాంపులు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నది. ఓటింగ్​సందర్భంగా స్కూళ్లలో మెరుగుపరుస్తున్న సౌకర్యాలు శాశ్వతంగా కొనసాగేందుకు కృషి చేస్తున్నది.  ప్రజాస్వామ్యంలో ఓటర్లకు తాము ఓటు వేయబోయే అభ్యర్థుల నేపథ్యం గురించి తెలుసుకునే హక్కు ఉన్నది. ఇందులో భాగంగానే అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఏవైనా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటే వాటిని వార్తాపత్రికలో తెలియజేయాలి. ప్రతి రాజకీయ పార్టీ తన మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలకు సంబంధించి హామీలు ఇచ్చే హక్కు ఎలా కలిగి ఉన్నదో, ప్రభుత్వ ఖజానాపై వాటి ప్రభావం, వారికి ఉండే ఆర్థికపరమైన చిక్కులను తెలుసుకునే హక్కు ఓటర్లకూ సమానంగా ఉంటుంది. 

హింసకు తావులేని ఎన్నికల దిశగా..

కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సంబంధిత హింస ఓటర్ల స్వేచ్ఛపై ప్రభావం చూపుతున్న పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం ఉండకూడదు. ఎన్నికల్లో ధనబలాన్ని అరికట్టడం పెద్ద సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మిగిలిపోయింది. ఓటర్ల ప్రలోభాలు కొన్ని రాష్ట్రాల్లో తీవ్రంగా కనిపిస్తున్నాయి. పటిష్ట నిఘాతో ఇటీవల జరిగిన కొన్ని ఎన్నికల్లో రికార్డు స్థాయిలో డబ్బు, ఇతరాలను ఈసీ సీజ్ చేసింది. ప్రజాస్వామ్యంలో చిత్తశుద్ధి గల, అప్రమత్తమైన ఓటర్లను ఎవరూ ప్రలోభ పెట్టలేరు. సి–విజిల్​వంటి మొబైల్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఘటనలను నివేదించడానికి ప్రజలకుఎంతో సహాయపడతాయి. తద్వారా ఎన్నికల పరిశీలకులు సత్వర చర్యలు తీసుకోగలుగుతారు. 

ఓటింగ్​ ప్రభావం పాలనపై ఉంటుంది

విశ్వసనీయమైన ఎన్నికల ఫలితాల ద్వారానే ప్రజాస్వామ్యం తన స్థానాన్ని నిలుపుకోగలదు. సోషల్ మీడియాలో నకిలీ వార్తల ప్రచారం ఎన్నికల నిర్వహణలో సవాలుగా మారింది. ప్రతి ఎన్నికలకు ముందు వందల కొద్దీ నకిలీ మీడియా వీడియోలు, కంటెంట్ ప్రచారంలో ఉంటున్నది. ముఖ్యంగా అవి కీలక ఎన్నికల డొమైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై దాడి చేస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తమ అపారమైన ఆర్టిఫిషియల్​ఇంటెలిజెన్స్ సామర్థ్యాల ద్వారా కనీసం, అటువంటి తప్పుడు సమాచార ప్రయత్నాలను గుర్తించాలనే అంచనాలు పెరుగుతున్నాయి. ఇలాంటి ఫేక్​న్యూస్, సమాచారం ఎన్నికల నిర్వహణ సంస్థల పనిని మరింత కష్టతరం చేస్తాయని గ్రహించి, స్వీయ-దిద్దుబాటు అమలులోకి రావాల్సిన అవసరం ఉన్నది. 13వ నేషనల్​ఓటర్స్​డే ‘నథింగ్​లైక్​ఓటింగ్, ఓట్​ఫర్​ష్యూర్”అనే థీమ్​తో నిర్వహించుకుంటున్నాం. ఇది ఈసీ ఎన్నికలను భాగస్వామ్య, ఓటరు ఫ్రెండ్లీ, నైతికంగా నిర్వహించడాన్ని ప్రతిబింబిస్తుంది. పౌరులు తమ కర్తవ్యంలో భాగంగా ఓటరుగా గర్వపడుతున్నప్పుడు, దాని ప్రభావం పాలనా స్థాయిపై కచ్చితంగా కనిపిస్తుంది. దేశ పౌరులందరికీ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు.

-రాజీవ్ కుమార్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇండియా