ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో శ్రీలంకలో క్రికెట్ సిరీస్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే క్రికెట్ దేశాలను బతిమాలి లంక బోర్డు ద్వైపాక్షిక సిరీస్లు నిర్వహిస్తోంది. ఇటీవలే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లతో పాటు టీ20,వన్డే సిరీస్ను విజయవంతంగా పూర్తి చేసింది. అయితే ఆర్థిక సంక్షోభం కారణంగా అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వీడారన్న విషయం తెలుసుకున్న ప్రజలు ఆందోళనల చేపట్టారు. ఈ నిరసనలతో లంక ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఈ నేపథ్యంలో త్వరలో శ్రీలంకలో పాకిస్థాన్ సిరీస్తో పాటు ఆసియాకప్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది.
బంగ్లాదేశ్కు ఆసియాకప్..
లంకలో నెలకొన్న తాజా పరిస్థితుల కారణంగా ప్రస్తుతం అక్కడ క్రికెట్ సిరీస్ లు, ఆసియాకప్ నిర్వహించడం సాధ్యంకాకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ వేదికను మార్చేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రయత్నాలు చేస్తోంది. ఆసియా కప్ను శ్రీలంక నుంచి బంగ్లాదేశ్‌కు తరలించాలనే యోచనలో ఉంది. ఇప్పటికే బంగ్లా బోర్డుతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఆసియాకప్ ఆగస్టు 27 నుంచి టీ20 ఫార్మాట్‌లో జరగనుంది.
ఆసియాకప్ నిర్వహణపై గంగూలీ..
ఆసియాకప్ టోర్నీకి ఇంకా టైముందని..ప్రస్తుతం పరిస్థితుల్లో ఆ టోర్నీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అన్నారు. శ్రీలంకలో ఆస్ట్రేలియా ఇప్పటికే క్రికెట్ ఆడిందని..లంక జట్టు బాగా రాణించిందని కొనియాడారు. అయితే టోర్నీకి ఇంకా సమయం ఉన్నందున వెచ్చిచూద్దామన్నారు.
లంకుకు చేరిన పాకిస్థాన్
శ్రీలకంతో రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు పాక్ లంకకు చేరుకుంది. ఈనెల 16న నుంచి గాలేలో తొలి టెస్టు జరగనుంగా..ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్ ప్రారంభించాయి. అయితే లంకలో ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో..కఠిన ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. దీంతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం కష్టమే. దీంతో పాకిస్థాన్‌తో సిరీస్ విషయంలో లంక బోర్డు కీలక నిర్ణయం తీసుకునే ఛాన్సుంది. అయితే ఈ సిరీస్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
