తెలంగాణకు కృష్ణా నీళ్లు దూరమైతున్నయ్

తెలంగాణకు కృష్ణా నీళ్లు దూరమైతున్నయ్

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంతో కృష్ణా జలాలు తెలంగాణ రాష్ట్రానికి దూరం అవుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్​కు 4 కిలోమీటర్ల దూరంలో సంగమేశ్వరం వద్ద 730 అడుగుల లోతు నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున లిఫ్టు చేస్తే తెలంగాణకు తీరని ముప్పు వాటిల్లుతుంది. 250 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పుతో పంపు హౌస్​ తవ్వారని కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డ్(కేఆర్ఎంబీ) నిపుణుల కమిటీ పరిశీలనలో తేలింది. మొత్తం 10 టన్నెల్స్ తవ్వగా ఒక్కో టన్నెల్ పొడవు 35 నుంచి 50 మీటర్ల వరకు ఉందని, పంపు హౌస్​లో ఏర్పాటు చేసే మోటర్లు రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తాయని కమిటీ వెల్లడించింది. నీటిని ఎత్తిపోసే డెలివరి సిస్టర్న్​కు సంబంధిత ఎర్తు పనిని పూర్తి చేశారని, శ్రీశైలం ప్రధాన కుడికాల్వకు కలిపే 500 మీటర్ల పొడవైన లింకు కాల్వ పనులు కూడా పూర్తయ్యాయని పేర్కొంది. ఈ ప్రాజెక్టు డీపీఆర్ తో మెజార్టీ పని జరిగిందని తేల్చింది. ఇంత జరుగుతున్నా కూడా తెలంగాణ సర్కారు స్పందించకపోవడంతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు. ప్రాజెక్టులో 834 అడుగుల ఎగువన 161 టీఎంసీలు.. దిగువన 54 టీఎంసీలు నీరు ఉంటుంది. పర్యావరణ పరిరక్షణకు ప్రాజెక్టులో 16 టీఎంసీల నీరు ఎప్పుడూ ఉండాల్సిందే. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ సామర్థ్యం 13,000 క్యూసెక్కులు కాగా రాయలసీమ ఎత్తిపోతల కాల్వ సామర్థ్యం 80,000 క్యూసెక్కులని నిపుణుల కమిటీ పేర్కొంది. 730 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని మళ్లించటానికి ఏపీ పూనుకుంది. రాయలసీమ ఎత్తిపోతల కాల్వల సామర్థ్యం పెంచడంతోపాటు అన్ని ప్రాజెక్టులకు కలిపి శ్రీశైలం నుంచి రోజుకు 17.5 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉందని తెలంగాణ ఇంజనీర్లు చెబుతున్నారు. దీంతో కృష్ణా బేసిన్​లోని తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు ఎనలేని నష్టం కలగనుంది. హైదరాబాద్​కు కూడా మంచినీటికి తిప్పలు తప్పవు. 

1,224 టీఎంసీలు వాడుకున్న ఏపీ

శ్రీశైలం ఎగువన పోతిరెడ్డిపాడు వద్ద విద్యుత్ ఉత్పత్తి పేరుతో 4,500 క్యూసెక్కుల నీటిని ఏపీ వాడుకుంటోంది. ఆ తర్వాత తెలుగు గంగ పేరుతో 4 తూముల ద్వారా రోజుకు 11,500 క్యూసెక్కుల నీటిని తరలిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్​ సీఎంగా ఉన్నప్పుడు 2004లో శ్రీశైలం కనీస నీటిమట్టాన్ని 834 అడుగుల నుంచి 854 అడుగులకు పెంచారు. తదుపరి 2006 జనవరిలో పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ సామర్థ్యాన్ని 11,500 నుంచి 44,000 క్యూసెక్కులకు పెంచుతూ జీవో ఇచ్చారు. కాల్వ వెడల్పు పని పూర్తి అయిన తర్వాత పాత తూములను మూసివేస్తామన్నారు. అయినా ఇప్పటికీ పాత తూములు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 60,000 క్యూసెక్కుల నీరు వాడుకుంటున్నారు. 2004 నుంచి 2020 వరకు 1,224 టీఎంసీలను పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ వినియోగించుకోగా 55 టీఎంసీలు మాత్రమే తెలంగాణ వాడుకుంది. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి 6,400 క్యూసెక్కులు ఏపీ వాడుకుంటోంది. పూల సుబ్బయ్య ప్రాజెక్టు నుంచి కూడా నీటిని పెంచుకుంది.

పున:పంపిణీ చేయాలంటున్న కర్నాటక

ఉమ్మడి రాష్ట్రం మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి కర్నాటక ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతూ మిగులు జలాల పున:పంపిణీ జరగాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. కేంద్రం 2004 జూన్​లో జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్​ను ఏర్పాటు చేసింది. రీజనరేషన్​తో కలిపి 2,130 టీఎంసీల కంటే పైన నీటి లభ్యత ఉంటే అందులో మహారాష్ట్ర 25 శాతం, కర్నాటక 50 శాతం, ఉమ్మడి ఏపీ 25 శాతం వాడుకోవాలని బచావత్ తీర్పులో పేర్కొన్నది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2010 డిసెంబర్ 30న తీర్పు ప్రకటించింది. అంతర్జాతీయ జల విధానానికి భిన్నంగా 65 శాతం విశ్వసనీయతతో నికర జలాలను అదనంగా నిర్థారించి కేటాయించింది. మహారాష్ట్ర, కర్నాటక కృష్ణా బేసిన్​లో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతి కోసం ట్రిబ్యునల్ ముందుంచగా ఉమ్మడి రాష్ట్రం కృష్ణా బేసిన్​లో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులు, పెన్నా బేసిన్​లో ఉన్న రాయలసీమ ప్రాజెక్టుల లిస్టులు ఇచ్చి పెన్నా బేసిన్​ ప్రాజెక్టుల అనుమతి కోసం వాదించింది. ట్రిబ్యునల్ కర్నాటక, మహారాష్ట్రకు అనుమతిచ్చి ఉమ్మడి ఏపీకి నిరాకరించింది. నిర్మాణమే జరగని ఆర్డీఎస్​ కు 4 టీఎంసీలు రాయలసీమకు కేటాయించింది.

మన వాటా మనం వాడుకోలేకపోతున్నాం..

కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 69 శాతం ఉండగా ఏపీలో 31 శాతమే ఉంది. కృష్ణా నదికి ఎగువన తెలంగాణ.. దిగువన రాయలసీమ ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల నికర జలాలు పూర్తిస్థాయి కేటాయింపులు జరిగే వరకు 299 టీఎంసీలు తెలంగాణ, 512 టీఎంసీలు ఏపీ వినియోగించుకోవాలన్న బోర్డు ప్రతిపాదనకు.. తెలంగాణ ప్రభుత్వం తలొగ్గటం దారుణంగా ఉంది. ఏపీ ప్రభుత్వం ఏటా సగటున 650 టీఎంసీలు వినియోగించుకొని మంచినీటి కొరత పేరుతో అదనపు నీటిని రాబట్టుకుంటోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం తనకు కేటాయించిన నీటిని కూడా వాడుకోలేని స్థితికి దిగజారింది. మిగిలిన నీటిని వచ్చే సంవత్సరం వినియోగానికి అనుమతి కోరితే ఏపీ ప్రభుత్వం మోకాలడ్డింది. తెలంగాణకు చెందిన ఎస్ఎల్బీసీ, రాయలసీమకు చెందిన ఎస్ఆర్బీసీలకు 1983లోనే మంజూరీ ఇచ్చారు. ఎస్ఆర్బీసీ ఎప్పుడో పూర్తయి వినియోగంలోకి వచ్చింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ 2005లో ప్రారంభించారు. 2008లో పూర్తి చేస్తామన్నారు. 53 కిలోమీటర్ల టన్నెల్​కు గానూ 43 కిలోమీటర్ల సొరంగం పూర్తయింది. 10 కిలోమీటర్లు మాత్రం ఏండ్ల తరబడి పెండింగ్ లో ఉంది. 2021లోనైనా ఈ టన్నెల్​ను పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. దక్షిణ తెలంగాణ సాగునీటికి ప్రమాదం ముంచుకొస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. భీమా ప్రాజెక్టుకు 20 టీఎంసీల నికర జలాలు కేటాయింపు ఉన్నా పూర్తిస్థాయిలో పనులు జరగలేదు.

జూరాల ముంపు గ్రామాలను తెలంగాణలో కలపలె

మిగులు జలాలు ఉన్నది 180 టీఎంసీలు మాత్రమే. అయితే 305 టీఎంసీల వినియోగం కోసం రెండు రాష్ట్రాలు నిర్మాణాలు చేపట్టాయి. జూరాల ప్రాజెక్టుకు 17.84 టీఎంసీల సామర్థ్యంతో బచావత్ ట్రిబ్యునల్ 1975లో అనుమతి ఇచ్చింది. మొదట నిర్మించిన వారు తూముల సైజు తగ్గించి 11.35 టీఎంసీలకు కుదించారు. 9.57 టీఎంసీల నీటి నిల్వ కనీసం ఉండాలి. ఇందులో కర్నాటకకు చెందిన 4 గ్రామాలు మణిగడ్డ, అగ్రహర, కర్వకర్దు, బుడిగపాడు ముంపునకు గురవుతున్నాయి. దేశంలో ఏ ప్రాజెక్టు కింద ముంపునకు గురైన ప్రాంతాలు ఆయా రాష్ట్రాల పరిధిలోనే ఉన్నాయి. కానీ పోలవరం గ్రామాలను ఏకంగా కేంద్రం ఏపీలో కలిపింది. జూరాల ముంపు గ్రామాలను గానీ, శ్రీరాంసాగర్ ముంపు గ్రామాలను గానీ, ప్రాణహిత - చేవెళ్ల ముంపు ప్రాంతాలను గానీ తెలంగాణలో కలపలేదు. ఆర్డీఎస్ ప్రాజెక్టు 87,500 ఎకరాల ఆయకట్టు కలిగి ఉంది. 15.90 టీఎంసీల నికర జలాల కేటాయింపు ఉంది. అయితే 30 వేల ఎకరాలకు మాత్రమే లింకు కాల్వల ద్వారా నీరందుతోంది. తుమ్మిళ్ల ప్రాజెక్టు ద్వారా మిగిలిన ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. కానీ అది ఎప్పటికి పూర్తి అవుతుందో ఎవరికీ తెలియదు. నారాయణపేట–-కోడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైంది. నిధుల కేటాయింపు కూడా జరిగింది. పక్క రాష్ట్రాలు కూడా అభ్యంతరం తెలపలేదు. అయినా ఆ ప్రాజెక్టును ఎత్తివేశారు.

కేంద్ర ప్రభుత్వం కూడా 7 సంవత్సరాలుగా కృష్ణా నీటి సమస్య పరిష్కరించకుండా కాలయాపన చేసింది. ఇప్పుడు గోదావరి, కృష్ణా నదులను తన పరిధిలోకి తీసుకుంది. కృష్ణా రివర్ బోర్డు కూడా రాష్ట్రాల నుంచి వస్తున్న ఫిర్యాదులు పరిష్కరించకుండా మిన్నకుండి పోయింది. ఫలితంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను సైతం ఏపీ లెక్క చేయటం లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉంది.
- బొంతల చంద్రారెడ్డి,
ఉపాధ్యక్షుడు, తెలంగాణ రైతు సంఘం