
- సర్క్యులేషన్‌లో ఈ నోట్లు తక్కువగా ఉండడం, యూపీఐ, ఈ‑కామర్స్ విస్తరించడమే కారణం
- వ్యవస్థలో సరిపడినంతగా చిన్న నోట్లు ఉన్నాయంటున్న ఎకానమిస్ట్‌లు
- బ్యాంక్ డిపాజిట్ రేట్లు పెరగకపోవచ్చని వెల్లడి
బిజినెస్ డెస్క్, వెలుగు: రూ.2 వేల నోట్లను ఆర్‌బీఐ విత్‌డ్రా చేసుకోవడంతో ఎకానమీపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే చర్చలు పెరిగాయి. ఆర్థిక వేత్తలు, ఎనలిస్ట్‌లు మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. రూ.2 వేల నోట్ల విత్‌డ్రా చేసుకోవడం వలన ఏర్పడిన గ్యాప్‌ను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) భర్తీ చేస్తుందని స్టేట్ బ్యాంక్ చైర్మన్ దినేష్ ఖారా అభిప్రాయపడ్డారు. ‘జీడీపీలో సుమారు 63–64 శాతం వాటాకు యూపీఐ, కరెన్సీ సపోర్ట్ ఉంది. ఇందులో 50–51 శాతం జీడీపీకి యూపీఐ కంట్రిబ్యూట్ చేస్తోంది. మిగిలిన 13 శాతాన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తోంది. రూ.2 వేల నోట్ల విత్‌డ్రా గురించి మాట్లాడుకుంటే, దీని ప్రభావం ఎకానమీపై తక్కువగా ఉంటుంది. డీమానిటైజేషన్‌కు సాయంగా రూ.2,000 నోట్లను 2016 లో ప్రభుత్వం తీసుకొచ్చింది. మొదట్లో సర్క్యులేషన్‌లో ఉన్న కరెన్సీలో రూ.2 వేల నోట్ల వాటా 50 శాతంగా ఉండేది. ప్రస్తుతం ఈ నెంబర్ 10.8–11 శాతానికి తగ్గింది. ఈ తగ్గిన వాటాను యూపీఐ భర్తీ చేసింది’ అని వెల్లడించారు. కాగా, రూ. 2 వేల నోట్లను సర్క్యులేషన్ నుంచి వెనక్కి తీసుకుంటామని ప్రకటించినప్పటికీ, ఇవి లీగల్ టెండర్‌గా కొనసాగుతాయని ఆర్‌బీఐ పేర్కొంది. బ్యాంక్‌లు తక్షణమే రూ.2 వేల నోట్లను ఇష్యూ చేయడం ఆపేస్తాయని, బ్యాంక్‌లు, ఆర్‌బీఐ బ్రాంచుల దగ్గర వీటిని చిన్న డినామినేషన్ నోట్లతో ఈ ఏడాదిసెప్టెంబర్ 30 లోపు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఎక్స్చేంజి చేసుకోవడానికి లిమిట్ ఉన్నా, డిపాజిట్ చేసుకోవడానికి ఎటువంటి లిమిట్ లేదు. లీగల్ టెండర్‌గా కొనసాగుతుంది కాబట్టి సెల్లర్లు కచ్చితంగా రూ.2 వేల నోటును అంగీకరించాలి.
పెరగనున్న గోల్డ్, లగ్జరీ ప్రొడక్ట్‌ల కొనుగోళ్లు!
చిన్న నోట్లు సరిపడినంత అందుబాటులో ఉండడం వలన రూ. 2 వేల నోట్ల విత్‌డ్రా ప్రభావం ఎకానమీపై తీవ్రంగా ఉండదని ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ రూప రేగె నిట్సుర్ పేర్కొన్నారు. అంతేకాకుండా గత 6–7 ఏళ్లుగా డిజిటల్ ట్రాన్సాక్షన్లు, ఈ–కామర్స్ బాగా విస్తరించాయని గుర్తు చేశారు. క్వాంట్‌ఎకో రీసెర్చ్ ఎకానమిస్ట్ యువికా సింఘాల్ మాత్రం సమీప కాలంలో చిన్న బిజినెస్‌లకు, క్యాష్ వాడకం ఎక్కువగా ఉన్న అగ్రికలర్చ్, కన్‌స్ట్రక్షన్ సెక్టార్లకు ఇబ్బంది తప్పదని అన్నారు. రూ.2,000 నోట్లు హోల్డ్ చేసే వాళ్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం కంటే గోల్డ్, లగ్జరీ గూడ్స్ వంటి డిస్క్రిషనరీ ప్రొడక్ట్‌లను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ప్రొడక్ట్‌ల కొనుగోళ్లు ఊపందుకుంటాయని పేర్కొన్నారు. రూ. 2 వేల నోట్లు తిరిగి బ్యాంకులకు రానుండడంతో క్యాష్ సర్క్యులేషన్ తగ్గుతుందని, బ్యాంకుల దగ్గర లిక్విడిటీ పెరగడం చూస్తామని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎకానమిస్ట్ మాధవి అరోరా అన్నారు. బ్యాంకుల డిపాజిట్లు పెరుగుతాయని, డిపాజిట్ల రేట్లను పెంచాలనే ఒత్తిడి వీటిపై తగ్గుతుందని ఇక్రా పేర్కొంది.
బ్యాంక్ షేర్లకు బూస్ట్
సోమవారం మార్కెట్‌లు యథావిధిగానే నడుస్తాయని, ఆర్‌బీఐ నిర్ణయం వలన ఏదైనా రియాక్షన్ ఉన్నా, కొన్ని ఇండెక్స్‌లలోనే కనిపిస్తుందని ఎనలిస్టులు చెబుతున్నారు. సర్క్యులేషన్ నుంచి రూ.2 వేల నోట్లు భారీగా తగ్గాయని, చాలా మంది ప్రజలు డిజిటల్ పేమెంట్ విధానాల వైపు మరలుతున్నారని ఐడీబీఐ క్యాపిటల్ రీసెర్చ్ హెడ్ ఏకే ప్రభాకర్ అన్నారు. ఆర్‌బీఐ నిర్ణయాన్ని మార్కెట్ పెద్దగా పట్టించుకోదని వివరించారు. మరికొంత మంది ఎనలిస్టులు మాత్రం ఆర్‌బీఐ నిర్ణయంతో బ్యాంక్ షేర్లకు డిమాండ్ పెరుగుతుందని చెబుతున్నారు. రూ.2 వేల నోట్లను విత్‌డ్రా చేసుకోవడం వలన బ్యాంకింగ్ సెక్టార్‌లో లిక్విడిటీ పెరుగుతుందని, ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు టైర్ 2, 3 సిటీల నుంచి రూ.2 వేల నోట్ల డిపాజిట్లు పెరుగుతాయని మోతీలాల్ ఓస్వాల్ టెక్నికల్ ఎనలిస్ట్ చందన్ తపారియా వెల్లడించారు. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ శుక్రవారం 44 వేల లెవెల్ దగ్గర క్లోజవ్వగా, సమీప కాలంలో ఈ ఇండెక్స్ 45 వేలను టచ్ చేస్తుందని, సెప్టెంబర్ చివరి నాటికి 47 వేలకు చేరుకుంటుందని అంచనా వేశారు. పీఎస్‌బీల క్రెడిట్ గ్రోత్ పెరుగుతుందని అన్నారు.