మూడు రోజుల్లోనే మాకు విపరీతమైన సింపతి వచ్చింది : కేటీఆర్

మూడు రోజుల్లోనే మాకు విపరీతమైన సింపతి వచ్చింది : కేటీఆర్
  • ప్రజల విశ్వాసం గెలుచుకుంటం..అది ఎంతో దూరం లేదు: కేటీఆర్
  • ఈ ఓటమి ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది.. మూడు రోజుల్లోనే విపరీతమైన సింపతి వచ్చింది
  • సిరిసిల్లలో పార్టీ కార్యకర్తలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్స్

రాజన్న సిరిసిల్ల, వెలుగు  :  అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ పెద్దపెద్ద హామీలను ఇచ్చిందని.. వాటిని నెరవేర్చే వరకు వెంటపడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్యెల్యే కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన హామీలన్నింటిని ప్రజలకు అందించేందుకు కొట్లాడతామని చెప్పారు. బుధవారం ఆయన సిరిసిల్లలో బీఆర్ఎస్ ఆఫీసులో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు 100 రోజులు నిర్విరామంగా పని చేశారని.. వారి కృషి వల్లే 39 సీట్లు సాధించామని తెలిపారు. రుణమాఫీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ, ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టిస్తం వంటి హామీలు కాంగ్రెస్ ఇచ్చిందని చెప్పారు. ఇవన్నీ ప్రజలు రాసిపెట్టుకున్నరని.. కాంగ్రెస్ పార్టీ ఆ హామీలు నేరవేర్చపోతే ప్రజల తరఫున కొట్లాడుతామన్నారు. ప్రతిపక్ష పాత్రను అద్భుతంగా పోషిస్తామని తెలిపారు.

ప్రజలిచ్చిన ప్రతిపక్ష పాత్ర పోషిస్తం

ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడు రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీకి విపరీతమైన సింపతి వస్తున్నదని కేటీఆర్ అన్నారు. ‘‘అయ్యో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేదా. కేసీఆర్ సీఎంగా లేరా అంటూ మెసేజ్ ల రూపంలో ఫీడ్ బ్యాక్ వస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వారు కూడా వీడియోలు, మెసేజ్ లలో అన్నా ఇట్ల అయిపోయిందని సింపతి వ్యక్తం చేస్తున్నరు” అని చెప్పారు. 39 మంది ఎమ్యెల్యేలను ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘కాంగ్రెస్ హమీలు నేరవేర్చకపోతే ప్రజలు గమనిస్తరు. మా పని మేం చేసుకుంటూ పోతాం. ప్రజలు కాంగ్రెస్ పాలన గురించి ఆలోచన చేస్తరు. త్వరలోనే మళ్లీ మేం ప్రజల విశ్వాసాన్ని చూరగొంటం, అది ఎంతో దూరంలో లేదు” అని అన్నారు. ఓటమి స్వల్పకాల విరామం మాత్రమే అన్నారు. కొంత నిరాశ ఉన్న మాట వాస్తమే అయినా ఓటమికి భయపడేది లేదని చెప్పారు. సిరిసిల్లలో తాను ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల్లో మద్యం, మనీ పంచలేదని తెలిపారు. తన మాటను గౌరవించి భారీ మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటానన్నారు. సిరిసిల్ల ఎమ్యెల్యేగా గర్వపడుతున్నానని, నియోజకవర్గానికి కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలన్నారు.