Kitchen Telangana :నూనె లేకుండా  రెసీపీస్..చికెన్ ఫ్రై ,పెసల కూర,అటుకులు – ఆలు స్నాక్స్.. తింటే టేస్ట్ అదిరిపోద్ది..!

Kitchen Telangana :నూనె లేకుండా  రెసీపీస్..చికెన్ ఫ్రై ,పెసల కూర,అటుకులు – ఆలు స్నాక్స్.. తింటే టేస్ట్ అదిరిపోద్ది..!

పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం తినే తిండిలో నూనెతో చేసిన వంటలే ఎక్కువ. నూనె ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా... వాడకం తగ్గించడం మాత్రం కష్టమే! కానీ, ఒక్క చుక్క నూనె కూడా వాడకుండానే టేస్టీ టేస్ట్ రెసిపీస్ వండుకోవచ్చు.  ఇప్పుడు అలాంటి రెసిపీస్​ గురించి తెలుసుకుందాం. . !

 నూనె లేకుండా చికెన్ ఫ్రై తయారీకి కావాల్సినవి

  • చికెన్ - అర కేజీ 
  • కొబ్బరి ముక్కలు - ఒక కప్పు
  • ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి - ఒక్కోటి చొప్పున
  • వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది
  • అల్లం- కొద్దిగా
  • కారం - రెండు టీ స్పూన్స్
  • మిరియాలు - ఒక టీ స్పూన్
  • ధనియాలు, జీలకర్ర,సోంపు - ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున
  • మసాలా పొడి - ఒక టీ స్పూన్
  • ఉప్పు - సరిపడా
  • కరివేపాకు - కొన్ని రెబ్బలు
  • కొత్తిమీర - ఒక కట్ట

నూనె లేకుండా చికెన్​ ఫ్రై తయారీ విధానం

మిక్సీ జార్ లో కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా పట్టి వడకట్టాలి. అదే మిక్సీ జార్లో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు, మసాలా పొడి, ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, వెల్లుల్లి, అల్లం వేసి మెత్తగా చేయాలి.

తరువాత ఒక గిన్నెలో శుభ్రంగా కడిగిన చికెన్ తీసుకుని అందులో ఉప్పు, కారం, పసుపుతో పాటు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసి బాగా కలపాలి. కావాలనుకుంటే నిమ్మరసం కలపొచ్చు. అరగంట సేపు ఫ్రిజ్​ లో పెట్టాలి. తరువాత స్టవ్​ పై పాన్ పెట్టి కొబ్బరిపాలు పోయాలి.

ఇవి కొంచెం వేడెక్కాక మసాలా కలిపిన చికెన్ వేయాలి. గిన్నెపై మూత పెట్టి పది, పదిహేను నిమిషాలు ఉడికించాలి. మధ్యమధ్యలో కూరను కలపాలి. చికెన్ బాగా ఫ్రై అయ్యేంతవరకూ వేయించి చివర్లో కరివేపాకు, కొత్తిమీరతో  గార్నిష్ చేస్తే టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ.

నూనె లేకుండా పెసల కూర తయారీకి కావాల్సినవి

  • మొలకెత్తిన పెసలు - ఒక కప్పు
  • ఉల్లిగడ్డ తరుగు - ఒకకప్పు
  • టొమాటో ముక్కలు - అర కప్పు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
  • ధనియాల పొడి - ఒక టీ స్పూన్
  • పచ్చిమిర్చి - ఒకటి
  • పసుపు - కొద్దిగా
  • ఉప్పు - సరిపడా

నూనె లేకుండా పెసల కూర  తయారీ విధానం 

కుక్కర్ గిన్నె కొంచెం వేడెక్కాక ఉల్లిగడ్డ తరుగు వేసి వేగించాలి. ఉల్లిగడ్డ ముక్కలు కాస్త రంగు మారాక టొమాటో, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి. తరువాత మొలకెత్తిన పెసలు, ధనియాల పొడి, అర కప్పు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టాలి.

రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేయాలి. కూరలో నీళ్లు ఉంటే చిన్నమంటపై నీళ్లుపోయేవరకు ఉంచాలి. ఈ పెసల కూర తింటే హై ప్రొటీస్ ఫుడ్ తిన్నట్టే. ఇది చపాతీ, పరాటాల్లోకి బాగుంటుంది.

నూనె లేకుండా  అటుకులు - ఆలు స్నాక్స్ తయారీకి కావాల్సినవి

  • అటుకులు - ఒక కప్పు
  • ఆలుగడ్డ - రెండు
  • పెరుగు - ఒక టీ స్పూన్
  • ఉల్లిగడ్డ తరుగు - పావు కప్పు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
  • కారం, జీలకర్ర - ఒక్కోటి అర టీ స్పూన్ చొప్పున
  • ధనియాల పొడి - అర టీ స్పూన్
  • పసుపు - కొద్దిగా
  • ఉప్పు- తగినంత
  • పచ్చిమిర్చి - ఒకటి
  • కొత్తిమీర - పావు కప్పు

నూనె లేకుండా  అటుకులు - ఆలు స్నాక్స్ తయారీ విధానం

ఒక గిన్నెలో అటుకులు, అర కప్పు నీళ్లు పోసి ఐదు నిమిషాలు నానబెట్టాలి. అలాగే ఆలుగడ్డలను ఉడికించి, ముద్దలా చేయాలి.

తరువాత ఒక గిన్నెలో అటుకులు, ఆలుగడ్డ ముద్ద, పెరుగు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని ఉండలు చేయాలి. లేదంటే కట్​ లెట్స్​ లా కూడా చేసుకోవచ్చు. వీటిని వేడి చేసిన పాన్​ మీద పెట్టి, మూత పెట్టాలి.

రెండు వైపులా దోరగా వేగించాలి. వేడివేడిగా టొమాటో సాస్​ తో  వీటిని కలిపి తింటే ఆ టేస్టే వేరు.