పాప్ సంగీత సామ్రాజ్యానికి తిరుగులేని రారాజుగా.. దశాబ్దాల పాటు తన వేళ్లపై ఆడించిన ఏకైక ఛాంపియన్ మైఖేల్ జాక్సన్ . ఆయన మరణించి ఏళ్ళు గడుస్తున్నా, నేటికీ ఆ 'మూన్ వాక్' క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు అదే లెజెండరీ స్టార్ జీవిత గాథను వెండితెరపై ఆవిష్కరిస్తూ తెరకెక్కిన చిత్రం ‘మైఖేల్’ (Michael). ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ 'మైఖేల్' బయోపిక్ ఫైనల్ ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
అచ్చుగుద్దినట్టు మైఖేల్..
ఈ చిత్రంలో అతిపెద్ద ఆకర్షణ మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్. ట్రైలర్లో ఆయన బాడీ లాంగ్వేజ్, ఆ సిగ్నేచర్ డ్యాన్స్ మూమెంట్స్, లుక్ చూస్తుంటే సాక్షాత్తూ మైఖేల్ జాక్సనే మళ్ళీ పుట్టి వచ్చారా? అన్నంతగా ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా ‘మూన్ వాక్’ చేసేటప్పుడు జాఫర్ చూపించిన ఈజ్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. కేవలం మేకప్ వల్ల మాత్రమే కాకుండా, మైఖేల్ ఆత్మను తన నటనలో ప్రతిబింబించిన తీరు చూస్తుంటే అచ్చం మైఖేల్ జాక్సన్ లా అనిపిస్తుంది.
తెరవెనుక కథ!
దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా ఈ చిత్రాన్ని కేవలం విజయగాథలా కాకుండా, మైఖేల్ జీవితంలోని చీకటి కోణాలను కూడా స్పృశించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ‘బీట్ ఇట్’, ‘థ్రిల్లర్’, ‘బిల్లీ జీన్’ వంటి గూస్బంప్స్ తెప్పించే పాటల చిత్రీకరణ అద్భుతంగా ఉంది. బాల్యంలో తండ్రి వల్ల పడ్డ ఇబ్బందులు, ప్రపంచం తనను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు అనుభవించిన వేదన, కెరీర్ పీక్స్‌లో ఎదుర్కొన్న వివాదాలను దర్శకుడు ఎంతో హృద్యంగా చూపించారని తెలుస్తోంది. ఆస్కార్ విజేత గ్రాహమ్ కింగ్ నిర్మించిన ఈ సినిమాలో కోల్మన్ డొమింగో, నియా లాంగ్, మైల్స్ టెల్లర్ వంటి హాలీవుడ్ హేమాహేమీలు కీలక పాత్రల్లో మెరిశారు.
►ALSO READ | LIK Movie Review : 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీ టాక్ ఎలా ఉంది? ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మరో హిట్ పడినట్లేనా!
ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్
ఈ సినిమా కేవలం సంగీత ప్రియులకే కాదు, ఒక మనిషి సున్నా నుండి శిఖరానికి ఎలా ఎదిగాడో తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. సాంకేతికంగా అత్యున్నత విలువలతో, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. తెలుగు ప్రేక్షకుల కోసం కూడా భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
