
- అరుదైన సర్జరీతో బయటకు తీసిన ఢిల్లీ డాక్టర్లు
- నిత్యం జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తీసుకుంటే డేంజర్
- పిత్తాశయం కేన్సర్‌కు దారితీస్తుందని వార్నింగ్
న్యూఢిల్లీ: సరదాగా బయటికి వెళ్లినా.. ఉద్యోగరీత్యా టైం దొరక్కపోయినా చాలా మంది అప్పటికప్పుడు ఆకలి తీర్చుకోవడం కోసం జంక్ ఫుడ్ తింటుంటారు. పిల్లలు అయితే.. ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, నూడుల్స్ ఇలా జంక్ ఫుడ్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు. కానీ ఇది చాలా డేంజర్. ఓ మహిళ ఇలాగే.. రోజూ జంక్ ఫుడ్ తిని ప్రమాదంలో పడింది. ఆమె గాల్ బ్లాడర్(పిత్తాశయం)లో ఏకంగా 1500 రాళ్లు తయారయ్యాయి.
ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగినికి ప్రతిరోజూ జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంది. కొన్ని నెలలుగా అలాంటి ఫుడ్ తినడంతో ఆమెకు కడుపు ఉబ్బరం స్టార్ట్ అయ్యింది. బాగా బరువు పెరిగింది. దీంతో సమస్య పరిష్కారం కోసం కొన్ని నెలల పాటు యాంటాసిడ్ మందులు తీసుకుంది. ఫలితంగా ఆ మహిళకు వాంతులు, విరేచనాలు స్టార్ట్ అయ్యాయి. పొత్తికడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది.
దాంతో ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించింది. ఆయన అల్ట్రాసౌండ్ చేయించుకోవాలని సలహా ఇచ్చాడు. అల్ట్రాసౌండ్ తర్వాత మహిళ గాల్ బ్లాడర్ నిండా రాళ్లను గుర్తించి డాక్టర్ షాక్ అయ్యాడు. ట్రీట్మెంట్ కోసం ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ కు రిఫర్ చేయగా ఆమె వెళ్లి జాయిన్ అయింది. ఆ హాస్పిటల్‌లోని డాక్టర్లు పిత్తాశయంలోని రాళ్లను తొలగించడానికి ల్యాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అనే అతి తక్కువ హానికర ప్రక్రియతో అరుదైన సర్జరీ నిర్వహించారు. మొత్తం 1500 రాళ్లను బయటకు తీసివేసి ఆమె ప్రాణాలను కాపాడారు.
జంక్ ఫుడ్డే కారణం: డాక్టర్లు
మహిళ గాల్ బ్లాడర్ లో 1500 రాళ్లును తొలగించిన ఢిల్లీ డాకర్లు.. జంక్ ఫుడ్ వల్ల కలిగే అనర్థాల గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటేనే గాల్ బ్లాడర్ లో రాళ్లు ఏర్పడతాయని చెప్పారు. రెండు భోజనాల మధ్య గ్యాప్ ఎక్కువగా వచ్చినా..ఎక్కువ ఉపవాసాలు ఉన్నా ఈ ప్రమాదం వస్తుందని తెలిపారు.
రాళ్ల సైజు చిన్నగా ఉన్నప్పటికీ వాటితో కామెర్లు, ప్యాంక్రియాటైటిస్ వచ్చే ముప్పు కూడా ఉంటుందన్నారు. పెద్ద రాళ్లను చాలా కాలం పాటు పిత్తాశయంలో చికిత్స చేయకుండా వదిలేస్తే పిత్తాశయ కేన్సర్‌కు దారితీయవచ్చని పేర్కొన్నారు.