
చెన్నై: రాజకీయాలపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా నేతలు, పార్టీలను కొంతమంది ఆరాధిస్తుంటారు. ఎన్నికల్లో తాము ఇష్టపడే పార్టీ గెలిస్తే ఫలానా చెల్లిస్తామని మొక్కుకోవడమూ కామనే. అలాగే ఆయా పార్టీలు గెలిచాక మొక్కు తీర్చుకోవడం చూసుంటాం. కానీ ఇక్కడో మహిళ తనకు నచ్చిన పార్టీ గెలిచిందని ఏకంగా నాలుక కోసేసుకుంది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. 32 ఏళ్ల వనిత అనే మహిళ డీఎంకే పార్టీకి అభిమాని. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధిస్తే తన నాలుకను మొక్కుగా చెల్లిస్తానని ఆమె దేవుడికి మొక్కుకుందట. ఆదివారం ఎన్నికల ఫలితాల్లో డీఎంకే విక్టరీ కొట్టింది. దీంతో సమీపంలోని మూతాలమ్మన్ ఆలయానికి వెళ్లిన వనిత.. మొక్కు ప్రకారం తన నాలుకను కోసి దేవతకు సమర్పించాలని భావించింది. అయితే కరోనా ఆంక్షల నేపథ్యంలో గుడిలోకి అనుమతి లేకపోవడంతో బయటే నాలుకను సమర్పించి అక్కడే పడిపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.