బుర్ఖా ధరించి సొంతింటికే కన్నం వేసిన మహిళ

బుర్ఖా ధరించి సొంతింటికే కన్నం వేసిన మహిళ
  • తల్లికి తనకంటే చెల్లెలంటేనే ఎక్కువిష్టమని దొంగతనం చేసిందట
  • సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగను గుర్తించిన పోలీసులు

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఉత్తమ్​నగర్​లోని ఓ ఇంట్లో జనవరి 31న దొంగతనం జరిగింది. బీరువాలో దాచిన బంగారు నగలతో పాటు రూ.25 వేల నగదు కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. ఇంటి యజమానురాలు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా బుర్ఖా ధరించిన ఓ మహిళ ఇంట్లోకి వెళ్లడం కనిపించింది. ఆమెను గుర్తించేందుకు వివిధ మార్గాల్లో ప్రయత్నించిన పోలీసులు చివరకు బాధితురాలి పెద్ద కూతురే దొంగతనానికి పాల్పడిందని తేల్చారు. సొంతింట్లోనే దొంగతనం ఎందుకు చేశావన్న ప్రశ్నకు ఆ యువతి చెప్పిన సమాధానం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. తనకంటే చెల్లెలంటేనే తల్లికి ఇష్టమని, ఆ ఇష్టంతోనే పెద్ద మొత్తంలో నగలు చేయించి దాచిందని ఆరోపించింది. ఆ కోపంతోనే దొంగతనం చేశానని చెప్పింది.

తల్లి దగ్గరి నుంచి తాళాలు కొట్టేసి..

ఉత్తమ్ నగర్​లో నివసించే కమలేశ్​ అనే మహిళకు ఇద్దరు కూతుళ్లు.. పెద్ద కూతురు శ్వేత అక్కడికి దగ్గర్లోనే మరో ఇంట్లో ఉంటోంది. చిన్న కూతురుతో కలిసి తల్లి సొంతింట్లో ఉంటున్నారు. కూతురు ఉద్యోగానికి వెళ్లిన తర్వాత కమలేశ్​ తన పెద్ద కూతురు శ్వేత ఇంటికి వెళుతుండేది. తరచుగా తల్లి తన ఇంటికి రావడం, చెల్లెలు ఉద్యోగానికి వెళ్లడం గమనించిన శ్వేత.. గత నెలాఖరున తల్లి దగ్గరి నుంచి ఇంటి తాళాలు కొట్టేసింది. ఆపై కూరగాయలు తీసుకొస్తానని బయటకు వచ్చి నేరుగా ఓ పబ్లిక్ టాయిలెట్​లోకి వెళ్లింది. అక్కడ బుర్ఖా ధరించి తల్లి ఇంటికి వెళ్లింది. వెంట తీసుకెళ్లిన తాళం చెవులతో ఇంట్లోకి ప్రవేశించి, బీరువా తెరిచి నగలు, నగదు తీసుకెళ్లింది. శ్వేత తిరిగి వచ్చిన తర్వాత కమలేశ్​తన ఇంటికి వెళ్లి చూడగా.. నగలు, నగదు మాయమైన విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చుట్టుపక్కల సీసీకెమెరా ఫుటేజీలను చెక్ చేసిన పోలీసులు చివరకు ఈ దొంగతనానికి పాల్పడింది శ్వేతనేనని తేల్చారు. నిందితురాలిని అరెస్టు చేసి స్టేషన్​కు తీసుకెళ్లారు. చోరీ చేసిన నగలు, నగదును రికవరీ చేశారు.