ప్రేమ కోసం కొందరు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ప్రేమించినవారి కోసం ఎంతటి సాహసానికైనా ఒడిగడతారు. ప్రేమించిన వారి కోసం తల్లిదండ్రులను కూడా వదిలేసేందుకు ఇష్టపడతారు. అయితే ఓ ప్రియురాలు మాత్రం తాను ప్రేమించినవాడిని పెళ్లాడేందుకు ఏకంగా రూ. 2 వేల కోట్లను వదిలేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఏంజెలిన్ ఫ్రాన్సిస్ అనే అమ్మాయి..మలేషియాలో బిజినెస్ మాగ్నెట్ ఖూ కే పెంగ్, మాజీ మిస్ మలేషియా పౌలిన్ చాయ్ కూతురు. ఏంజెలిన్ ఫ్రాన్సిస్...జెడిడియా ఫ్రాన్సిస్ ను ప్రేమించింది. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు ఏంజెలిన్ తెలిపింది. జెడిడియాను వివాహం చేసుకుంటానని చెప్పింది. అందుకు ఏంజెలిన్ తల్లిండ్రులు ఒప్పుకోలేదు. పైగా జెడిడియాను పెళ్లి చేసుకుంటే తమ రూ. 2,484 కోట్ల విలువైన కుటుంబ వారసత్వ ఆస్తిపై ఆశలు వదులుకోవాలని ఏంజెలిన్ ను హెచ్చరించారు. అయినా లెక్కచేయని ఏంజెలిన్..ప్రియుడిని పెళ్లాడాలని ఏంజెలిన్ నిర్ణయించుకుంది. వీరిద్దరు 2008లో పెళ్లి చేసుకుని వారి కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు.
కొన్నాళ్ల తర్వాత ఏంజెలిన్ తల్లిదండ్రుల మధ్య వివాదం నెలకొనడంతో..వారు విడాకులు తీసుకునేందుకు సిద్దమయ్యారు. ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు ఏంజెలిన్ ను పోలీసులు కోర్టుకు పిలిచారు. అయితే కోర్టులో ఏంజెలిన్ తల్లికి మద్దతుగా నిలిచింది. తన తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటున్నప్పుడు తల్లి కుటుంబాన్ని అన్ని తానై నడిపించిందని ప్రశంసించింది.
ఏంజెలిన్ ఫ్రాన్సిస్, జెడిడియా ఫ్రాన్సిస్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటిలో కలిశారు. అక్కడ ఒకరినొకరు డేటింగ్ చేయడం ప్రారంభించిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.