కర్ణాటకలో ఆధార్ లేదని ఆస్పత్రిలో చేర్పించుకోలె..

కర్ణాటకలో ఆధార్ లేదని ఆస్పత్రిలో చేర్పించుకోలె..

దేశంలో కేంద్రం అన్ని పథకాలకూ ఆధార్ ను అనుసంధానం చేసింది. అంతవరకూ బాగానే ఉన్నా తాజాగా ఆధార్... ఓ మహిళ, ఇద్దరు శిశువుల ప్రాణాల బలి తీసుకోవడానికి కారణమైంది. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరులో జరిగింది. కస్తూరి అనే మహిళ డెలివరీ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. కానీ ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకునేందుకు వైద్యులు,సిబ్బంది నిరాకరించారు. ఆధార్‌, ప్రసూతి కార్డులు లేవంటూ అభ్యంతరం చెప్పారు. పైగా బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని విధుల్లో ఉన్న డాక్టర్‌ సలహా కూడా ఇచ్చాడు. నొప్పులు ఎక్కువయ్యాయని మొరపెట్టుకున్నా ఆస్పత్రి ఎలాంటి కనికరం చూపించలేదు. దీంతో చేసేదేం లేక అలా అవస్థలు పడుతూనే ఆ రాత్రి తన ఇంటికి చేరుకుంది. తరువాతి రోజు ఉదయం ఇంట్లోనే ఓ శిశువుకు జన్మనిచ్చిన ఆ మహిళ.. వెంటనే మరో శివువును ప్రసవించేలోపే చనిపోయింది. తల్లితో పాటు ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోవడం స్థానికుల్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.

తమిళనాడుకు చెందిన కస్తూరి అనే మహిళ గర్భవతి అయ్యాక భర్తతో విభేదాల కారణంగా అతనికి దూరంగా ఉంటుంది. కర్ణాటక వచ్చి తుమకూరు భారతీనగరలోని ఓ అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ కాలం వెల్లదీస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు నెలలు నిండి నొప్పులు రావడంతో చికిత్సకు డబ్బు లేకపోవడంతో స్థానికులు సాయం చేశారు. అలా ఆ మహిళను ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించడంతో రాత్రి మళ్లీ తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. కస్తూరి రాత్రంతా కాన్పు నొప్పుల బాధ అనుభవించింది. ప్రసవం సమయంలో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు వదిలింది.

ఈ ఘటనపై నైతిక బాధ్యత వహించి ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి డిమాండ్‌ చేశారు. అధికార పీఠాన్ని కాపాడుకునేందుకే బసవరాజ బొమ్మైకి కాలం సరిపోతోందని వరుస ట్వీట్లతో నిలదీశారు. కాగా ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని మంత్రి సుధాకర్‌ తెలిపారు. విధుల్లో ఉన్న వైద్యుడు సహా ముగ్గురు సిబ్బందిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.