ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం

ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం

నిర్భయ ఘటనతో నిర్భయ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చినా ఢిల్లీలో మాత్రం అత్యాచారాలు ఆగడంలేదు. కదులుతున్న బస్సులో నిర్భయ ఘటన జరిగితే.. తాజాగా ఓ మహిళపై కారులో అత్యాచారం జరిగింది. ఢిల్లీకి చెందిన ఒక మహిళ మెహ్రౌలి-గురుగ్రామ్ రోడ్‌లోని ఒక ప్రముఖ మాల్‌లో దుస్తుల షాపులో పనిచేస్తోంది. బుధవారం రాత్రి తన షిఫ్ట్ అయిపోయిన తర్వాత బాధితురాలు రాత్రి 8.15 గంటలకు ఇంటికి వెళ్లడానికి బస్ స్టాప్‌లో నిలబడింది. అదే సమయంలో ఆ వైపుగా వచ్చిన క్యాబ్ డ్రైవర్ ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడు. బాధితురాలు వెనుక సీట్లో కూర్చోబోగా.. వెనుక సీటు ఇతర ప్రయాణీకుల కోసం వదిలివేయమని డ్రైవర్ ఆమెను కోరాడు. దాంతో బాధితురాలు ముందు సీట్లో కూర్చుంది. అనంతరం కొంత దూరం వెళ్లిన తర్వాత కారును నిర్మానుష్య ప్రాంతంలో ఆపి.. అరిస్తే చంపేస్తానని బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు.

ఈ ఘటనపై గురుగ్రామ్ పోలీసు అధికారి సుభాష్ బోకెన్ మాట్లాడుతూ.. ‘క్యాబ్ డ్రైవర్ బాధితురాలి నుంచి పర్స్, ఫోన్ లాక్కొని బెదిరించి కారులోనే అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను ఆయా నగర్‌లో వదిలేసి వెళ్లాడు. అక్కడి నుంచి వెళ్లే ముందు నిందితుడు.. ఆమె పర్స్ మరియు ఫోన్ వదిలేసి వెళ్లాడు. వెంటనే బాధితురాలు తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది’ అని ఆయన తెలిపారు.

బాధితురాలు మరుసటి రోజైన గురువారం తన భర్తతో కలిసి డీఎల్ఎఫ్ ఫేజ్ -2 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు డీఎల్ఎఫ్ ఫేజ్ -2 పోలీస్ స్టేషన్లో క్యాబ్ డ్రైవర్‌పై ఐపీసీలోని సెక్షన్ 376 (అత్యాచారం) మరియు 354 (వేధింపుల) కింద కేసు నమోదు చేసినట్లు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా డ్రైవర్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.