
ఏటూరునాగారం, వెలుగు: పానీ పూరి బండి నడుపుతూ యువతకు గంజాయి సప్లై చేస్తున్న మహిళను ఏటూరునాగారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రాజ్‌కుమార్ వివరాల ప్రకారం.. చిన్నబోయినపల్లికి చెందిన ఎస్కే.నిఖత్ (జాను) అనే మహిళ యువతకు విక్రయించేందుకు స్కూటీలో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ గిరిజన బాలికల ఉన్నత పాఠశాల వద్ద పట్టుకున్నారు.
సదరు మహిళను విచారించగా హనుమకొండ బస్టాండ్ లో వాహదుల్లా దగ్గర గంజాయి కొనుగోలు చేసి చిన్నబోయినపల్లికి బస్సులో వచ్చి, అక్కడి నుంచి ఏటూరునాగారంలోని తన పానీపూరి షాపు వద్దకు వస్తున్నట్లు తెలిపింది. పట్టుబడిన మహిళ నుంచి 230 గ్రాముల ఎండు గంజాయి, స్కూటీ, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత గంజాయి, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఇటువంటి నేరాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి తరలిస్తున్న మహిళను పట్టుకున్న ఎస్సై రాజ్‌కుమార్, సిబ్బందిని ఏఎస్పీ శివమ్ ఉపాధ్యాయ అభినందించారు.