ఊహించని షాక్ : కుక్కపై యాసిడ్ దాడి.. ఓ కన్నుపోయింది.. అమ్మాయిపై పోలీస్ కేసు

ఊహించని షాక్ : కుక్కపై యాసిడ్ దాడి.. ఓ కన్నుపోయింది.. అమ్మాయిపై పోలీస్ కేసు

వీధి కుక్కలు దాడి చేయటం.. కుక్కల దాడిలో చనిపోవటం ఇప్పటి వరకు చూశాం.. కుక్కల నుంచి రక్షణ కోసం కర్రలు, రాళ్లు పెట్టుకోవటం.. వాటితో కొట్టటం కామన్. ముంబైలోని ఓ అమ్మాయి ఊహించని విధంగా చేసింది. తనపైకి వస్తున్న వీధి కుక్క నుంచి రక్షించుకోవటానికి.. ఆ కుక్కపై యాసిడ్ పోసింది. యాసిడ్ వల్ల ఆ కుక్క విలవిల్లాడింది. అటూ ఇటూ పరిగెత్తింది. యాసిడ్ దాడిలో ఆ కుక్క ఓ కన్ను కోల్పోయింది.. సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా కుక్కపై యాసిడ్ దాడి చేసిన అమ్మాయిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

 పూర్తి వివరాల్లోకి వెళితే

 కుక్కపై మహిళ యాసిడ్ పోసిన ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది.  మాల్వానీ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల శబిస్తా సుహైల్ అన్సారీ.. అదే అపార్ట్‌మెంట్‌లో ఉండే వేరే కుటుంబం పెంచుకునే బ్రౌనీ అనే కుక్కపై యాసిడ్ పోయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యాసిడ్ పోయడంతో కుక్కకు తీవ్ర గాయాలు కాగా.. స్థానికంగా ఉన్న వెటర్నరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై బ్రౌనీ కుక్క యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. అయితే ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఆ వీడియో ఆధారంగా పోలీసులు శబిస్తా సుహైల్ అన్సారీని గుర్తించి అరెస్ట్ చేశారు. ఐపీసీలోని జంతువులపై క్రూరమైన చర్యలకు పాల్పడినందుకు గానూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు.

దాడికి శబిస్తా వివరణ

అయితే బ్రౌనీ అనే కుక్కపై యాసిడ్ పోయడానికి గల కారణాన్ని ఆ మహిళ పోలీసులకు వివరించింది. తాను పెంచుకుంటున్న పిల్లితో బ్రౌనీ ఆడుకోవడం శబిస్తా సుహైల్ అన్సారీ తట్టుకోలేకపోయింది. పిల్లి, బ్రౌనీ ఆడుకోవడం గమనించిన శబిస్తా సుహైల్ అన్సారీ.. పలు మార్లు బ్రౌనీ యజమానికి ఫిర్యాదు చేసింది. అయితే వారు పట్టించుకోకపోవడంతో కొన్నిసార్లు హెచ్చరించింది. అయినా ఆ బ్రౌనీ, పిల్లి ఆడుకోవడం మానకపోవడంతో ఆమెకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆ కుక్కను చంపేయాలని ప్రయత్నించింది. ఈ క్రమంలోనే అపార్ట్‌మెంట్ ముందు ఉన్న కుక్కపై యాసిడ్ పోసింది. యాసిడ్ పోయడంతో ఆ కుక్క భయంతో అరుస్తూ అక్కడి నుంచి పారిపోవడం వీడియోలో కనపించింది. 

పెంపుడు జంతువులు అంటే చాలా మంది ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటారు. వాటిని చిన్నపిల్లల్లా చూస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అయితే పెంపుడు శునకాలు కూడా యజమానులపై అంతే ప్రేమను చూపిస్తాయి. అవి ఇతరులను చూస్తే మాత్రం అరుస్తూ, కరుస్తూ ఉంటాయి. ఇలా ఒకరి పెంపుడు శునకాలపై ఇరుగు పొరుగున ఉండేవారు కంప్లైంట్ చేయడం ఇటీవలి కాలంలో ఎక్కువ అయ్యాయి. ఇక అపార్ట్‌మెంట్‌లలో ఉండేవారి పరిస్థితి మరింత దారుణం. ఇతరుల పెంపుడు కుక్క తమ ఇంట్లోకి వచ్చిందనో.. తమను చూసి అరుస్తోందనో గొడవ పెట్టుకునేవారు చాలా మంది ఉంటారు. అయితే తామేమీ తక్కువ తినలేదని.. యజమానులు కూడా తమ పెంపుడు శునకాలను సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇలా చాలానే ఘటనలు జరిగాయి. అయితే కోపం పట్టలేని ఓ మహిళ.. తన పొరుగింటి వారికి చెందిన కుక్కపై ఏకంగా యాసిడ్ పోసింది.