భర్త, పిల్లల ఎదుటే మహిళకు తాలిబన్ల తరహాలో శిక్ష

భర్త, పిల్లల ఎదుటే మహిళకు తాలిబన్ల తరహాలో శిక్ష

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లోని ఓ గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థులు ఓ మహిళను తాలిబన్ల తరహాలో శిక్షించారు. సదరు మహిళ అదే గ్రామానికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని ఆరోపణలు రావడమే అందుకు కారణం. భర్త, పిల్లల ఎదుటే సదరు మహిళను దారుణంగా అవమానించారు. 

ప్రతాప్‌గఢ్‌, హతిగావా గ్రామ పరిధిలోని ఛోట్కీ ఇబ్రహీంపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ అబ్బాయితో మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపణలు రావడంతో పంచాయితీ పెద్దలు ఇద్దరికీ శిక్ష విధించారు. అయితే, ప్రేమికుడు తప్పించుకోగా గ్రామస్థులు మహిళను పట్టుకుని చెట్టుకు కట్టేసి కొట్టారు. అనంతరం ఆమె జుట్టు కత్తిరించి, నల్లటి సిరాను ముఖానికి పూశారు. అంతటితో వారి అకృత్యాలు ఆగలేదు. ఆమె మెడలో చెప్పు దండ చేసి అవమానించారు. ఆ సమయంలో సదరు మహిళ భర్త, ముగ్గురు పిల్లలు అక్కడే ఉన్నారు. కుమారుడి వయస్సు 12 ఏళ్లు కాగా, ఇద్దరు కుమార్తెలు చిన్న వయస్సు వారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ప్రేమికుడు తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను రక్షించారు. ఈ ఘటనకు సంబంధించి 15 మందిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా గ్రామంలో పోలీసు సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.