మోడీ ట్విట్టర్లో లైఫ్ జర్నీని పంచుకున్నఏడుగురు వీళ్లే..

మోడీ ట్విట్టర్లో లైఫ్ జర్నీని పంచుకున్నఏడుగురు వీళ్లే..

ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ అకౌంట్ ను ఏడుగురు మహిళలకు అప్పగించారు. ఆ ఏడుగురు తమ లైఫ్ జర్నీని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకుంటారని చెప్పారు. ఆదివారం ఉదయాన్నే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మోడీ.. వరుసగా ట్వీట్లు చేశారు. ‘‘కొన్నిరోజుల కిందట నేను చెప్పినట్లే.. సైన్ ఆఫ్ చేస్తున్నా. ఈ రోజంతా ఏడుగురు మహిళా అచీవర్లు ..తమ లైఫ్ జర్నీని షేర్ చేసుకుంటారు. నా సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతారు” అని చెప్పారు. ‘‘ఈ మహిళలు గొప్ప కృషి చేశారు. వారి పోరాటాలు, ఆకాంక్షలు లక్షలాది మందినిమోటివేట్ చేస్తాయి. అలాంటి మహిళల విజయాలను సెలబ్రేట్ చేసుకుందాం. వారి నుంచి నేర్చుకుందాం” అని ట్వీట్ చేశారు. తర్వాత ఏడుగురు మహిళలు తమ లైఫ్ జర్నీని ట్విట్టర్ లో పంచుకున్నారు.

అద్భుతాలు జరుగుతయ్: ఆరిఫా

కాశ్మీర్​లో ఉద్యోగాలు సృష్టించాలని తాను కోరుకుంటున్నానని శ్రీనగర్​కు చెందిన ఎంటర్​ప్రెన్యూర్ ఆరిఫా చెప్పారు. ‘‘కాశ్మీర్ సంప్రదాయ హస్తకళలను పునరుద్ధరించాలనేది నా కల. ఎందుకంటే ఇది స్థానిక మహిళలను శక్తివంతం చేసే సాధనం. ఇక్కడి మహిళా చేతివృత్తుల వారి పరిస్థితిని నేను చూశాను. అందుకే ‘నామ్డా క్రాఫ్ట్‌‌’ను రివైజ్ చేయడానికి పని ప్రారంభించాను” ఆరిఫా ట్వీట్ చేశారు. ‘‘ట్రెడిషన్, మోడర్నిటీ కలిసినప్పుడు.. అద్భుతాలు జరుగుతాయి. ఢిల్లీలో జరుగుతున్న హస్తకళల ఎగ్జిబిషన్​లో మేం తయారు చేసిన వస్తువులు ప్రదర్శిస్తున్నాం” అని వివరించారు.

ఆ సంపద కోల్పోవద్దు: కల్పన

హైదరాబాద్​కు చెందిన కల్పనా రమేశ్.. ఆర్కిటెక్ట్. తర్వాత తరాలకు ‘నీటి వసతి’ కల్పించేందుకు తాను చేస్తున్న వర్క్స్ గురించి ఆమె వివరించారు. ‘‘చిన్న ప్రయత్నాలు పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. నీళ్లు.. మనకు దొరికిన విలువైన వారసత్వ సంపద. మన తర్వాతి తరాలను ఈ సంపద కోల్పోకుండా చూద్దాం. నీటిని బాధ్యతాయుతంగా ఉపయోగించడం, వర్షపు నీటిని భద్రపరచడం, సరస్సులను కాపాడటం, వాడుకున్న నీటిని రీసైకిల్ చేయడం, అవగాహన కల్పించడం ద్వారా మాకు సహకరించండి’’ అని ఆమె ట్వీట్‌‌ చేశారు.

నా తల్లి ప్రేరణతో: స్నేహ మోహన్

చెన్నైలో ‘ఫుడ్ బ్యాంక్ ఇండియా’ పేరుతో సంస్థను నడుపుతున్నారు స్నేహ మోహన్ దాస్. ఏడుగురు మహిళల్లో ఫస్ట్ ఇంటరాక్ట్ అయ్యారు. ఒక వీడియోతోపాటు ట్వీట్ చేశారు. ‘‘హలో.. నేను స్నేహా మోహన్‌‌దాస్. నిరాశ్రయులకు ఆహారం ఇచ్చే అలవాటును నాలో కలిగించిన నా తల్లి ప్రేరణతో నేను ఫుడ్‌‌బ్యాంక్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించాను. పేదలకు మంచి భవిష్యత్​ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇది” అని ఆమె చెప్పారు.

బంజరా హస్తకళ: విజయ

మహారాష్ర్టలోని బంజారా కమ్యూనిటీకి చెందిన విజయ పవార్.. చేతివృత్తి కళాకారిణి. ‘‘మీరు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన హస్తకళల గురించి వినే ఉంటారు. నా తోటి భారతీయులారా.. గ్రామీణ మహారాష్ట్రలోని బంజారా కమ్యూనిటీకి చెందిన హ్యాండీక్రాఫ్ట్​లను మీ ముందు ఉంచుతున్నా. 20 ఏళ్లుగా నేను దీనిపై కృషి చేస్తున్నా. ఇంకా వెయ్యి మంది మహిళలు సాయం చేస్తున్నారు” అని
వివరించారు.

సంకల్పంతో పని చేస్తే: వీణాదేవి

బీహార్​లోని ముంగెర్ గ్రామానికి చెందిన వీణాదేవి.. గౌరవం, గుర్తింపు కోసం తాను చేసిన హార్డ్ వర్క్​ను గురించి తెలిపారు. సర్పంచ్ స్థానం సంపాదించేందుకు తాను ఎంత కష్టపడి పని చేశారో పంచుకున్నారు. ‘‘సంకల్పంతో పని చేసి ఏదైనా సాధించుకోవచ్చు. మంచం కింద ఒక కిలో పుట్టగొడుగులను పండించాను. అప్పుడే నాకు గుర్తింపు రావడం ప్రారంభమైంది. ఈ వ్యవసాయం పేరు మాత్రమే కాదు.. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది” అని వివరించారు.

చివరికి గెలిచా: కళావతి

కాన్పూర్​కు చెందిన కళావతి.. బహిరంగ మలవిసర్జనను ఆపేందుకు, తన పరిసరాల్లో పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు ఎలా నిధులు సేకరించారో పంచుకున్నారు. ‘‘నేను ఉండే చోట చెత్త చెదారాలు ఉండేవి. పరిశుభ్రత ద్వారా మనం ఈ పరిస్థితిని మార్చగలమన్న నమ్మకం ఉండేది నాకు. ముందుగా ప్రజలను ఒప్పించాలని నిర్ణయించుకున్నా. మరుగుదొడ్లు కట్టడానికి ప్రతి ఇంటికీ తిరిగి డబ్బులు సేకరించాం. చివరికి విజయం సాధించాం” అని వివరించారు.

అదే గొప్ప బహుమతి: మాళవిక

ప్రెసిడెంట్ అవార్డు అందుకున్న డాక్టర్ మాళవిక అయ్యర్ తన జర్నీని పంచుకున్నారు. తనకు 13 ఏళ్లు ఉన్నప్పుడు జరిగిన బాంబు పేలుడు నుంచి ఎలా ప్రాణాలతో బయటపడ్డారో వివరించారు. ఫ్యామిలీ సపోర్టుతో పీహెచ్​డీ పూర్తి చేశానని చెప్పారు. ‘‘ఒక భయంకరమైన బాంబు పేలుడు నుంచి ప్రాణాలతో బయటపడ్డా.. నా రెండు చేతులు పోయాయి. నా కాళ్లు దెబ్బతిన్నాయి. అయినా నేను పనిచేశాను. పీహెచ్​డీ పొందాను’’ అని పేర్కొన్నారు.‘#SheInspiresUs’ అనే హ్యాష్‌‌ట్యాగ్‌‌తో ట్వీట్ చేశారు